శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jangaon - Feb 04, 2020 , 02:44:23

మోగిన ‘సహకార’ నగారా..

మోగిన ‘సహకార’ నగారా..

జనగామ, నమస్తేతెలంగాణ, ఫిబ్రవరి 03: జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం వెలువడిన వెంటనే ఆయా మండలాల్లో సహకార సంఘాల వారీగా చైర్మన్‌, డైరెక్టర్ల రిజర్వేషన్లు, ఓటరు జాబితాను ప్రకటించారు. జిల్లా పరిధిలో 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే.. అందులో 1,19,172 మంది సభ్యులు ఉండగా, 51,626 మందిని ఓటర్లుగా తేల్చారు. ఈ నెల 15వ తేదీన పోలింగ్‌ జరగనుండగా అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్‌.. సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు మండలాల వారీగా ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. ఈ మేరకు అన్ని సంఘాలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నది. కాగా, వరుస అపజయాలతో తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్ష పార్టీలు సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని 12 మండలాలు ఉంటే.. పాత 10 మండలాల పరిధిలో లింగాలఘనపురం, జనగామ, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల్లో రెండు సంఘాల చొప్పున, బచ్చన్నపేట, నర్మెట, దేవరుప్పుల, జఫర్‌ఘడ్‌, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 14 సహకార సంఘాల్లో జరిగే ఎన్నికల కోసం ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అదేరోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు ప్రకటించిన తర్వాత మూడు రోజుల వ్యవధిలో పాలక వర్గాలకు ఎన్నిక జరిపేందుకు సహకార సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 13 మంది డైరెక్టర్లు ఉండబోతున్నారు. వీరిలో ఒకరు ఎస్సీ జనరల్‌, ఒకరు ఎస్సీ మహిళ, ఒకరు ఎస్టీ, రెండు బీసీ, ఒక ఓసీ మహిళ, ఏడు జనరల్‌కు కేటాయించారు.


logo