బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Feb 05, 2020 , 03:43:29

సహకార ఎన్నికల్లో రైతే గెలవాలి

సహకార ఎన్నికల్లో రైతే గెలవాలి

జనగామ, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో రైతులే గెలిచేలా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓటేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తిలో గోదావరి జలాలతో నిండుతున్న పెద్దచెరువును పరిశీలించిన అనంతరం సహకార ఎన్నికలపై క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యులు, రైతు నాయకులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని సహకార సంఘాలపై గులాబీజెండా ఎగిరేలా మొత్తం చైర్మన్‌ పదవులు, డైరెక్టర్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ రైతులు బాగా బతకాలనే సంకల్పంతో కరువుగడ్డ జనగామకు గోదావరి నీళ్లిచ్చి ఆదుకుంటున్నాని, రైతుల పక్షాన ఆయనకు పాదాభివందం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 


అప్పటి ప్రభుత్వంలో నీళ్ల మంత్రిగా ఉన్న జనగామకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయాడని ముత్తిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు జనగామ జిల్లాకు గోదావరి జలాలు వస్తున్నాయంటే అది సీఎం కేసీఆర్‌ దయతోనే అని వివరించారు. కేసీఆర్‌ పాలనలో ఉచిత కరంట్‌, నీళ్లు, పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెట్‌లో సౌకర్యాలు, గోదాంలు, ఎరువులు, పురుగుమందులు, పంట పెట్టుబడి సాయం, రైతుబంధు, బీమా పథకాలను చూసి టీఆర్‌ఎసస్‌ అభ్యర్థులకు ఓటేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 2014లో నియోజకవర్గంలో 2,750 బోర్లకు తమ సీడీఎఫ్‌ ఫండ్‌ మొత్తాన్ని ఖర్చు చేస్తే 150 బోర్లు పడలేదని, అలాంటి బాధలున్న జనగామకు తొలి దశలోనే భగీరథ పథకం అందించిన కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలో కరంట్‌ కష్టాలు లేకుండా సబ్‌స్టేషన్లు నిర్మించారని, జనగామ చంపక్‌హిల్స్‌ వడ్లకొండలో నిర్మించిన 400కేవీ సబ్‌స్టేషన్‌ ద్వారా రాబోయే 50 ఏండ్ల వరకు కరంట్‌ లోటు రాకుండా కోత  లేకుండా ఇక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కరంట్‌ అందిస్తూ జనగామ చరిత్ర సృష్టించిందన్నారు.


ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందిస్తాం

జనగామ రూరల్‌ : నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గోదావరి జలాలను అందిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పెంబర్తి గ్రామ చెరువులోకి గోదావరి జలాలు వస్తుండటంతో ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ మాత్రమే విజయం సాధిస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమని అన్నారు. సహకార సంఘం ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, జిల్లా నాయకులు సిద్దిలింగం, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు శారద, వార్డు సభ్యులు రాజు, ఎల్లయ్య, సుధాకర్‌, రాజు, ప్రేమ్‌ సాగర్‌, శ్రవణ్‌, సత్తయ్య, శ్రీనివాస్‌, రాములు, యాదగిరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


logo