గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 09, 2020 , 02:30:09

అన్నీ తామై..

అన్నీ తామై..

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ :ఆదివాసీ గిరిజన జాతర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌లు మేడారం జాతర తేదీలు ప్రకటించిన నాటి నుంచి అన్నీ తామై ముందుకు సాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సీఎం కేసీఆర్‌ మేడారం ఆదివాసీ జాతరకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నారు. ప్రస్తుం ప్రభుత్వం కేటాయించిన రూ.75కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారం జాతరలో నాణ్యతతో కూడిన పనులను సకాలంలో చేపట్టి పూర్తి చేయటంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ అధికారులను, ఉద్యోగులను సమన్వయపరుస్తూ పనులను పరిగెత్తించారు. జాతర ప్రారంభానికి మూడు నెలల ముందు నుంచే అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. 

పరిశీలనలు.. సమీక్షలు..

ప్రతి 15రోజులకొకసారి మేడారం సందర్శించి మేడారం జాతరకు కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ పరిశీలించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. కేటాయించిన నిధులను 21విభాగాల ద్వారా చేపట్టిన పనుల్లో ప్రధానంగా నిర్వహించే రోడ్లు, భవనాలశాఖ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, దేవాదాయ, గ్రామీణ నీటి పారుదలశాఖ, వైద్యఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని ఎప్పటికప్పుడు మంత్రులు పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు చేస్తూ లోపాలను సవరించుకోవాలని ఆదేశిస్తూ ముందుకు సాగారు. ఫిబ్రవరిలో జాతర నేపథ్యంలో జనవరి 20వ తేదీ వరకు పనులను పూర్తి చేసి ముందస్తు భక్తులకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.  logo