గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 23, 2020 , 03:37:04

ఎస్సీడీడీలో ఏసీబీ దాడులు

ఎస్సీడీడీలో ఏసీబీ దాడులు

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : జిల్లా కేంద్రంలో ఇద్దరు అవినీతి అధికారులు అదే కార్యాలయంలో రిటైర్డు అయిన చిరుద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జీ గట్టుమల్లు, కార్యాలయ సూపరింటెండెంట్‌ మహ్మద్‌ ఖదీరుద్దీన్‌ అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందిన రేణుకుంట్ల అయిలయ్య నుంచి శనివారం రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల సమూదాయం (ధర్మకంచ)లోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధికారి కార్యాలయంలో శనివారం జరిగిన అవినీతి నిరోధకశాఖ దాడులు జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించాయి. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం.. వల పన్నీ ఏకంగా ఒక జిల్లాస్థాయి అధికారి, సూపరింటెండెంట్‌ను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది.


 గత ఏడాది డి సెంబర్‌ 11న జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవగిరి ఫృధ్వీరాజ్‌ లింగాల ఘనపురం పీహెచ్‌సీ (సిరిపురం సబ్‌సెంటర్‌) కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం బెంబరి అనితకు 13నెలల జీతభత్యాల విడుదలకు సంబంధించి వేతన బిల్లులు చేసేందుకు రూ.10వేలు లంచం డిమాండ్‌ చేసి రూ.4వేలు  తీసుకుంటూ వైద్యారోగ్య శా ఖ జూనియర్‌ అసిస్టెంట్‌ పట్టుబడిన సంఘటన మరువక ముందే జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు చోటు చేసుకున్నాయి. జనగామలోని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి 2019 డిసెంబర్‌ 31న ఉద్యోగ విరమణ పొందిన రేణుకుంట్ల అయిలయ్య తనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన పింఛన్‌, ఇతర రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు ఇప్పించాలని దరఖాస్తు చేసుకుంటే 45 రోజులుగా తిప్పుకున్న డీఎస్‌సీడీవో, సూపరింటెండెంట్‌ బిల్లులు చేయడం కోసం రూ.10వేల లంచం డిమాండ్‌ చేశారు. కాళ్లావేళ్ల పడి బతిమిలాడితే రూ.5వేలకు ఒప్పుకున్నప్పటికీ తనకు న్యాయంగా అందాల్సిన సొమ్ము చెల్లింపునకు లంచం ఇవ్వడం ఇష్టంలేని అయిలయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అవినీతి నిరోధకశాఖ ఏసీపీ మధుసూధన్‌, సీఐలు వాసాల సతీశ్‌, పులి వెంకట్‌, క్రాంతికుమార్‌ బృందం పథకం ప్రకారం గుట్టుమల్లు, ఖదీరుద్దీన్‌ను అరెస్టు చేసి, నగదును స్వాధీనం చేసుకున్నారు. 


logo