బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 20, 2020 , 03:05:51

పల్లె, పట్నం మారాలి

పల్లె, పట్నం మారాలి

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 19: ‘పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టణ ప్రగతిని కొనసాగించాలి. ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా పని చేయాలి. నిర్దేశించిన అంశాలను పూర్తి చేసిన పల్లెలకు బహుమతిగా సీసీరోడ్లకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తా. పచ్చదనం.. పరిశుభ్రతతో ఊరూవాడ ముఖచిత్రం మారాలి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ శివారులోని భ్రమరాంభ కన్వెన్షన్‌ హాల్‌లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు పల్లె, పట్టణ ప్రగతిపై సమ్మేళనం నిర్వహించారు. మండలి చీఫ్‌విప్‌ బోడుకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్‌ కే నిఖిల, డీసీపీ శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్‌ ఓజే మధు, రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెళ్లి కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, జెడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీవో రాంరెడ్డి, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్‌ గాంధీనాయక్‌ హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో రాజకీయాలకతీతంగా ప్రజల సహకారంతో అభివృద్ధి కమిటీలు వేసుకొని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి ప్రణాళిక ద్వారా ఏడాది, ఐదేళ్ల కార్యాచరణతో పనులు ప్రతిపాదించుకొని జనగామ మున్సిపాలిటీని పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, హరితహారం, ట్రాక్టర్లు, ట్రాలీల కొనుగోలు వంటి నిర్దేశిత అంశాల్లో ముందున్న ప్రతి మండలంలోని ఐదు నుంచి ఆరు ఆదర్శ జీపీలను ఎంపిక చేసి, ప్రత్యేక నిధుల నుంచి సీసీరోడ్ల నిర్మాణాలకు రూ. 10 లక్షలు అందిస్తానని మంత్రి ప్రకటించారు. 


ఉపాధిహామీ కూలీలతో పనులు

ఉపాధిహామీ కూలీలను పల్లెప్రగతిలో ఊరిని శుభ్రం చేసుకునే పనులకు ఉపయోగించుకొని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను నిరంతరం కొనసాగించేలా చూడాలని డీఆర్డీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. నాటిన మొక్కలకు ఈజీఎస్‌ కూలీలతో నీళ్లు పట్టించడం, పెన్సింగ్‌ చేయించుకోవడం వంటి పనులు చేయించాలని, ఇప్పటి వరకు రెండు విడతల్లో హరితహారం కింద నాటిన మొక్కల్లో కచ్చితంగా 85 శాతం కాపాడాలని, అలా చేయని వారు తమ హయాంలో చేతగాని సర్పంచ్‌లుగా మిగిలిపోతారని హితవు పలికారు. పల్లెప్రగతి పనులను పరుగులు పెట్టించే సర్పంచ్‌లు, అధికారులను గౌరవించి నజరానా అందిస్తూనే డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీల ఏర్పాటు వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించే సర్పంచ్‌లు, అధికారులకు వారం రోజుల గడువు ఇస్తున్నా.. ఈలోగా పనితీరు మెరుగుపర్చుకుని లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు కఠినంగా ఉంటాయని ఎర్రబెల్లి ఈ సందర్భంగా హెచ్చరించారు.


అలక్ష్యంగా ఉంటే చర్యలు..

ప్రగతి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా సీరియస్‌గా ఉన్నారు.. అలక్ష్యంగా ఉంటే ఎవరైనా సరే సస్పెండ్‌ కావాల్సిందే అని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు  సాగుతున్నామని, దీనికి ప్రతిఒక్కరు సహకరించాలన్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం పనులు ఇకపై సర్పంచుల ఆధీనంలోకి తీసుకొని రోడ్ల మరమ్మత్తు, పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం మొక్కలకు నీటి సరఫరా వంటి అవసరాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన అన్ని పంచాయతీలు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కొనుగోలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి పనులకు ప్రతినెలా ప్రభుత్వం రూ. 339 కోట్ల నిధులు విడుదల చేస్తుందని ఎర్రబెల్లి వివరించారు. గ్రామాలు, పట్టణంలో అనుమతి లేకుండా చెట్లను నరికే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల పక్కన, ప్రభుత్వ స్థలాల్లో ఉంటే చెట్లకు రంగులు వేయాలని సూచించారు. 


సర్పంచ్‌లకు సర్వాధికారులు

గ్రామాల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సర్పంచ్‌లకు సర్వాధికారులు కట్టిబెట్టి.. పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు దయాకర్‌రావు వెల్లడించారు. హరితహారంలో మొక్కలు నాటి అందులో కనీసం 85 శాతం దక్కేలా చూడాలని కోరారు. రోడ్లు, పరిసరాల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించాలన్నారు. హరితహారంపై నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, కొత్త పంచాయతీలకు స్థలాలు సేకరించుకోవాలని మంత్రి సర్పంచ్‌లు, కార్యదర్శులకు సూచించారు. గత సర్పంచ్‌లకు రాని చక్కటి అవకాశం ప్రస్తుత స్థానిక ప్రజాప్రతినిధులకు వచ్చిందని ఊళ్లను బాగు చేసుకుని పది తరాలు చెప్పుకునేలా ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలను సంప్రదించి వారు అందించే విరాళాలతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.


ఆదర్శ మున్సిపాలిటీగా మారాలి

ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు జనగామలో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో రాజకీయాలకతీతంగా ప్రజల భాగస్వామ్యంతో వార్డు కమిటీలను వేసుకొని ఆమోదం పొంది ఏడాది, ఐదేళ్లకు సరిపడా కార్యక్రమాల రూపకల్పనతో వార్డులు, కాలనీలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్‌ కౌన్సిలర్లపై ఉందని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కష్టపడి పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు సాధిస్తున్నారని, ఇప్పటికే జిల్లాకేంద్రంలో కలెక్టరేట్‌ సముదాయం, రూ. 30 కోట్లతో పట్టణ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. వచ్చే ఆరు నెలల్లో జనగామ జిల్లాకేంద్రం రూపురేఖలు మారేలా పని చేయాలని అన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేనందున రాజకీయాలను పక్కనబెట్టి, పార్టీలను చూడకుండా వార్డు కమిటీలను వేసుకొని కాలనీల్లో డ్రైనేజీలను శుభ్రం చేసుకోవాలని కోరారు. ‘ఇళ్లపై విద్యుత్‌ తీగలు ఉంటే తొలగించుకోండి.. లూజ్‌ వైర్లు సరిచేసుకోండి.. శిథిలమైన పాత స్తంభాలను తొలగించి కొత్తవి బిగించుకోవాలి.. ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, మురికి తుమ్మలు లేకుండా చేసుకోవాలి.. ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వండి.. స్పందించకుంటే జరిమానా విధించండి.. పట్టణంలో కూడా ఐదు వార్డులకు ఒక నర్సరీ ఉండాలి.. ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలి.. రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో పబ్లిక్‌ టాయిలెట్లు ఉండాలి.. పట్టణ ప్రగతిలో నేను పాల్గొంటా.. వార్డుల్లో పర్యటిస్తా.. గెలిచామని సంబరపడొద్దు.. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పట్టణ ప్రగతిపై నిర్లక్ష్యం చేసే మున్సిపల్‌ కౌన్సిలర్ల పదవులు పోతాయి.. పని చేయకుంటే చర్యలు ఉంటాయి’ అని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.


నిధుల మంజూరులో జిల్లాకు పెద్దపీట

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు ముఖ్యమంత్రి రూ. 500 కోట్లు కేటాయిస్తే.. అందులోంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జనగామ జిల్లాకు నిధుల మంజూరులో పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాలకంటే రెట్టింపు నిధులు కేటాయిస్తా.. పనిచేసి నిధులు ఖర్చు చేయాల్సిన బాధ్యత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు సింగరేణి నిధుల నుంచి 115 మార్గాల్లో 100 కిలో మీటర్ల ఆర్‌అండ్‌బీ, ఈఎన్‌జీసీ రోడ్లకు రూ. 49 కోట్లు, ఈజీఎస్‌ కింద సీసీరోడ్లకు రూ. 34 కోట్లు, చెక్‌డ్యాంలకు రూ. 150 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లాను ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని, అందరం కలిసి జిల్లాను తెలంగాణలోనే అగ్రగామిగా నిలుపుకుందామని మంత్రి దయాకర్‌రావు కోరారు. అనంతరం పలు గ్రామపంచాయతీలకు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి ట్రాక్టర్లను అందజేశారు. 


logo