శనివారం 28 మార్చి 2020
Jangaon - Feb 07, 2020 , 03:18:50

కొలువుదీరిన వన దేవతలు

కొలువుదీరిన వన దేవతలు
  • జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
  • శ్రీపతిపల్లిలో ఎడ్లబండ్లపై రాక
  • మొక్కులు చెల్లిస్తున్న భక్తులు

చిలుపూర్‌, ఫిబ్రవరి 06 : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ గురువారం రాత్రి గద్దెలపై కొలువుదీరారు. కాగా చిలుపూర్‌ మండల పరిధిలోని లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఫత్తేపూర్‌ గ్రామాల్లో ఏర్పాటైన సమ్మక్క-సారలమ్మ జాతరలో తల్లుల దర్శనానికి భక్తులు తండోపతండగాలుగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో భక్తులు పొర్లు దండాలు పెట్టి పూజారులను మొక్కారు. సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తున్న క్రమంలో భక్తుల రద్దీ ఎక్కువకావడంతో వారిని పోలీసులు అదుపు చేసేందుకు కొంత ఇబ్బందులు పడ్డారు. గద్దెలపై కొలువైన దేవతలకు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో రమేశ్‌, ఏసీపీ గంధం మనోహర్‌, సీఐలు రాజిరెడ్డి, సతీశ్‌కుమార్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, మహేందర్‌, అశోక్‌కుమార్‌ భారీ బందోబస్తు నిర్వహించారు. దేవతల దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ చైర్మన్‌ మోతె శ్రీనివాస్‌, ఈవో శేషుభారతి ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు తాగునీరు, విద్యుత్‌ సమస్య ఏర్పడగా ఆర్డీవో రమేశ్‌ స్వయంగా ఆ శాఖ అధికారులో మాట్లాడి సిబ్బందిని పురమాయించడంతో సమస్య తొలగిపోయింది.


జాతరకు తరలివచ్చిన భక్త జనం 

లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారులు ఊహించిన దానికన్నా ఎక్కువ మోతాదులో భక్తులు రావడంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది కలిగింది. మొదట పోలీసులు రెండు చోట్ల పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేయగా, జాతరకు దూరంగా ఉండడంతో భక్తులు నడవలేక ఇబ్బందులు పడగా వాహనాలను లోనికి అనుమతించారు. దీంతో కొంత ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. వన దేవతలకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి యువసేన జిల్లా అధ్యక్షుడు కేసిరెడ్డి రాకేశ్‌రెడ్డి నిలువెత్తు బంగారాన్ని దేవతలకు సమర్పించారు. కాగా జాతరలో సర్పంచ్‌ రవీందర్‌, ఎంపీటీసీ రవీందర్‌, వైస్‌ చైర్మన్‌ బాలరాజు, ఉపసర్పంచ్‌ రాజన్న, నాయకులు రవీందర్‌, రాజు, కనకయ్య, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.


శ్రీపతిపల్లిలో..

శ్రీపతిపల్లి-కొండాపూర్‌ సమ్మక్క-సారలమ్మ జాతరకు గురువారం సాయంత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జాతర చైర్మన్‌ కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి జాతరకు ఎడ్ల బండిపై వచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలను తీసుకువెళ్లి మొక్కులను సమర్పించారు. పూజలోసర్పంచ్‌లు ప్రత్యుషారెడ్డి, రజిత, కమిటీ సభ్యులు ప్రవీణ్‌, రమేశ్‌, ఉపసర్పంచ్‌ సంపత్‌, వెంకన్న, మాజీ సర్పంచ్‌లు రామదాసు, ఎల్లయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే రాజయ్య లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఫత్తేపూర్‌లో వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు ఎంపీపీ సరిత, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకుడు రంజిత్‌రెడ్డి ఉన్నారు.


దర్శనానికి బారులుదీరిన భక్తులు 

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, నమస్తేతెలంగాణ : మండలంలోని తాటికొండ-జిట్టెగూడెం, ఇప్పగూడెం-రంగరాయగూడెం గ్రామాల పరిధిలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం సమ్మక్క గద్దెపై కొలువుదీరింది. ఈసందర్భంగా అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ గంధం మనోహర్‌, సీఐ రాజిరెడ్డి పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే రాజయ్య జిట్టెగూడెం, ఇప్పగూడెం, ఫత్తేపూర్‌లో తల్లులకు మొక్కలు చెల్లించారు. ఆయన వెంట జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ రవి, ఎంపీపీ రేఖ, ఆర్డీవో రమేశ్‌, తాటికొండ జాతర చైర్మన్‌ ఉమాసుధీర్‌రెడ్డి, లలితహన్మంతునాయక్‌, ఉపసర్పంచులు రాములు, రవీందర్‌, బాలరాజు, ఎంపీటీసీలు నర్సింహులు, వెంకటస్వామి, శైలజఅజయ్‌రెడ్డి, విజయలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


రంగరాయగూడెం తరలిన భక్తులు

పాలకుర్తి : సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి భక్తులు రంగరాయగూడెం జాతరకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించారు.


logo