బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 13, 2020 , 04:20:34

‘సహకారం’లో సత్తా చాటాలి

‘సహకారం’లో సత్తా చాటాలి

దేవరుప్పుల/పాలకుర్తి రూరల్‌(కొడకండ్ల), ఫిబ్రవరి 12 : త్వరలో జరగనున్న సహకార ఎన్నికల్లో అన్ని డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఆయన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సహకార ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతి డైరెక్టర్‌ స్థానాన్ని కైవసం చేసుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గోదావరి ఎస్సారెస్పీ జలాలతో నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలను రైతులకు వివరించి ఓట్లు అడగాలని మంత్రి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ నాయకులకు రైతులను ఓటు అడిగే అర్హత లేదన్నారు. 


గతంలో కాంగ్రెస్‌ నాయకులు డీసీసీబీని నిండా ముంచారని మండిపడ్డారు. రూ.80 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. వరంగల్‌ డీసీసీబీ పాలకవర్గం అవినీతి ఆక్రమాలపై సీబీసీఐడీ విచారణ చేపట్టిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. త్వరలో వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని వివరించారు. ప్రతిపక్షాలు పోటీ చేయడానికే భయపడుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డవారిని గుర్తిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. గ్రూప్‌ విబేధాలు వీడాలని మంత్రి నాయకులకు సూచించారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదని ఈసందర్భంగా హెచ్చరించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని  సోసైటీల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. సహకార సంఘాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతాంగానికి రుణాలు, ఎరువులను సకాలంలో అందించి రైతుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.


ఇక అభివృద్ధిపైనే దృష్టి..

ఎన్నికలన్నీ ముగిశాయి.. ఇక అభివృద్ధిపైనే దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని శ్రీవాసవి కల్యాణ మండపంలో సొసైటీ ఎన్నికలపై మండల స్థాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, గ్రామాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సాగునీరు, తాగు నీటి విషయంలో ఫలితాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. పలు గ్రామాల్లో గ్రూపు దగాదాలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఆ గ్రామాల్లో డైరెక్టర్లు ఓడినా, గెలిచి మెజారిటీ తగ్గినా వారే బాధ్యులవుతారన్నారు. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గ్రామాల్లో అర్హులకందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, వారిని వదిలేదిలేదన్నారు. 


ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని, ఇక సొసైటీ ఎన్నికల్లో డీసీసీబీని కైవసం చేసుకుని కేసీఆర్‌ ముందు గౌరవంగా నిలబడతానని మంత్రి ఎర్రబెల్లి  అన్నారు. కొడకండ్ల మండల అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ ధరావత్‌ జ్యోతి, జెడ్పీటీసీ కేలోత్‌ సత్తమ్మ, జీసీసీ మాజీ చైర్మన్‌ ధరావత్‌ గాంధీనాయక్‌, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ పేరం రాము, సర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌, ఎంపీటీసీ అందె యాకయ్య, నాయకులు ఈదూరు ఐలయ్య, రాంచంద్రయ్య శర్మ, చెంచు రాజిరెడ్డి, సిందె రామోజీ, దీకొండ వెంకటేశ్వర్‌రావు, పుస్కూరి సంపత్‌రావు, రమేశ్‌గౌడ్‌, రాజుకుమార్‌, జక్కుల విజయమ్మ, మేటి సోమరాములు పాల్గొన్నారు. దేవరుప్పులలో నిర్వహించిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌, ఎంపీపీ బస్వ సావిత్రి, నాయకులు వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, పల్ల సుందర్‌రాంరెడ్డి, బస్వ మల్లేశ్‌, రైతు సమన్వయ సమితి మండల కోర్డినేటర్‌ ఈదునూరి నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల రమేశ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కృష్ణమూర్తి, డైరెక్టర్లు సోమనర్సయ్య, జోగేశ్‌, మహేశ్‌, మాజీ ఎంపీపీ సోమయ్య, కారుపోతుల భిక్షపతి, కోతి పద్మ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రమాదేవి, అంజమ్మ, అశోక్‌ మల్లేశ్‌, శ్రీనివాసరెడ్డి, నాయకులు రాంసింగ్‌, గిరి, యాదగిరి, జలేంధర్‌రెడ్డి, వేణు, రమేశ్‌, కిష్టయ్య, కొండయ్య, లీనారెడ్డి, హన్మంతు, ఎర్రయ్య, రత్నాకర్‌రావు, యాదవరెడ్డి, చింత రవి, కొండయ్య, రవీందర్‌రెడ్డి, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.


వధూవరులకు మంత్రి ఆశీర్వాదం

పాలకుర్తి రూరల్‌(కొడకండ్ల) : మండలంలోని కడగుట్టతండాకు చెందిన ధరావత్‌ ఉపేందర్‌-హరిత వివాహ వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈసందర్భంగా నూతన దంపతులకు పట్టు వస్ర్తాలు అందజేశారు.


logo