శనివారం 30 మే 2020
Jangaon - Feb 15, 2020 , 02:47:26

సహకార పోరుకు సర్వం సిద్ధం..

సహకార పోరుకు సర్వం సిద్ధం..

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 14: జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ప్రాదేశిక నియోజకవర్గాల (టీసీలు) పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితను నిర్ణయించే పోలింగ్‌ మరికొద్ది గంటల్లో జరగనుండగా.. బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సామగ్రితో ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా మండలాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు శుక్రవారం సాయంత్రమే చేరుకొని ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 66 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, 116 టీసీలకు జరిగే ఎన్నికల్లో 329 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 31,032 మంది రైతులు శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే పోలింగ్‌లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నేటి సాయంత్రం ఫలితాలు ప్రకటించి, తర్వాత పాలకవర్గాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఆయా టీసీ పరిధిలో ఎన్నికైన డైరెక్టర్లు చేతులెత్తే పరోక్ష విధానం ద్వారా ఎన్నుకుంటారు. లింగాలఘనపురం మండలం కళ్లెం, పాలకుర్తి సంఘాల పరిధిలోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ వేయడంతో ఆ రెండు సంఘాల పరిధిలో పోలింగ్‌కు అవసరం ఏర్పడలేదు.


12 సంఘాలకు ఎన్నికలు

మిగిలిన 10 మండలాల్లోని 12 సంఘాల్లో దేవరుప్పుల, ఎలరాయని తొర్రూరు సంఘాలలో అన్ని టీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. పాలకుర్తి, కళ్లెం సంఘాల్లో మొత్తం 26 టీసీలు ఏకగ్రీవం కాగా, జనగామ, చీటకోడూరు, బచ్చన్నపేట, నర్మెట, లింగాలఘనపురం, నిడిగొండ, కంచనపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌ఘడ్‌, కొడకండ్ల సంఘాల పరిధిలో 40 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పార్టీకతీతంగా పరోక్ష పద్ధతిలో జరిగే ఎన్నికల్లో దాదాపు అన్ని వార్డుల్లో బహుముఖ పోటీ జరుగుతుండగా, ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారుల మధ్య ముఖాముఖీ జరుగుతున్నాయి. జిల్లాలో సహకార ఎన్నికల ప్రక్రియ కలెక్టర్‌ కే నిఖిల ఆధ్వర్యంలో జిల్లా అదనపు ఎన్నికల అథారిటీగా జిల్లా సహకార అధికారి మద్దిలేటి పర్యవేక్షణలో ఎన్నికలు జరిగే 116 పోలింగ్‌ కేంద్రాలకు హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల బీఈడీ కాలేజీ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఇప్పటికే కేంద్రాలకు చేరుకొని పోలింగ్‌కు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం నాలుగు జోన్లు, ఏడు రూట్లను ఏర్పాటు చేసి రూట్‌ అధికారులతోపాటు జోనల్‌ అధికారులు, ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఒక ఎన్నికల అధికారి, ఇద్దరు సహాయక అధికారులను నియమించారు. 66 వార్డులు ఏకగ్రీవం కావడంతో బ్యాలెట్‌ పత్రాల అవసరం తగ్గడంతో 31,032 మంది ఓటర్ల కోసం 35,524 బ్యాలెట్‌ పత్రాలను ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం గుర్తించిన కార్డుల్లో ఏదైనా కార్డును ఓటర్లు వెంట తీసుకువెళ్లాలని సూచించిన అధికారులు ఓటర్లుగా ఉన్న రైతులకు పోల్‌ చీటీలు కూడా పంపిణీ చేశారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతాన్ని ప్రకటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.


పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు..

జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు సహా అన్ని వార్డుల్లో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ రోజు ఆయా కేంద్రాలకు 200 మీటర్ల లోపు ప్రచారాన్ని నిషేధించడం, ఒక్కో సంఘం పరిధిలో ఐదుగురు చొప్పున పోలీసులను నియమించి పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచిన బ్యాలెట్‌ పత్రాలను బందోబస్తు నడుమ పంపిణీ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని స్కూల్‌ బస్సుల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌తో కేంద్రాలకు పంపించారు.

logo