శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 19, 2020 , 04:08:20

పట్టణాలు మెరవాలె

పట్టణాలు మెరవాలె

‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మున్సిపల్‌ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.

  • వీధులు పరిశుభ్రంగా తయారు కావాలె
  • ప్రగతి భవన్‌లో మున్సిపల్‌ సమ్మేళనం
  • హాజరైన కలెక్టర్లు, చైర్మన్లు, కమిషనర్లు
  • అభివృద్ధిపై దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌
  • జనగామలోని 30 వార్డుల్లో ‘పట్టణ ప్రగతి’
  • 24న కార్యక్రమం ప్రారంభం

‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రగతి భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మున్సిపల్‌ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన జనగామ పరిధిలో 10 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కూడా రూపొందించింది. మున్సిపాలిటీకి సర్కారు నిధులు కూడా కేటాయించనుంది. దీంతో జనగామ పట్టణంలోని 30 వార్డులు మెరిసేలా ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కాగా, ఈ నెల 24న పట్టణ ప్రగతిపై సమీక్షిస్తారు. అనంతరం వార్డుల వారీగా కమిటీలను నియమించి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.  


జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లెప్రగతి స్ఫూర్తితో రాష్ట్రప్రభుత్వం పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఈమేరకు కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 24వ తేదీ నుంచి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వ్యూహ రచన చేశారు. ఇప్పటికే అధికారులకు సమాచారం అందించారు. కొద్దిరోజులుగా ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలు సైతం కసరత్తు చేశారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా కలెక్టర్లతో సమావేశమై పట్టణ ప్రగతి లక్ష్యాన్ని క్షుణ్ణంగా వివరించారు. కేసీఆర్‌ ఆదేశాల్ని తూచా తప్పకుండా జిల్లాల్లో అమలు చేసేందుకు యంత్రాంగం సంసిద్ధమవుతున్నది.


ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లదే బాధ్యత

పట్టణాల్ని దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా తీర్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లపై ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్భోద చేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం జరిగిన మున్సిపల్‌ సమ్మేళనంలో ఆయన ప్రజాప్రతినిధులకు, కలెక్టర్‌, మున్సిపల్‌ చైర్మపర్సన్‌, కౌన్సిలర్లుకు దిశానిర్దేశం చేశారు. పల్లెప్రగతి స్ఫూర్తిగా పట్టణ ప్రగతి నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు. వార్డులవారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక రూపొందించుకుని దానికి అనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. మూడు నెలల్లో పట్టణంలో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంట్‌ సంబంధిత సమస్యల్ని పరిష్కరించాలన్నారు. లేదంటే సంబంధిత ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌, కమిషనర్‌ బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. నిధుల వినియోగంలో కచ్చితత్వం పాటించాలన్నారు. ప్రణాళిక ప్రకారమే వ్యయం చేయాలని సూచించారు.


24వ తేదీ నుంచి 4 వరకు..

ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పట్టణానికి వార్షిక, పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. కౌన్సిలర్లను కలుపుకుని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రణాళిక తయారు చేయాలన్నారు. వార్డులవారీగా నియామకమైన సంఘాల వారి అభిప్రాయాల్ని స్వీకరించాలన్నారు. ప్రతి వార్డుకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించాలి, వార్డులో ఏం ఉన్నాయి, ఏమేం కావాలి, ఏయే పనులు చేయాలి అనేది కచ్చితంగా నిర్ధారించుకోవాలి. జనగామ ఎలా ఉండాలి అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని, దానికి సమాధానం వెతుక్కుంటే ఏం చేయాలో తెలుస్తుందన్నారు. ప్రతి రోజు చెత్తను, మురికి కాల్వలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన మంచి నీటిని సరఫరా చేయాలి. సాయంత్రం వీధి లైట్లు వెలగాలి, రహదారులపై గుంతలు లేకుండా చూసుకోవాలి. పట్టణాలు పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీర్‌ సూచించారు. చెత్త నిర్మూలనకు డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలు నిర్మించాలి. జనాభాను అనుసరించి మార్కెట్‌ ఏర్పాటు చేయాలి. శాఖాహార, మాంసాహార, పండ్ల, పూల మార్కెట్లు వేర్వేరుగా నిర్మించాలి. యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ప్రారంభించాలని సీఎం వివరించారు.


కనీస సదుపాయాల కల్పనకు కృషి

కనీస సదుపాయాలు ఏంటని నిర్ధారించుకుని వాటిని కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ శాఖకు చెందిన స్థలమైనా సరే ప్రజోపయోగం కోసం వినియోగించే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్నారు. స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలి. వీరి కోసం ప్రత్యేక స్థల కేటాయింపు జరగాలి. ఆటోలు, ట్యాక్సీలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, సరకు రవాణా వాహనాలను నిర్ధిష్టమైన ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయడానికి సదుపాయం కల్పించాలి. ప్రమాద రహితమైన విద్యుత్‌ వ్యవస్థ కలిగి ఉండాలి. వంగిన స్తంభాలు, తుప్పుపట్టిన, రోడ్డు మధ్యలోని స్తంభాలను, ఫుట్‌పాత్‌లపై గల ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలి. ఇండ్లపై వేలాడే విద్యుత్‌ తీగల్ని సరిచేయాలి. ఈ పనుల్ని చేయడానికి అవసరమైన నిధుల్ని బడ్జెట్‌లో కేటాయిస్తామని సీఏం ప్రకటించారు. చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీచేయాలి. ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైన వాహనాల్ని సమకూర్చుకోవాలి. డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.. వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి నెల రూ.148 కోట్లు చొప్పున ఆర్థిక సంఘం నిధులు అందిస్తామన్నారు. జనగామ మున్సిపాలిటీ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆర్థిక ప్రణాళికలో పది శాతం నిధులు పచ్చదనానికే కేటాయించాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభివృద్ధి నిధులు కూడా పట్టణ ప్రగతికి వినియోగించాలని ఆదేశించారు.


అక్రమాలకు పాల్పడితే చర్యలు

కొత్త మున్సిపల్‌ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణం, లే అవుట్‌ విషయంలో సులభతరమైన అనుమతుల విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. జీవో నంబర్‌ 58, 59 ద్వారా గతంలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను క్రమబద్దీకరించినట్లే అన్ని మున్సిపాలిటీల్లో మరో అవకాశం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలో చేపట్టబోతున్నదని పేర్కొన్నారు. కౌన్సిలర్లు బాధ్యతగా వ్యవహరించి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చాలన్నారు. మున్సిపాలిటీ అంటే చెత్త, కంపు అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, దాన్ని తొలగించాలన్నారు. ఫొటోలకు ఫోజులివ్వడం మానేసి పనులపై దృష్టి పెట్టాలన్నారు.


logo