గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 22, 2020 , 03:30:25

ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ కమిటీ ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆలయాల అభివృద్ధిని విస్మరించాయన్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలయాలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆలయాల అభివృద్ధికి, రాష్ర్టాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ వల్లనే యాదాద్రి, వేములవాడ, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 


సీఎం కేసీఆర్‌ పాలకుర్తి పర్యాటక ప్రాంత అభివృద్ధికి రూ.22 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. రూ.10 కోట్లతో పాల్కురికి సోమనాథుడి కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎస్‌డీఎఫ్‌ నిధుల కింద సోమేశ్వర ఆలయాభివృద్ధికి రూ.5కోట్లు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆలయాభివృద్ధికి రూ.15కోట్లు మంజూరు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. తమ ఇలవెల్పు సోమేశ్వరుడేనన్నారు. సోమేశ్వరుడి దయ, సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతోనే తాను మంత్రినయ్యానని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. తనకు ఇష్టమైన సోమేశ్వరాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. సోమేశ్వర ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో పాలకుర్తికి డబుల్‌ రోడ్లు, మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటి సౌకర్యం, గోదావరి జలాలతో చెరువులు నింపానన్నారు. పరమ శివుడి దయతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఆయన వెంట డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, ఈవో వీరస్వామి, తహసీల్దార్‌, ఎన్‌ విజయభాస్కర్‌, సీఐ రమేశ్‌, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నవీన్‌, గుడిపుడి గోపాల్‌రావు, ఎర్రబెల్లి రాఘవరావు, అశోక్‌రెడ్డి, సారంగపాణి, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.


logo