మంగళవారం 07 ఏప్రిల్ 2020
Jangaon - Feb 16, 2020 , 03:40:18

విధుల్లో అలసత్వం వహించొద్దు

విధుల్లో అలసత్వం వహించొద్దు

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 15: విధుల్లో ఎలాంటి అలసత్వం వహించినా కఠినంగా వ్యవహరిస్తానని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ కే నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ల్యాండ్‌ బ్యాంకింగ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రజావాణి దరఖాస్తులు వంటి అంశాలపై మండలాల వారీగా ముఖాముఖీ సమీక్షించారు. ఆయా మండలాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు వారం రోజుల్లో పూర్తి కావాలని, లేకుంటే పని చేయని అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని హెచ్చరించారు. సమావేశానికి హాజరయ్యే అధికారులు ఎజెండాలో పేర్కొన్న ప్రతి అంశంపై పూర్తి సమాచారంతో రావాలని, ప్రధానంగా ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల్లో ల్యాండ్‌ బ్యాంక్‌ ఏరియాను గుర్తించి చెట్లు నాటేందుకు అనువైన స్థలాన్ని గుర్తించి గురువారం నాటికి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఓజే మధు పాల్గొన్నారు. అదేవిధంగా పల్లెప్రగతి ఒకటి, రెండు విడతల్లో జరిగిన పనులు, ఇతర కార్యక్రమాలపై కూడా కలెక్టర్‌ ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, గ్రామ కార్యదర్శులతో సమీక్షించారు. అంతకుముందు కలెక్టర్‌ కే నిఖిలను తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు.


logo