బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 17, 2020 , 03:59:04

‘సహకార’ గులాబీ..

‘సహకార’ గులాబీ..

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) పీఠాల్ని టీఆర్‌ఎస్‌ అధిష్ఠించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో గులాబీ దళం అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీఏసీఎస్‌ ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక ఆదివారం జరిగింది. 13 సంఘాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగగా 11 స్థానాల్ని టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేత చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. కోరం లేక కంచనపల్లి ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది.


మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌

జిల్లాలో 14 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఇందులో పాలకుర్తి, కళ్లెం సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 182 టీసీలకు 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం 12 సంఘాలకు 116 టీసీలకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు. ఏకగ్రీవాలతో కలుపుకుని టీఆర్‌ఎస్‌కు 129 టీసీలు, కాంగ్రెస్‌ 49, బీజేపీ 2, స్వతంత్రలు 2 స్థానాల్ని గెలుచుకున్నారు. ఆదివారం ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, చీటకోడూరు మినహా అన్ని కేంద్రాల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సాఫీగా జరిగింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ 8 టీసీ స్థానాలు గెలుచుకుని పూర్తి ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేతల తీవ్ర వ్యవహరశైలితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని కాంగ్రెస్‌ మద్దతుదారులకు ఓటేయించుకున్నారు. దీంతో ఆ చైర్మన్‌ స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో పడింది. వైస్‌ చైర్మన్‌ పదవి మాత్రం టీఆర్‌ఎస్‌కు దక్కింది. ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక సందర్భంగా తీవ్ర రసాభసా నెలకొంది. వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది. నిరసనల మధ్య చివరకు ఎన్నికను పూర్తి చేశారు. 


జనగామలో ఆరు టీసీ స్థానాలతో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీగా టీఆర్‌ఎస్‌ ఉంది. అయితే అధ్యక్ష స్థానానికి కావాల్సిన మరో అభ్యర్థి మద్దతు కూడగట్టడంలో టీఆర్‌ఎస్‌ సఫలమైంది. ఈక్రమంలో కాస్త ఉత్కంఠ చోటుచేసుకుంది. కంచనపల్లిలో 9 టీసీ స్థానాల్ని, 4 టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అయితే కోరం లేకపోవడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది. లింగాలఘన్‌పూర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ మినహా మిగితా 11 సంఘాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మొత్తం 11 పీఠాల్ని టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోగా 2 స్థానాల్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలో అత్యధిక స్థానాల్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఏకగ్రీవమైన 66 టీసీల్లోనూ 54 టీఆర్‌ఎస్‌వే కావడం గమనార్హం. ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. 116 టీసీల్లో 75 గెల్చుకుంది. మొత్తం 129 టీసీలను నెగ్గిన గులాబీ దళం పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కంచనపల్లి మినహా అన్ని పీఏసీఎస్‌లకు ఎన్నిక పూర్తయింది. కంచనపల్లిలో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం ఉన్నప్పటికీ అంతర్గత కలహాల కారణంగా ఎన్నిక జరగలేదు. ఎన్నికైన డైరక్టర్లు సమావేశానికి కావాల్సినంత మంది హాజరుకాకపోవడంతో కోరం లేని కారణంగా అధికారులు వాయిదా వేశారు. ఓటింగ్‌లో గెలిచారు కానీ అధ్యక్ష స్థానంపై కాంగ్రెస్‌ నేతల్లో సయోధ్య కుదరలేదు.


logo