బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 13, 2020 , 04:09:22

‘పల్లె ప్రగతి’పై ప్రత్యేక దృష్టి

‘పల్లె ప్రగతి’పై ప్రత్యేక దృష్టి
  • గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
  • త్వరలో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు
  • మంత్రి ఎర్రబెల్లికి జనగామ, వరంగల్‌ రూరల్‌,భూపాలపల్లి జిల్లాల బాధ్యతలు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రామాల అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పల్లెలు మెరవాలని నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దీని నిర్వహణకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసంలో 30 రోజుల పాటు మొదటి విడత, ఈ ఏడాది జనవరి 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాల్ని నిర్వహించారు. 


ఈ రెండు విడతల్లోనూ గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ప్రభుత్వం సత్ఫలితాలు సాధించింది. కొన్ని గ్రామాలైతే ఆదర్శంగా నిలిచాయి. ఆదర్శ పల్లెల పోటీల్లో తలపడేలా సుందరంగా తీర్చిదిద్దబడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఇదే స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధి కొనసాగించాలని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలు కార్యరూపం దాల్చాయి. బుధవారం పంచాయతీరాజ్‌ సమ్మేళనం బాధ్యతల్ని మంత్రి ఎర్రబెల్లికి అప్పగించారు. ఈనెల 25వ తేదీలోగా సమ్మేళనానికి ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఎర్రబెల్లికి మూడు జిల్లాల బాధ్యతలు

పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి సంబంధించి జనగామ, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల బాధ్యతలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అప్పగించారు. అలాగే మంత్రి సత్యవతి రాథోడ్‌కు వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న సమావేశం అనంతరం గ్రామపంచాయతీలకు పది రోజుల గడువు విధించనున్నారు. ఈలోగా గ్రామాల రూపురేఖలు మార్చేలా కార్యాచరణ రూపొందించుకోవడంలో యంత్రాంగం తలమునకలైంది. ఈ సమ్మేళనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు పాల్గొననున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్రామాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. గ్రామాలకు కావాల్సిన నిధులను కూడా ఇప్పటికే విడుదల చేశారు. జిల్లాలోని 12 మండలాల్లోని 281 గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, నర్సరీలు, శ్మశానవాటికల నిర్మాణాలు జరిగాయి. గ్రామాల్లో పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపడేవిధంగా అధికారులు చర్యలు చపట్టారు. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలతో ఉపాధితో పాటు మొక్కల పెంపకందారులను ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తున్నది.


logo