మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 09, 2020 , 02:17:08

జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలి

జిల్లాను ప్రగతిపథంలో నడిపించాలి

జనగామ, నమస్తే తెలంగాణ : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసి జనగామ జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా ప్రగతిపథంలో నడిపించాలని కలెక్టర్‌ కే నిఖిల ఆదేశించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, డీఎల్‌పీపీవోలు కనకదుర్గ, గంగాభవానితో కలిసి జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వశాఖల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా సర్పంచులు, కార్యదర్శులతో రెండు విడతల పల్లె ప్రగతి పనులను సమీక్షించిన కలెక్టర్‌ గ్రామానికి సర్పంచ్‌, కార్యదర్శి రెండు కళ్లలా పనిచేయాలని.. ఇద్దరూ కలిసి పనిచేస్తేనే గ్రామం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామాల్లో నిరంతరం జరగాలని ఆదేశించారు. అనంతరం తన చాంబర్‌లో పల్లె ప్రగతి ప్రణాళికలో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీపై సంబంధిత కాంట్రాక్టు ఏజేన్సీ సంస్థలతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు మంజూరయ్యాయి? ఎన్ని ట్రాలీలు, ట్యాంకర్లు పనిచేస్తున్నాయి? వాటి నాణ్యత, ట్రాక్టర్ల నిర్వహణ, పనితీరు, ఇంకా ఎన్ని జీపీలకు ట్రాక్టర్లు అవసరం వంటి అంశాలపై ముఖాముఖీ సమావేశమై చర్చించి ఈకార్యక్రమం కింద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై సూచనలుచేశారు. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కొండల్‌రెడ్డితో సమావేశమైన కలెక్టర్‌ జిల్లాలో అడవుల శాతాన్ని పెంచడం సహా అహ్లాదకరమైన పార్కులు ఏర్పాటు చేసేందుకు వీలుగా అనువైన స్థలాన్ని గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


logo
>>>>>>