ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 19, 2020 , 04:06:29

భక్తుల కొంగుబంగారం సోమేశ్వరస్వామి

భక్తుల కొంగుబంగారం సోమేశ్వరస్వామి

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో మొదటి వరుసలో నిలిచేది పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం క్షీరగిరి క్షేత్రం. పాలకుర్తి సోమన్నగా భక్తులు పిలుచుకునే సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహోత్సవాలు

  • మహిమ గల దివ్యక్షేత్రం పాలకుర్తి క్షీరగిరి
  • సోమన్నకు రక్షక భటులు తేనెటీగలు
  • 20 నుంచి స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు
  • నేటి నుంచి సిద్ధేశ్వరస్వామి ఉత్సవాలు

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాల్లో మొదటి వరుసలో నిలిచేది పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం క్షీరగిరి క్షేత్రం. పాలకుర్తి సోమన్నగా భక్తులు పిలుచుకునే సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వతేదీ వరకు కన్నుల పండువగా సాగుతాయి. భక్తుల కొంగుబంగారంగా స్వయంభువుగా వెలిసిన క్షీరగిరి క్షేత్రం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం. మునులు తపస్సు చేసిన సిద్ధ ప్రదేశం. ఈ ఆలయ గుహల నుంచి ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రక్కనే ఉన్న మరో గుహలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వెలిసి, శివ కేశవులకు భేదం లేదని ప్రబోధిస్తారు. ఇది హరి హర క్షేత్రం. ఇక్కడ శివుడు సోమేశ్వరస్వామిగా, విష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా స్వయంభువులుగా రెండు వేర్వేరు గుహల్లో వెలిసి భక్తులకు కన్నువపండువగా మారారు.      -పాలకుర్తి విలేకరి


పాలకుర్తి మండల కేంద్రంలో నెలకొని ఉన్న సోమేశ్వరస్వామిని సోమన్నగా వివిధ ప్రాంతాలవారు పిలుస్తారు. శ్రీ సోమేశ్వరస్వామి పాల్కురికి సోమనాథ కవి ఆరాధ్యదైవమని.. ఈ కవి ఇంటి పేరే పాలకుర్తిగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. సోమేశ్వర లక్ష్మీ నరసింహాస్వామి విశిష్టత గురించి పాల్కురికి సోమనాథుడు పేర్కొన్నట్లు చరిత్ర చెబుతున్నది. గద్య రచనకు ఆద్యుడు, ద్విపద కవిత్వ సృష్టికర్త అయిన పాల్కురికి నిత్యం కొండపైకి వెళ్లి రచనలు చేసి శైవ మతాన్ని ప్రచారం చేసే వాడని ప్రతీక. శివరాత్రిని సందర్భంగా నిర్వహించే ఈ జాతరకు జిల్లా నుంచే గాకుండా రాష్ట్రం నలుమూలలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వేలమంది భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించి తరిస్తుంటారు. పూర్వకాలం నుంచి పాడి, పంటలు అభివృద్ధిలోకి వస్తే ప్రత్యక్ష, పరోక్ష కోడెలను (కట్టి) మొక్కులు చెల్లించి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వార్లను రైతులు కొలుస్తారు. నిస్సంతులైన వారు కొబ్బరి కాయ బంధనం చేస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. సంతానం కలిగిన వారు బిడ్డలకు స్వామి వారి పేరును పెట్టుకుంటారు. 


సోమేశ్వరుడికి రక్షక భటులు తేనెటీగలు

స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్ధులై రాకపోయినా స్వామి వారికి రక్షణగా ఉన్న తేనెటీగలు వెంటపడుతాయని భక్తుల విశ్వాసం. ఇటువంటి సంఘటనలు అనేకమార్లు జరగడంతో భక్తులు చన్నీటి స్నానమాచరించి పరిశుద్ధలై కొండకు వస్తారు. లక్షల సంఖ్యలో  దర్శనం కోసం వచ్చే భక్తులకు కొండ పైన ఉన్న తేనేటీగలు సంగీత రాగాలతో స్వాగతం పలకడం విశేషం. 


కన్నుల పండువగా రథోత్సవం

రథోత్సవం రోజున పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎడ్ల బండ్లను శోభాయమానంగా అలంకరించి ప్రభలతో క్షీరగిరి క్షేత్రం (గుట్ట) చుట్టూ వలయాకారంలో తిరిగే దృశ్యం కన్నుల పండువగా ఉంటుంది. ఆలయం సమీపంలోని ఓంకారేశ్వరస్వామి (పంచగుళ్ళ) ఆలయం ఉంది. ఇందులో ఐదు దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు అలరిస్తాయి. ఆలయం ముందు పురాతన కాలం నాటి కోనేరు ఇప్పటికీ నీటితో కళ కళలాడుతుంది. ఈసారి జాతరకు ఐదు లక్షలకు పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈవో వీరస్వామి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, తొర్రూరు,  తిరుమలగిరి, జనగామ, హన్మకొండ, సూర్యపేట మోత్కూరు, నర్సంపేట, కొడకండ్ల, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.


జాతరకు సకల ఏర్పాట్లు

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి మేకల వీరస్వామి తెలిపారు. భక్తుల కోసం మూడు వేల చదరపు అడుగుల చలువ పందిళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వ తేదీ నుంచి గణపతి పూజ, ధ్వజారోహణతో ప్రారంభమవుతాయని చెప్పారు. 21వ తేదీన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం, రాత్రి 12 గంటల 26 నిమిషాలకు లింగోద్భవకాలం, 22న రథోత్సవం, ఎడ్ల బండ్లు తిరుగుట, 23న డోలారోహణము, వసంతోత్సవం, పుష్పయాగం, సదస్యము, పల్లకి సేవ,24న స్వామివారి సేవ, మహా అన్న పూజ, అగ్నిగుండాలతో బ్రహోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో ఈ సారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. భక్తులకు తాగు నీరు విషయంలో మిషన్‌ భగీరథ నీటిని నిరంతరం సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.     -మేకల వీరస్వామి ఈవో  పాలకుర్తి


logo