మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 15, 2020 , 02:40:07

పాడిరైతులకు శుభవార్త

పాడిరైతులకు శుభవార్త

రెడ్డికాలనీ, ఫిబ్రవరి 14: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాడి రైతులకు శుభవార్త. తెలంగాణ విజయ డెయిరీ పాల సేకరణ ధర లీటర్‌కు రూ. 2 పెంచినట్లు విజయ డెయిరీ ఉపసంచాలకుడు కోడిరెక్క రవికుమార్‌ తెలిపారు. అర్బన్‌ జిల్లా హన్మకొండలోని విజయ డెయిరీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ మినహా 3,500 పాడి రైతులు నిత్యం సుమారు 10 వేల లీటర్ల పాలు పోస్తున్నట్లు చెప్పారు. ఆవు పాలు, గేదె పాలు లీటర్‌కు రూ. 2 నుంచి రూ. 4 పెంచడంతో వారికి రూ. 20 వేలు అదనంగా లాభం చేకూరనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రూ. 2 పెంపు అమలు చేయనున్నట్లు చెప్పారు. 


పెంచిన ధరలు గేదె పాలు 600 కేజీ ఫ్యాట్‌, ఆవు పాలకు 240 టీఎస్‌ అన్నారు. అలాగే, 10 శాతం సబ్సిడీపై స్వచ్ఛమైన విజయ దాణా అరువుపై సరఫరా, ఈ దాణా విలువ వీలును బట్టి రైతులకు ఆర్థిక భారం పడకుండా పాల బిల్లులోనే రికవరీ చేయనున్నట్లు చెప్పారు. 50 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు, మినరల్‌ మిక్చర్‌, మందుల సరఫరా, 25 శాతం సబ్సిడీపై కాల్షియం బాటిల్స్‌ సరఫరా, ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి, ప్రతి పాల సేకరణ కేంద్రం సొసైటీగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు వివరించారు. సొసైటీ రిజిస్ట్రేషన్‌లో పాడి రైతులకు అదనంగా లాభాలపై అవకాశాలకు అందరూ పాల ఉత్పత్తిదారులు విజయ డెయిరీకి పాలు పోసి ఆర్థికంగా ఎదగాలని రవికుమార్‌ సూచించారు.


logo
>>>>>>