శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jangaon - Feb 12, 2020 , 02:17:23

బంగారు భవితకు బాటలు

బంగారు భవితకు బాటలు

బచ్చన్నపేట, ఫిబ్రవరి 11 : రాష్ట్రప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు తల్లితండ్రులను వదిలి హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాటలు వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హాస్టల్‌లో సకల వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది తెలంగాణ సర్కార్‌. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్‌ విద్యకు దీటుగా సర్కార్‌ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నది. అందులో భాగంగానే ఇంటిని మరిపించేలా హాస్టల్‌ విద్యార్థులకు ప్రతిరోజు రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. విద్యార్థుల డ్రాపౌట్‌ను నిరోధించేందుకు హాస్టల్‌లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నది. కరంట్‌ లేని సమయాల్లో విద్యార్థులు సాఫీగా చదువుకునేందుకు హాస్టల్‌పై ప్రత్యేకంగా సోలార్‌ విద్యుత్‌ సరఫరా సిస్టమ్‌ను బిగించింది. మండల కేంద్రం ఆలేరు రోడ్డులో ఉన్నత పాఠశాలకు ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్‌ భవనం లోపల హరితహారంలో భాగంగా పచ్చని మొక్కలు నాటడంతో  అవి నేడు పచ్చదనాన్ని పరుచుకొని ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్నది. విద్యార్థులు విశ్రాంతి తీసుకునేందుకు, చదువుకునేందుకు వీలుగా చెట్ల కింద సిమెంట్‌తో తయారు చేసిన బేంచీలు ఏర్పాటుచేశారు.

ప్రత్యేకంగా బెడ్లు, ఫ్యాన్ల ఏర్పాటు

బచ్చన్నపేటలోని ఎస్సీ హాస్టల్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు గదుల్లో ప్రత్యేకంగా బెడ్లు సమకూర్చారు. చలి నుంచి రక్షణకు బెడ్‌షీట్లు అందిస్తున్నారు. ఎండాకాలంలో ఉడకపోతకు ఇబ్బందులు పడకుండా ప్రతి గదికి ఫ్యాన్లు బిగించారు. వంట గదిలో పరిశుభ్రంగా చూసుకునేలా ప్రతిరోజు వార్డెన్‌ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతున్నది. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటు

హాస్టల్‌ ఆవరణతో పాటు గదుల్లో, వెనుకభాగాన ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వార్డెన్‌లో గదిలో మానిటర్‌ను ఏర్పాటు చేసి ఏ విద్యార్థి ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పడు పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా హాస్టల్‌ ప్రధాన ద్వారం ఎదుట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలతో అపరిచిత వ్యక్తులు ఎవరన్నా హాస్టల్లోకి వస్తే ఫుటేజీల ద్వారా పట్టుకునేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా వంటగదిలో, వరండా పూర్తి నీఘా నీడలో ఉంటుంది.


logo