గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 14, 2020 , 03:58:27

మల్లన్నసాగర్‌ నుంచి జిల్లాకు గోదావరి జలాలు

మల్లన్నసాగర్‌ నుంచి జిల్లాకు గోదావరి జలాలు

బచ్చన్నపేట, ఫిబ్రవరి 13 : కరువు, అతి ఎత్తైన ప్రాంతమైన చేర్యాల, బచ్చన్నపేట, జనగామ ప్రాంతాలకు మల్లన్నసాగర్‌ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, దాంతో ఈ ప్రాంతమంతా సశ్యశామలంగా మారుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కేసీఆర్‌ బచ్చన్నపేటకు వచ్చిన సందర్భంగా గ్రామంలో యువకులంతా ఉపాధి కోసం పట్టణాల బాట పట్టడంతో వృద్ధులు మాత్రమే కనిపించకపోవడంతో ఇదేంటని అడిగి నివ్వెరపోయారని ఆయన గుర్తు చేశారు. అందుకే కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే బచ్చన్నపేట, జనగామ ప్రాంతాలకు గోదావరి జలాలతో చెరువులు నింపేందుకు సుముఖత వ్యక్తం చేశారని, ఇప్పటికే గోదావరి జలాలతో చెరువులు నింపుకుంటున్నామని అన్నారు. గతంలో అన్ని మండలాల్లో నిర్వహించిన మండల సర్వ సభ్యసమావేశాల్లో ప్రజాప్రతినిధులు సంక్షేమం కన్నా, సాగునీరే మిన్న అని ఏకగ్రీవ తీర్మానాలు చేశామని ఆ విషయాన్ని ప్రభుత్వానికి, సీఎంకు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సీఎం సంక్షేమ పథకాలతో పాటు సాగునీరు అందిస్తామని ప్రకటించి ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటున్నారని అన్నారు. దేవాదుల నుంచి గోదావరి జలాలు రావాలంటే చివరి నియోజకవర్గం జనగామ అయిందని అందుకే మల్లన్నసాగర్‌ నుంచి అయితే ఎప్పటికీ నీటిని తెప్పించుకునే వీలుందన్నారు. ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సాగునీరు కావాలంటూ తీర్మానాలు చేసి క్యాంపు కార్యాలయానికి పంపితే వాటిని ఆ కాపీలను సీఎం కేసీఆర్‌కు అందజేస్తామని పేర్కొన్నారు. నీళ్ల మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఈ ప్రాంతానికి చేసింది శూన్యమని గమనించిన ఆయనకు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ప్రజలంతా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలుస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రైతు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అందుకే రైతులు సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను డైరెక్టర్లుగా గెలిపించుకోవాలన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి రైతులపై మరింత శ్రద్ధ చూపుతారని అన్నారు.  ప్రతి పీఏసీఎస్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు. అ బాధ్యత రైతులపైనే ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. 

సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో ఈనెల 19వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు, శివకల్యాణం, అగ్నిగుండాలకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను గురువారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శివకల్యాణాన్ని 21వ తేదీన, అగ్నిగుండాల కార్యక్రమాన్ని 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి,  గ్రామ సర్పంచ్‌ గంగం సతీశ్‌రెడ్డి, ఈవో రత్నాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మల్లవరం అరవింద్‌రెడ్డి, మండల నాయకులు గిరబోయిన అంజయ్య, బావండ్ల కృష్ణంరాజు, మల్లారెడ్డి, షబ్బీర్‌, వేముల విద్యాసాగర్‌, గుర్రపు బాలరాజు, వేముల బాలరాజు, బేజాడి సిద్దులు, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, పులిగిళ్ల పూర్ణచందర్‌, వేముల లక్ష్మణ్‌, అజీం, కనకయ్య, సిద్దిరాములు, సిద్దిరాంరెడ్డి, బాలసిద్ధులు, సిద్ధులు, సిద్దారెడ్డి, వెంకట్‌, ఆలయ  సిబ్బంది చల్లా రాజేందర్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

వధూవరులకు ఎమ్మెల్యే ఆశీర్వాదం

మండలంలోని లిమ్రా ఫంక్షన్‌హాల్‌లో గురువారం మండల కేంద్రానికి చెందిన రాంరెడ్డి రెండో కుమార్తె  కల్యాణి వివాహం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి సోదరుడి కుమారుడు ఇటిక్యాలపల్లికి చెందిన నవీన్‌రెడ్డితో కన్నుల పండువగా వివాహం జరిగింది. ఈ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.


logo