బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 10, 2020 , 03:10:22

నలిపేద్దాం..

నలిపేద్దాం..
  • అల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం
  • నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
  • జిల్లాలో 1,32,452 మంది విద్యార్థులకు అందించేందుకు చర్యలు


జనగామ టౌన్‌, ఫిబ్రవరి 09 : చిన్న పిల్లల కడుపులో తిష్టవేసి, పోషకాలను ఆరగిస్తూ, ఆరోగ్యాన్ని హరించే నులి పురుగులపై యుద్ధానికి జిల్లా వైద్యులు సిద్ధమయ్యారు. బాలల ఎదుగుదలపై తీవ్రప్రభాన్ని చూపే నులిపురుగులను పూర్తిగా నివారించేందుకు రెండో విడతలో భాగంగా నులి పురుగుల నివారణకు చర్యలు చేపడుతున్నారు. నులిపురుగుల నివారణ కోసం నేటి నుంచి 1-19 ఏళ్ల లోపున్న ప్రతి ఒక్కరికి అల్బెండజోల్‌ 400 మిల్లీగ్రాముల మాత్రలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఈ మాత్రలను ప్రతి పాఠశాల, కళాశాలలో ఆరోగ్యకేంద్రాల్లో, బడి బయట పిల్లలకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా ఇంటింటా తిరిగి పంపిణీ చేస్తారు. కాగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి, ఆగస్టులో నులి పురుగుల నివారణ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. ఈమేరకు నేడు తొలి విడత ఔషధాలను అధికారులు జిల్లావ్యాప్తంగా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 


చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే..

పిల్లలు మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు అందులో ఉండే రకరకాల నులి పురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తాయి. పేగుల్లో పూర్తి స్థాయి నులిపురుగులుగా అభివృద్ధిచెంది కడుపులోనే తిష్టవేస్తాయి. ఇవి 19 ఏళ్లలోపు చిన్నారులందరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీరు తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను ఈ పురుగులు పీల్చుకోవడంతో పిల్లల ఎదుగుల నిలిచిపోయి రోగాల బారిన పడతారు. ఆకలి మందగించి, చురుకుదనం తగ్గిపోయి బలహీనంగా తయారువుతారు. పిల్లల పేగుల్లో సాధరణంగా మూడు రకాల పురుగులు తిష్ట వేస్తాయి. వీటిలో ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రాకాయిడ్స్‌), కొంకి పురుగు(ఆంకైలో స్టోమాడియోడినేల్‌), చుట్ట పాములు(టీనియా సోలియం) అనే మూడు రకాలుంటాయి. ఈ నులి పురుగులు 20 నుంచి 32 సెంటీమీటర్ల వరకు పెరిగి 7 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసాల ద్వారా చుట్ట పురుగులు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువుతగ్గడం కనిపిస్తుంది.


నులి పురుగు వ్యాప్తి చెందే విధానం

పరాన్న జీవులైన నులి పురుగులు, కొంకి పరుగులు, నట్టలు మనిషి పేగులను ఆవాసంగా చేసుకుంటాయి. ఇవి వేల సంఖ్యలో గుడ్లు పెడతాయి. మల విసర్జన ద్వారా బయటకు వస్తాయి. బహిరంగ మలవిసర్జన ద్వారా మన చుట్టూ పరిసరాల్లో ఈగుడ్లు వ్యాపిస్తాయి. మట్టిలో కలిసి పోయిన గుడ్లు తీవ్ర వాతావరణాన్ని సైతం తట్టుకొని రెండేళ్ల వరకు అలాగే ఉంటాయి. 

అల్బెండజోల్‌ మాత్రలతో విరుగుడు


400 మిల్లీగ్రాముల అల్బెండజోల్‌ మాత్రలను ప్రతి విద్యార్థి భోజనం చేసిన తరువాత బాగా నమిలి మింగాలి. దీనివల్ల కడుపులోని అన్ని రకాల పరాన్న జీవులు చనిపోతాయి. 19 ఏళ్ల లోపు వయస్సున్న వారంతా ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ మాత్రలను వేసుకోవాలి. ఖాళీ కడుపుతో ఈ మాత్రలను వేసుకోకూడదు.


నివారణ జాగ్రత్తలివే..

బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయొద్దు. మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. శుభ్రమైన నీటిని తాగాలి. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి. ఆకు కూరలు, కూరగాయలను నీటితో శుభ్రంగా కడిగి వండుకోవాలి. బయట తిరిగేటప్పడు పాద రక్షలు ధరించాలి. 


నేడు మాత్రల పంపిణీ

జబ్బుతో ఉన్న లేదా ఏదైనా ఇతర మందులు వాడుతున్న పిల్లలకు ఈ మాత్రలు ఇవ్వకూడదు. పిల్లలు మాత్రలను నీటితో పాటు నమిలి మింగాలి. ప్రతి పిల్లవాడు అల్బెండజోల్‌ మాత్రలు వేసుకునేలా ఆవ వర్కర్లు, అంగన్‌వాడీలు చొరవ చూపాలి. 1-2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర, 2-19 ఏళ్ల వారికి 1 మాత్ర వేయాలి. మాత్ర మింగిన తర్వాత కడుపునొప్పి, వాంతులు వచ్చినట్లు, తల తిరిగినట్లు అవుతుంది.


1,32,452 మంది పిల్లలకు పంపిణీ

జిల్లావ్యాప్తంగా 1-19 ఏళ్లలోపు ఉన్న 1,32,452 మంది పిల్లను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. గత సంవత్సరం 1,32,250 మందికి మాత్రలు వేసినట్లు చెప్పారు. 


నులి పురుగుల నివారణ అందరి బాధ్యత

పాలకుర్తి రూరల్‌ : నులి పురుగుల నివారణకు అందరూ కృషిచేయాలని, ఇది అందరి బాధ్యత అని నులి పురుగుల నివారణ కార్యక్రమ రాష్ట్ర పరిశీలకుడు, జిల్లా నోడల్‌ అధికారి నాగమల్లేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నులి పురుగుల నివారణపై ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బంది, ప్రజలపై ఉందన్నారు. సమావేశంలో వైద్యాధికారి పోరిక రాంనాయక్‌, జయపాల్‌రెడ్డి,  వైద్యులు తాల్క ప్రియాంక, జీ యామిని, స్పందన, వేణుకుమార్‌, నాగరాజు, రాబర్ట్‌ బ్రూస్‌, చందర్‌, మంజులారాణి, పర్వీన్‌సుల్తానా, ప్రమీల సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>