బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 12, 2020 , 02:30:11

ప్రగతి నిర్దేశనం!

ప్రగతి నిర్దేశనం!

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘జిల్లాల ప్రగతికి కలెక్టర్‌ బాధ్యతాయుతమైన చొరవ చూపాలి అందుకోసం విరివిగా నిధులు కేటాయించాం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కలెక్టర్ల, అదనపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లాలో అడవుల శాతం పెరగాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో పాలనాపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అదనపు కలెక్టర్లను ఇటీవలే నియమించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకంగా జనగామ జిల్లాను ప్రస్తావించడంతో పాటు మిగితా అన్ని జిల్లాలతో కలిపి ఇతర అంశాలను జిల్లా అభివృద్ధి కోసం సూచనలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన పథకాలను అమలు చేసేందుకే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యత ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌ కరాఖండిగా పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను యంత్రాంగం అమలు చేయాలన్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఇది అమలు జరిగి తీరాల్సిందే అని ఆదేశించారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాలకు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు.

తక్కువ సమయంలోనే ప్రగతిపై హర్షం

రాష్ట్రం ఆవిర్భవించాక తక్కువ సమయంలో అభివృద్ధి సాధించామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ రంగంలో దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలవడంపై ఆయన గర్వపడ్డారు. రూ.40వేల కోట్లతో కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య లేకుండా చేసామని చెప్పారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సమస్యే లేకుండా చేశామని పేర్కొన్నారు. సురక్షిత మంచినీరు  ప్రజలకు అందుతున్నదన్నారు. గోదావరి జలాలతో కరువు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

కలెక్టర్‌ వ్యవస్థను బలోపేతం చేశాం..

కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని నిర్ణయించి అదనపు కలెక్టర్లను ఇటీవలే నియమించామన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలన్నారు. గతంలో 112 కమిటీలు ఉండేవి వాటికి చైర్మన్‌గా కలెక్టర్‌ ఉండేవారని, ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. ఈ నిర్ణయం వల్ల కొంత పని ఒత్తిడి తగ్గించామన్నారు. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు నిర్వహించిన రెండు విడుతల పల్లెప్రగతితో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్‌యార్డులు వంద  జనగామ జిల్లాలో సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటుచేశామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతన కార్యాలయాలు ఏర్పాటైనట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ.339 కోట్లు విడుదల చేస్తున్న ఘనత తెలంగాణ సర్కార్‌దేనని అన్నారు. ట్రాక్టర్ల కొనుగోలుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చామన్నారు. ట్రాక్టర్ల కొనుగోలుకు జిల్లాలో బ్యాంకు రుణాలు మంజూరు చేశామని వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టామన్నారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది, ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చురకఅంటించారు. ఎవరి భాద్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. వచ్చే పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని ఆదేశించారు. సర్పంచ్‌, కార్యదర్ళులు, ఇతర అధికారులు ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పాలని, 25 రోజుల్లో గ్రామాల్లో పరిస్థితి మారాలని పేర్కొన్నారు. ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ ఆకస్మిక తనిఖీలు చేస్తారని హెచ్చరించారు. స్వయంగా తాను కూడా తనిఖీలు చేస్తానని పేర్కొన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి కలెక్టర్‌ వద్ద రూ.ఒక కోటిని అందుబాటులో ఉంచామన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడమే కాదు, చెట్లు నరకకుండా చూడాలన్నారు. అటవీ భూముల్లో దట్టమైన అడవిని పెంచాలన్నారు. జనగామ జిల్లాలో అడవుల శాతం చాలా తక్కువగా ఉందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అక్షరాస్యత శాతం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పట్టణానికి నెలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామన్నారు. ఏ కార్యక్రమమైనా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలన్నారు.


logo
>>>>>>