సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 23, 2020 , 03:38:55

ప్రగతి వికాసం

 ప్రగతి వికాసం

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22: ఇప్పటికే పల్లెప్రగతితో గ్రామాలను పచ్చదనం, పరిశుభ్రంగా మార్చిన తెలంగాణ సర్కార్‌.. పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించి మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వం.. ఈ నెల 24వ తేదీ నుంచి పట్టణ ప్రగతి చేపట్టబోతున్నది. నిధులను పక్కాగా, పకడ్బందీగా ఖర్చు చేసేందుకు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కొత్త చట్టాలతో పల్లె, పట్నంలో అభివృద్ధికి అడుగులు పడుతుండగా.. తాజాగా పట్టణ ప్రగతితో జనగామ ‘పుర’పాలనకు కొత్తరూపు సంతరించుకోనుంది. పట్టణ వార్డులు, కాలనీలకు ప్రాణం పోసే విధంగా స్వపరిపాలన కాంతులను అందించేలా తెలంగాణ ప్రభుత్వం మరో మహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. గ్రామీణ ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలతో విజయపథంలో పయనిస్తున్న మాదిరిగానే పట్టణంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. 


తెలంగాణ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తూ పవర్‌వీక్‌, హరితహారం వంటి కార్యక్రమాలతో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న తరహాలోనే పట్టణ పారిశుద్ధ్యం, హరిత ప్రణాళిక, విద్యుత్‌ సరఫరా, పట్టణస్థాయి పనులు గుర్తించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణ పరిపాలన ఎలా ముందడుగు వేయాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అందుకనుగుణంగా కలెక్టర్‌ ఆదేశాలతో పట్టణ వార్డు అభివృద్ధి కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో అవినీతి రహిత వ్యవస్థను తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి ప్రణాళికకు రూపకల్పన చేశారు. ఇందుకోసం ఫిబ్రవరి, మార్చి నెలలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌కు ప్రతినెలా రూ. 70 కోట్లు, రెండు నెలలు కలిపి రూ. 140 కోట్లు రానున్నాయి. వీటికితోడు 14వ ఆర్థిక సంఘం, ఇతర పద్దుల నుంచి వచ్చే నిధుల నుంచి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు ఉండనున్నాయి.


పట్టణంలో పవర్‌వీక్‌, హరితహారం

పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు పవర్‌వీక్‌, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు 10 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా, వీటి అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు కీలకంగా మారనున్నారు. సీఎం మున్సిపల్‌ శాఖ సమీక్షలో పట్టణ వార్డులు, విలీన కాలనీలను బలోపేతం చేసేందుకు ఏరకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఇందులో పవర్‌వీక్‌, హరితహారం కీలక అంశాలుగా ఉంటే.. వంగిపోయి ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వేలాడే విద్యుత్‌ తీగలను గుర్తించి సరిచేయడం, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్‌ స్తంభాలను నాటడం చేయాల్సి ఉంటుంది. ఇక హరితహారంలో భాగంగా మూడు వార్డులకు ఒక నర్సరీని ఏర్పాటు చేయడం, ఇంటింటా విరివిగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి రక్షించడం, పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకూ బాధ్యత తీసుకోవడం, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి యజమానులతో మాట్లాడి మొక్కలు సరఫరా చేయాల్సి ఉంటుంది.


పౌర సదుపాయాలు..

పట్టణ ప్రజలు, జిల్లాకేంద్రానికి వచ్చే వారికి అవసరమైన పబ్లిక్‌ టాయిలెట్లు ఉండాలి. స్ట్రీట్‌ వెండర్స్‌ కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలకు నిర్దిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి. ప్రమాదరహితమైన వంగిన విద్యుత్‌ స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్‌పాత్‌లపై ఉంటే ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడం, వేలాడే వైర్లను సరిచేయాలి.

కార్యాచరణ ఇలా ..

చెత్త సేకరణ, రవాణా కోసం బ్రాండింగ్‌ ఉన్న వాహనాలను సేకరించాలి, సెస్‌పూల్‌ గుర్తింపు, నీటి మడుగులలో, నీరు శుభ్రం చేయలేని చోట వారానికోసారి యాంటీ లార్వాబాల్స జార విడవాలి. డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు స్థలాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలి.

అభివృద్ధి పనులు..

ప్రధానంగా ఖాళీ స్థలాలు, పార్కులు, నీటి వనరుల దగ్గర నర్సరీలను ఏర్పాటు చేయాలి. చిన్నచిన్న నర్సరీలను అభివృద్ధి చేయడం, వీలుకాకుంటే ఈజీఎస్‌ కింద సమీప పంచాయతీల్లో ఏర్పాటు చేయాలి.

విద్యుత్‌ సరఫరా..

వంగిన, తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలును మార్చడం, వదులుగా ఉంటే వైర్లను బిగించడం, మీటర్లు, మోటర్ల కెపాసిటర్లను మార్చి వేరే కెపాసిటర్లను ఏర్పాటు చేయాలి. పాదచారుల బాటలపై ఉన్న స్తంభాలను గుర్తించి వాటిని తొలగించాలి. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలి. 

పనుల గుర్తింపు ఇలా..

పార్కులు, ప్రజా మరుగుదొడ్లు, కూడళ్లు వంటి ప్రాంతాల్లో వీధిదీపాల మదింపు, చీకటి ప్రాంతాలను గుర్తించడం, అదనపు స్తంభాలు, 3వ లైన్‌ ఏర్పాటు, ఇళ్లపై నుంచి వెళ్లే వైర్లు, రోడ్లపై ఉండే స్తంభాలను గుర్తించి తొలగించాలి. శ్మశాన వాటి స్థలాలు గుర్తించాలి. వైకుంఠధామాలు ఏర్పాటు చేయడం, సమీకృత మార్కెట్లకు స్థలాల గుర్తింపు, పార్కులు, ఆట స్థలాల గుర్తింపు, హరిత వనాల ఏర్పాటు, డంపింగ్‌ స్థలాలను గుర్తించాలి.


పారిశుద్ధ్యం..

రహదారుల పక్కన ఉన్న పొదలు, తుప్పులు, పిచ్చిమొక్కలు, గడ్డిమొక్కలు, జిల్లేడు, సర్కారు తుమ్మలను తొలగించాలి. రహదారి పక్కన ఉండే భవన నిర్మాణ వ్యర్థ్యాలను తొలగించాలి. మురుగు కాల్వలను శుభ్రం చేయడం, పూడిక తీయడం, ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలి. ప్రజా స్థలాలు, ప్రజా సంస్థలు, సమూదాయ ప్రాంతాలను శుభ్రం చేయడం, పార్కులు, సముదాయక స్థలాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రజాసదుపాయ స్థలాలు, బస్టాండ్లు, శ్మశాన వాటిలు, మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచడం. శిథిలావ్యస్థలో ఉన్న గృహాల తొలగింపు, ఎండిపోయిన, పాడుబడిన బోర్‌బావులను మూసివేయడం, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించడం చేయాలి.


logo