గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 12, 2020 , 02:27:21

గులాబీలో నయా జోష్‌

గులాబీలో నయా జోష్‌

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 11 : సహకార పోరులో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్ధులు మెజార్టీ స్థానాల్లో విజయభేరి మోగించడంతో గులాబీపార్టీలో నయాజోష్‌ కొనసాగుతున్నది. ఎన్నికలకు ముందే జిల్లాలోని కల్లెం, పాలకుర్తి, బచ్చన్నపేట, నర్మెట సంఘాలు ఏకగ్రీవం దిశగా మెజార్టీ టీసీ స్థానాలు ఏకపక్షమై అధికార టీఆర్‌ఎస్‌ బలపరిచిన మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మిగిలిన 10 సొసైటీల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించి గులాబీజెండా ఎగరేయబోతున్నారు. జిల్లాలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 66 టీసీల్లో డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 117 టీసీలకు జరిగే ఎన్నికల్లో 329 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 51,626 మంది రైతులు ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదేరోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించిన తర్వాత మూడు రోజుల వ్యవధిలో పాలకవర్గాల చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఆయా టీసీ పరిధిలో ఎన్నికైన డైరెక్టర్లు చేతులెత్తే పరోక్ష విధానం ద్వారా ఎన్నుకుంటారు. కాగా, అన్ని సహకార సంఘాలపై గులాబీజెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు పావులు కదుపుతున్నాయి. ఎన్నికలేవైనా విజయదుందుబి మోగిస్తున్న గులాబీపార్టీ సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటేలా అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్‌ తాటికొండ రాజయ్యతోపాటు ముఖ్యనేతలంతా ఎప్పటికప్పుడు తమ పరిధిలోని సొసైటీల్లో పార్టీ మద్దతుదారుల గెలుపుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా, ఈనెల 15న జరిగే సహకార సమరానికి జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌ సామాగ్రి, బ్యాలెట్‌ బాక్సులు, పత్రాల ముద్రణ, పోలింగ్‌ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేసి అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. పల్లెల్లో జరిగే సహకార పోరును ప్రశాంత వాతారణంలో ముగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానికసంస్థలు, పంచాయతీ ఎన్నికలు సహా ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధులు గెలుపొందడంతో అధికారపార్టీ మద్దతుతో సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో నాయకులు, ముఖ్య కార్యకర్తల్లో పోటీ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఊరూరా ఎన్నికల సందడి నెలకొనగా, పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దిపల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ప్రతి ఓటునూ లెక్కలోకి తీసుకొని అవన్నీ తమకే పోలయ్యేలా అభ్యర్థులు  రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులకు పార్టీ గుర్తులు లేకపోయినా స్వతంత్ర గుర్తులతో ఆయా రాజకీయ పార్టీల మద్దతుతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. 


logo
>>>>>>