బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 10, 2020 , 03:08:49

ఆపరేషన్‌ శానిటేషన్‌

ఆపరేషన్‌ శానిటేషన్‌
  • నేటి నుంచి యుద్ధప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు
  • 50 ట్రాక్టర్లు, 10 జేసీబీలు, 2 డోజర్లు
  • వ్యర్థాల తొలగింపు.. క్లోరినేషన్‌ ప్రక్రియ
  • 18వ తేదీ వరకు పనులు
  • రెండు వేల మంది కార్మికులు

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: మేడారం జాతర ముగియడంతో భక్తులు వదిలేసిన వ్యర్థాల తొలగింపు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై మేడారంలో ఆపరేషన్‌ శానిటేషన్‌ ప్రక్రియ ప్రారంభ మైంది. పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను చేపట్టేందుకు కార్యాచరణను ప్రారంభించారు. జాతర పరిసరాల్లో సుమారు 15 కిలోమీటర్ల మేర భక్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉండడంతో కొన్ని వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో స్థానికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తుగానే జాతర అనంతరం చేపట్టాల్సిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మేడారం పరిసరాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను సోమవారం నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను రూపొందించారు. 


నేటి నుంచి పారిశుధ్య కార్యక్రమాలు 

గత వారం 10 రోజుల నుంచి నిరంతరాయంగా భక్తులు మేడారం జాతరను సందర్శించి తల్లులకు మొక్కులు చెల్లించి అనంతరం విడిది ఏర్పాటు చేసుకొని భోజన వసతులు కల్పించుకునే క్రమంలో కొన్ని వ్యర్థాలు పేరుకుపోయాయి. 5వ తేదీ నుంచి 8 వరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు వదిలిన వేస్టేజ్‌ను పారిశుధ్య కార్మికులు తొలగించినప్పటికీ శనివారం కురిసిన వర్షంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ క్రమంలో జాతర అనంతరం చేపట్టాల్సిన పా రిశుధ్య కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. సోమవారం నుంచి 18వ తేదీ వరకు జాతరలో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, క్లోరినేషన్‌ను చేపట్టనున్నారు. 


రెండు వేల మంది పారిశుధ్య కార్మికులు 

జాతర అనంతరం పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు రెండు వేల మంది పారిశుధ్య కార్మికులను వినియోగించనున్నారు. వాటి తొలగింపు కోసం 50 ట్రాక్టర్లను, 10 జేసీబీలను, 2 డోజర్లు ఉపయోగించ నున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధించిన గడువు లోపలే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారు లు ఉన్నారు. జాతర జరిగిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు  సంభ వించకుండా తగు ఏర్పాట్లు చేసే దిశగా జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జాతర పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డులకు తరలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను  చేపట్టనున్నారు. 


క్లోరినేషన్‌ ప్రక్రియ 

జాతర అనంతరం పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలకు, భక్తులకు తాగునీటి వల్ల సమస్యలు తలెత్తకుండా క్లోరినేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రజలకుఅనారోగ్య సమస్యలు తలెత్తకుండా, వ్యాధులు ప్రబల కుండా  పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. బ్లీచింగ్‌ పౌండర్‌ చల్లడం, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్‌ స్ప్రే చేయడం, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లను పారిశుద్ద్య కార్మికుల ద్వారా చేపట్టి జాతరను స్వచ్ఛ మేడారంగా తీర్చిదిద్దాలనే తలంపుతో అధికారులు ముందుకు సాగుతున్నారు..


logo
>>>>>>