ఆదివారం 24 మే 2020
Jangaon - Feb 16, 2020 , 03:42:30

టీఆర్‌ఎస్‌కే సహకారం

టీఆర్‌ఎస్‌కే సహకారం

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలకు (పీఏసీఎస్‌లు) శనివారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 14 సొసైటీలకు రెండు ఏకగ్రీవం అయ్యాయి. 12 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 71.26 పోలింగ్‌  నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. 182 డైరెక్టర్‌ స్థానాల్లో 129 టీసీలను టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోవడం విశేషం. దీంతో గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ఎంత బలంగా ఉందో సహకార సంఘాల ఎన్నికల ద్వారా మరోసారి తేటతెల్లమైంది.  లెక్కింపు అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. గులాబీ రంగులు చల్లుకుని, పటాకులు కాల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఇక ఆఫీస్‌ బేరర్ల ఎన్నికను నేడు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి

ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ఓట్లు రాబట్టడంలో ఇన్‌చార్జీలు సఫలీకృతులయ్యారు. జిల్లాలో 14 పీఏసీఎస్‌లు ఉండగా, పాలకుర్తి, కళ్లెం ఏకగ్రీవమయ్యాయి. శనివారం 12 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 182 టీసీలకు 66 ఏకగ్రీవమయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ 54, కాంగ్రెస్‌  బలపర్చిన అభ్యర్థులు 11 సొంతం చేసుకోగా, ఒకటి స్వతంత్ర అభ్యర్థికి ఏకగ్రీవమైంది. మిగిలిన 116 టీసీలకు శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరిగింది. 116 డైరెక్టర్‌ స్థానాలకు మొత్తం ఓటర్లు 31,032 మంది ఉండగా, 22,114 మంది రైతులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 71.26 శాతం పోలింగ్‌ నమోదైంది.  అత్యధికంగా నిడిగొండలో 92.05 శాతం ఓటింగ్‌ నమోదైంది. అత్యల్పంగా జఫర్‌ఘడ్‌లో 61.12 శాతం నమోదైంది. నర్మెటలో 75.9, కంచనపల్లిలో 67.8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 61.34, జనగామలో 81.6, చీటకోడూరులో 85.8, ఎల్లరాయిని తొర్రూరులో 80.4, బచ్చన్నపేటలో 68.2,  లింగాలఘనపురంలో 86.45, కొడకండ్లలో 77.36, దేవురుప్పులలో 63.22 శాతం  నమోదైంది. దేవరుప్పుల సొసైటీ పరిధిలోని కడివెండి బూత్‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రం వరండా వద్ద ఓటర్లు కిక్కిరిసిపోయారు. దివ్యాంగులు, వృద్ధులు, తీవ్ర అనారోగ్యం ఉన్న వారిని తీసుకెళ్లడానికి కేంద్రాల వద్ద చక్రాల కుర్చీని అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలను వైద్యపరమైన సేవల కోసం అందుబాటులో ఉంచారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. బచ్చన్నపేటలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జనగామలోని ప్రభుత్వ పాఠశాలను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య పోలింగ్‌ సరళిని తెలుసుకున్నారు.

రౌండ్ల వారీగా ఫలితాలు..

పోలింగ్‌ అనంతరం ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించారు. కొన్నిచోట్ల ఉత్కంఠ భరితంగా ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్‌ జరిగిన 116 స్థానాల్లో 75 టీసీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. 38 కాంగ్రెస్‌, 2 బీజేపీ, ఒక  స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఏకగ్రీవం, ఎన్నికలైన మొత్తం 182 టీసీల్లో టీఆర్‌ఎస్‌కు 129, కాంగ్రెస్‌కు 49, బీజేపీ బలపర్చిన అభ్యర్థులకు రెండు, స్వతంత్రులు రెండు గెలుచుకున్నారు. జిల్లాలోని 14 సంఘాల్లో 12 సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఏకగ్రీవమైన పాలకుర్తి, కళ్లెంతోపాటు  కొడకండ్ల, దేవరుప్పుల, నర్మెట, బచ్చన్నపేట, లింగాలఘనపురం, జఫర్‌ఘడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, ఎల్లరాయిని తొర్రూరు, జనగామ, చీటకోడూరు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. చోటకోడూరులో బీజేపీ సహకారంతో టీఆర్‌ఎస్‌ సంఘం పీఠాన్ని చేజిక్కించుకుంది. కంచనపల్లి, నిడిగొండ సంఘాలను కాంగ్రెస్‌ గెల్చుకుంది. ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండగానే లెక్కింపు కేంద్రాల వద్ద పార్టీ శ్రేణులు రంగులు చల్లుకుని, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. సంఘం అధ్యక్ష పీఠంపై దృష్టి సారించిన వారు తమ వ్యూహాలకు పదును పెట్టారు. పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న సంఘాల వద్ద ఎలాంటి సమస్య లేదు. కానీ, చీటకోడూరు సంఘం బీజేపీ సహకారంతో టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకునే యత్నం చేస్తున్నది. దీంతో కాస్త ఉత్కంఠ చోటుచేసుకుంది.

నేడు ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక

ఆఫీస్‌ బేరర్ల ఎన్నికను ఆదివారం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి అనంతరం పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఉపసంహరణ సమయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత బరిలో నిలిచిన వారిని ప్రకటించి ఎన్నిక నిర్వహిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు సంబంధిత అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు.


logo