ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 18, 2020 , 03:24:25

పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళిక

పకడ్బందీగా పట్టణ ప్రగతి ప్రణాళిక

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 17 :  జనగామ మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో ‘పట్టణ ప్రగతి’ కార్యాచరణకు అధికారులు, సిబ్బంది, ప్రత్యేక అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ కే నిఖిల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో సమీక్షించిన ఆమె మున్సిపల్‌ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొన్నారు. మూడు అంశాలపై 30 రోజులపాటు నిర్వహించే కార్యాచరణపై అధికారులు, వార్డు అభివృద్ధి కమిటీలను సన్నద్ధం చేయాలని, ప్రజలు, మహిళలు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యావంతులతో కమిటీలు వేసుకోవాలని సూచించారు. ఒక్కో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి రోజువారీ కార్యక్రమాల బాధ్యతలను వారికి అప్పగించి తాగునీరు, విద్యుత్‌ సమస్యలు, శ్మశానవాటికలు, నర్సరీలు వంటి అంశాలపై అన్ని వార్డుల్లో అభివృద్ధి, నిర్వహణ కమిటీలను వేయాలని కలెక్టర్‌ నిఖిల సూచించారు. ఉద్యోగులు, మహిళలు, స్వచ్ఛంద, యువజన సంఘాలను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. త్వరలో పట్టణ ప్రగతి ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.


logo