సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Feb 06, 2020 , 03:27:37

గద్దెకు చేరిన సారలమ్మ

గద్దెకు చేరిన సారలమ్మ
  • ప్రతిష్ఠించిన కోయ పూజారులు
  • వైభవంగా కొనసాగుతున్న జాతర
  • తరలివస్తున్న ప్రజలు
  • మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
  • నేడు సమ్మక్క రాక

చిలుపూర్‌, ఫిబ్రవరి 05 : వన దేవతలైన సమ్మక్క-సారలమ్మ జాతర మండలంలోని లింగంపల్లి, శ్రీపతిపల్లి, ఫత్తేపూర్‌ గ్రామాల్లో వైభవంగా కొనసాగుతున్నది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో సాగుతుండగా బుధవారం సాయంత్రం సారలమ్మను కోయ పూజారులు తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. గ్రామంలోని గొడుగు వారి కుటుంబం నుంచి సారలమ్మ దేవతను గ్రామస్తులతో పాటు కోయ పూజారులు డప్పు చప్పుళ్ల నడుమ తీసుకువచ్చారు. సారలమ్మను తీసుకువస్తున్న క్రమంలో శివసత్తులు పూనగా దేవతల గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. దేవతను ప్రతిష్ఠించిన అనంతరం సీఐ రాజిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనాయక్‌, పలు శాఖలకు చెందిన అధికారులు, భక్తులు దేవతలను దర్శించుకున్నారు. సారలమ్మను కోయ పూజారి పిడబోయిన విజయలత తీసుకురాగా వారి వెంట కోయ పూజారులు మొలుకం నర్సక్క, లక్ష్మయ్య, ఎలబోయిన సమ్మక్క, తూస సారయ్య, వాసం సమ్మక్క, రాంమూర్తి, ఉపేందర్‌ ఉన్నారు. శ్రీపతిపల్లి జాతరలో సారలమ్మను కోయ పూజారులు గద్దెలకు తీసుకురాగా జాతర చైర్మన్‌ కేసిరెడ్డి మనోజ్‌రెడ్డితో పాటు జాతర కమిటీ సభ్యులంతా కలిసి సారలమ్మకు స్వాగతం పలికారు. గద్దెకు వచ్చిన దేవతకు ప్రత్యేక పూజలను చేశారు. గ్రామ సర్పంచ్‌ కేసిరెడ్డి ప్రత్యుషారెడ్డితో పాటు కొండాపూర్‌ సర్పంచ్‌ రజిత పాల్గొన్నారు.


ఎత్తు బంగారంతో మొక్కులు

జాతర సందర్భంగా భక్తులు దేవతలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. ప్రతి గ్రామంలో అమ్మవారికి నిలువెత్తు బంగారు(బెల్లం) సమర్పించేందుకు తూకాలు వేస్తున్న దృశ్యాలు కనిపించాయి. 


జాతర సేవకులుగా లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి 

లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతరలో సేవ చేసేందుకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి సేవా సమితి నుంచి తొమ్మిది మంది సేవకులు వచ్చారు. భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా డిప్యూటీ డీఎంహెచ్‌వో రాము, వైద్యాధికారి ఆదినారాయణ ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంపులు ఏర్పాటుచేశారు. హెచ్‌ఈవో రాంకిషన్‌, ఆర్‌డబ్ల్యూస్‌ ఈఈ రాజేంద్రకుమార్‌, డీఈ కరణ్‌కుమార్‌, ఏఈ సుకన్య, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ లింగమూర్తి, వీఆర్వోలు నాగేశ్వర్‌రావు, సంపత్‌ జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఇదిలా ఉండగా జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి జాతరకు హాజరై పోలీస్‌ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను అందించారు. అదేవిధంగా జేసీ ఓజే మధు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఆర్డీవో రమేశ్‌ సారలమ్మ దేవతను దర్శించుకున్నారు. వారి వెంట సీఐలు రాజిరెడ్డి, సతీశ్‌కుమార్‌, ఎస్సై శ్రీనివాస్‌, డీటీ సూర్య తదితరులు ఉన్నారు.


ఇప్పగూడెం జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఇన్‌చార్జి రమేశ్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని ఇప్పగూడెం-రంగరాయగూడెం, తాటికొండ-జిట్టగూడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆయా గ్రామాల్లో సారలమ్మను పూజారులు వేద మంత్రాలతో గద్దెల వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. పూజారులు నారాయణ, రఘు, భాషా, మల్లేశం ఆధ్వర్యంలో సారలమ్మను తీసుకువచ్చారు. అనంతరం సారలమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇప్పగూడెంలో జాతర ప్రత్యేక అధికారి రమేశ్‌ మాట్లాడుతూ సారలమ్మను పూజారుల సమక్షంలో ఊరేగింపు మధ్య గద్దె వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించినట్లు తెలిపారు. గురువారం మధ్యాహ్నం సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో సమన్వయంగా విధులు నిర్వర్తిస్తున్నామని ఆయన తెలిపారు. పూజలో తాటికొండ జాతర కమిటీ చైర్మన్‌ ఉమాసుధీర్‌రెడ్డి, లలిత హన్మంతునాయక్‌, ఉపసర్పంచులు రాములు, రవీందర్‌, బాలరాజు, జయపాల్‌నాయక్‌, రాజు, ఎంపీటీసీ వెంకటస్వామి, ఇప్పగూడెం జాతర కమిటీ నిర్వాహకులు ఎల్లగౌడ్‌, సర్పంచ్‌ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీలు శైలజ అజయ్‌రెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.


బాలికను చేరదీసిన పోలీసులు 

మతి స్థిమితంలేని 13 ఏళ్ల బాలిక చిన్నపెండ్యాల బ స్టాండ్‌ వద్ద ఉండగా స్థానిక సర్పంచ్‌ మామిడాల లింగారెడ్డి చేరదీసి పోలీసులకు అప్పగించారు. కాగా ఆ చిన్నారి పేరు, తల్లిదండ్రులతో పాటు గ్రామ వివరాలు అడగ్గా సరైన సమాధానం తెలియజేయలేదు. ఈవిషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేయడంతో వారు విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో మతిస్థిమితం లేని బాలికగా గుర్తించి వెంటనే హన్మకొండలోని అమ్మ అనాథ వృద్ధాశ్రమానికి తరలించారు.


logo