బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 08, 2020 , 02:42:19

మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలి

మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించాలి

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  

మేడారం బృందం, నమస్తే తెలంగాణ : మేడారం మహాజాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సీఎం కేసీఆర్‌ మేడారం పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ బండా ప్రకాశ్‌, గొర్లుమేకల పెంపకందారుల సంఘం కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, చిర్ర రాజుగౌడ్‌ కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వారు మీడియా సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ తల్లుల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నా రు. మేడారం జాతర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.315 కోట్ల నిధు లు కేటాయించిందని అన్నారు. కుంభమేళాను తలపించే మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 

జాతీయ పండుగగా గుర్తించాలి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సర్కారు జాతరలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఇప్పటి వరకు కోటీ 20 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారని అన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంలో జాతరలో పని చేశాయని ఆయన అభినందించారు. జాతర ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. వన ప్రవేశం సమయానికి కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు. 

జాతీయ హోదాపై రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తా ..:రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్‌

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించే విధంగా రాజ్యసభలో తన గళాన్ని వినిపిస్తానని ఎంపీ బండాప్రకాశ్‌ అన్నారు. జాతరకు దేశవ్యాప్తంగా భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, అందుకు తగిన వసతులు కల్పించేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. 

మేడారం జాతర అంటేనే మహాకుంభమేళా :మాజీ స్పీకర్‌, సిరికొండ మధుసూదనాచారి 

మేడారం అంటేనే మహాకుంభమేళా అని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. 40 ఏళ్ల నుంచి తల్లులను దర్శించుకుంటున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే జాతరలో సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కోటి మందికిపైగా భక్తులు తల్లులను దర్శించుకునే జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించాలని అన్నారు.  ‚


logo