ఆదివారం 29 మార్చి 2020
Jangaon - Feb 15, 2020 , 02:44:28

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

పాలకుర్తి రూరల్‌ : పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గతం కంటే ఈసారి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీఐపీ, వీవీఐపీ పాసులకు రూ.1000, 2016లు పెట్టాలని సూచించారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతరలో ప్లాస్టిక్‌ను నిషేధించాలని మంత్రి ఆదేశించారు. దేవస్థానం తరుపున లడ్డు ప్రసాదాలను ప్లాస్టిక్‌ కవర్లలో ఇవ్వొద్దని మంత్రి సూచించారు. ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించిన షాపులను సైతం సీజ్‌ చేయాలని ఆదేశించారు. భక్తులకు మంచినీటి సరఫరా నిరంతరం కొనసాగాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడని ఆదేశించారు. వైద్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. 


అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేసుకోవాలన్నారు. పోలీసులు జాతరలో సీసీ కెమెరాలతో పాటు జాతరను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. జాతర గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు బస్సు సౌకర్యాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమీక్షకు మిషన్‌ భగీరథ సీఈ, ఎస్‌ఈ ఎందుకు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతర సమయంలో వలంటీర్ల సేవలను తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా గుడి నిర్మాణ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రోడ్లకు ఇరువైపులా మట్టి పోయించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల జిల్లా అధికారులు దగ్గరుండి జాతర పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 


కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీసీపీ శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో ఎల్‌ రమేశ్‌, ఏసీపీ గొల్ల రమేశ్‌, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, దేవస్థానం చైర్మణ్‌ రామచంద్రయ్య శర్మ, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ ముస్కు రాంబాబు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, సర్పంచ్‌ యాకాంతరావు, తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, ఈవో వీరస్వామి, కొత్తపల్లి  వెంకటయ్య, సీఐ బానోత్‌ రమేశ్‌, ఎస్సై గండ్రాతి సతీశ్‌, డీఈలు దిలీప్‌కుమార్‌, శ్రీనివాస్‌, మల్లేశం, రాజేందర్‌, సంధ్యారాణి, ఏఈలు ప్రశాంతి, పాషా, ఎక్సైజ్‌ సీఐ బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ డీఎం ధరంసింగ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo