మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 05, 2020 , 03:45:36

వన దేవతల రాకకు వేళాయె

వన దేవతల రాకకు వేళాయె
  • నేడు సారలమ్మ రాక
  • ముస్తాబైన గద్దెలు
  • భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 04: స్టేషన్‌ఘన్‌ఫూర్‌ మండలంలోని ఇప్పగూడెం-రంగరాయిగూడెం, తాటికొండ-జిట్టగూడెం గ్రామాల పరిధిలో నిర్వహిస్తున్న వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేషన్‌ఘన్‌ఫూర్‌ ఆర్డీవో, ప్రత్యేకాధికారి రమేశ్‌ ఆదేశాల మేరకు ఇప్పగూడెం జాతర వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా గద్దెల చుట్టూ కర్రలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం విశాలమైన షెడ్డును నిర్మించారు. జాతర ప్రాంగణంలో దుకాణాలు కూడా సిద్ధమయ్యాయి. అలాగే తాటికొండ-జిట్టగూడెం సమ్మక్క-సారలమ్మ జాతరకు చైర్మన్లు చల్లా ఉమా సుధీర్‌రెడ్డి, మాలోత్‌ లలిత హన్మంత్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే రాజయ్య పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆటోడైవర్లు తక్కువ చార్జీలకే భక్తులను తీసుకెళ్లాలని అధికారులు సూచనలు చేశారు. జాతరలో భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, శానిటేషన్‌, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్లు, లైటింగ్‌ పనులు పూర్తయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో 24 గంటల వైద్య సదుపాయాన్ని కల్పిస్తుండగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా బందోబస్తు నిర్వహించనున్నారు.


భక్తులకు నీటి ఇబ్బందులు ఉండొద్దు

జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రాజేంద్రకుమార్‌ అధికారులకు ఆదేశించారు. మంగళవారం మండలంలోని ఇప్పగూడెం-రంగరాయిగూడెం సమ్మక్క-సారలమ్మ జాతరను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా జాతర ప్రాగంణంలో ఏర్పాటుచేసిన నీటి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఇప్పగూడెం జాతరలో 7 వాటర్‌ ట్యాంకర్లు, 3 బోర్లు, 13 ఓపెన్‌ హౌజులు, 18 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. తాటికొండ జాతరలో 5 వాటర్‌ ట్యాంకులు, 2 బోర్లు, 12 టాయిలెట్లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఈ కరణ్‌కుమార్‌, ఏఈ రజిత, ఇప్పగూడెం టీఆర్‌ఎస్‌ గ్రామ ప్రధాన కార్యదర్శి ఎల్లగౌడ్‌, నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పగూడెం జాతరను విజయవంతం చేయాలరి ఎంపీటీసీలు శైలజ అజయ్‌రెడ్డి, గండి విజయలక్ష్మి కోరారు.


ఆర్టీసీ బస్సులే సురక్షితం

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌ : మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులోనే వెళ్లాలని, అదే సురక్షిత ప్రయాణమని స్టేషన్‌ఘన్‌పూర్‌ మేడారం బస్‌ పాయింట్‌ ఇన్‌చార్జి డీ జితేందర్‌ తెలిపారు. మేడారం జాతర సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌లో పాయింట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నుంచి మేడారం జాతరకు దాదాపు 1627 మందికిపైగా భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బస్‌ పాయింట్‌ ఇన్‌చార్జీలు పీఆర్‌ రెడ్డి, పీ రమేశ్‌, సిబ్బంది సునీత, రజిత, రాజశేఖర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రామల్లు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


భక్తుల రాకే.. ఇక ఆలస్యం

చిలుపూర్‌ : వనదేవతల జాతరకు సర్వం సిద్ధమైంది. రెండేళ్లకోసారి జరిగే జాతరకు ఇక భక్తులు రావడమే ఆలస్యం. చిలుపూర్‌ మండల పరిధిలోని లింగంపల్లి జాతర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతుండగా, శ్రీపతిపల్లి-కొండాపూర్‌, ఫత్తేపూర్‌-గార్లగడ్డతండా జాతరలు స్వయం కమిటీలు నిర్వహిస్తున్నాయి. లింగంపల్లి జాతర ప్రాంగణం ఇప్పటికే ముస్తాబైంది. భక్తులకు, వ్యాపారులకు సరైన సదుపాయాలను కల్పించేందుకు దేవాదాయ శాఖ జాతర ఇన్‌చార్జి ఈవో శేషుభారతి అన్ని పనులను చేపడుతున్నారు. 120 షాపులను వ్యాపారులకు కేటాయించినట్లు పంచాయతీ కార్యదర్శి భీమ్‌రాజ్‌ తెలిపారు. అడుగడుగునా పోలీస్‌ నిఘాతో పాటు 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు. శ్రీపతిపల్లి జాతరకు భక్తుల సంఖ్య గతం కన్నా ఈసారి మరింత పెరిగేందుకు జాతర కమిటీ చైర్మన్‌ కేసిరెడ్డి మనోజ్‌రెడ్డి గ్రామాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఫత్తేపూర్‌-గార్లగడ్డతండా వద్ద నిర్వహించనున్న జాతరకు గిరిజన ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని జాతర కమిటీ చైర్మన్‌ చంద్రమౌళి అన్ని ఏర్పాట్లను చేశారు. పోలీసులు జాతీయ రహదారి చిన్నపెండ్యాల నుంచి లింగంపల్లి, శ్రీపతిపల్లి వరకు రోడ్డు వెంట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.


జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలి

సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తులు సజావుగా జరిగేలా చూడాలని, ఆ బాధ్యత అందరిపై ఉందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీవో రమేశ్‌, ఏసీపీ గంధం మనోహర్‌ సూచించారు. లింగంపల్లి జాతర ప్రాంతాన్ని వారు మంగళవారం సందర్శించి భక్తులు తమ వాహనాలను పార్కింగ్‌ స్థలంలోనే నిలపాలన్నారు. ఇదిలాఉండగా శ్రీపతిపల్లి-కొండాపూర్‌ సమ్మక్క-సారలమ్మ జాతర పనులను చిలుపూర్‌, తరిగొప్పుల ఎస్సైలు మహేందర్‌, హరిత పరిశీలించారు. ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని పోలీసులను వారు ఆదేశించారు. చిన్నపెండ్యాల గ్రామంలో లింగంపల్లి, శ్రీపతిపల్లి జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆ గ్రామ సర్పంచ్‌ మామిడాల లింగారెడ్డి రోడ్డుపై ఉన్న గుంతలను మొరం పోయించి పూడ్చారు.


రెనోవేషన్‌ కమిటీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ 

లింగంపల్లి సమ్మక్క-సారలమ్మ జాతర రెనోవేషన్‌ కమిటీ చైర్మన్‌గా మోతె శ్రీనివాస్‌ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి వీ అనిల్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా కొలిపాక రాజు, ఇంద్రావత్‌ రాములు, బొట్టు యాదగిరి, గొడుగు కొమురయ్య, పురుమాని సంపత్‌, ఇల్లందుల వెంకటస్వామి, పోలెపల్లి రాంరెడ్డి, పెనుకుల యాదగిరి, వేముల రవి, పోలు రమాదేవి, భూక్య రవి, ఉడుత అశోక్‌, మర్రి శ్రీధర్‌, కొయ్యడ రమేశ్‌, ఉడుత వెంకన్న, రావులపల్లి వెంకన్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.logo
>>>>>>