గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 04, 2020 , 02:39:40

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ కే నిఖిల

బాధ్యతలు స్వీకరించిన  కలెక్టర్‌ కే నిఖిల

జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 03: జనగామకు పదోన్నతిపై వచ్చిన కలెక్టర్‌ కే నిఖిల సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన వెంటనే కలెక్టర్‌ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ తన చాంబర్‌కు వినతిపత్రాలతో వచ్చిన వారిని పిలిచి మాట్లాడి, అధికారులతో ముఖాముఖీగా సమావేశమై.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిఖిల పదోన్నతిపై జనగామ కలెక్టర్‌గా వచ్చారు. గతంలో ఆమె సిద్దిపేట, హైదరాబాద్‌ ఆర్డీవోగా పని చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కొద్ది నెలలు పని చేసి, ఏడాది క్రితం సంగారెడ్డి జిల్లా జేసీగా బదిలీపై వెళ్లారు. అక్కడి నుంచి నిఖిల పదోన్నతిపై జనగామ కలెక్టర్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌కు చెందిన నిఖిల భర్త హైదరాబాద్‌లో ఆర్కెటెక్చర్‌ కాగా, వీరికి ఒక బాబు ఉన్నాడు. కలెక్టర్‌ నిఖిల తండ్రి రామకృష్ణారెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లా న్యాయమూర్తిగా పని చేసి పదవీ విరమణ చేశారు. పునర్విభజన తర్వాత కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లాకు ఈమె 3వ కలెక్టర్‌గా పని చేయనున్నారు. కాగా, తొలుత జాయింట్‌ కలెక్టర్‌ జేసీ మధు, డీఆర్వో మాలతి, కలెక్టరేట్‌ ఏవో వీరప్రకాశ్‌, ఏపీఆర్వో ప్రేమలత కలెక్టర్‌ కే నిఖిలకు ఘన స్వాగతం పలుకగా, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాశెట్టి హరిప్రసాద్‌, జాయింట్‌ సెక్రటరీ రమేశ్‌ సహా పలువురు అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు కలెక్టర్‌ కే నిఖిలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

తొలిరోజు కలెక్టర్‌ బిజీబిజీ..

కలెక్టర్‌గా పాలనా పగ్గాలు చేపట్టిన కే నిఖిల తొలిరోజు అధికారులతో మాటామంతి, శాఖల వారీగా పథకాలపై సమీక్షించి, జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల పరిశీలనతో రోజంతా బిజీబిజీగా గడిపారు. కలెక్టర్‌గా జిల్లాలో అడుగుపెట్టిన నిఖిలకు జిల్లా అధికార యంత్రాంగం పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం కలెక్టరేట్‌లో శాఖల వారీగా జిల్లా అధికారులను పేరుపేరున పరిచయం చేసుకొని వారి పరిధిలో అమలవుతున్న పథకాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాల పునర్విభజన తర్వాత కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏ శ్రీదేవసేన ఏడాదిన్నరకు పైగా జిల్లా పాలనను పరుగులు పెట్టించి.. 2018 జనవరి మొదటి వారంలో పెద్దపెల్లి కలెక్టర్‌గా బదిలీపై వెళ్లగా, కొద్దిరోజులు భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌గా వ్యవహరించారు. అనంతరం 2018 మార్చి 12న ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చిన వినయ్‌కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించి, తనదైన శైలిలో దాదాపు 23 నెలలపాటు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారు. ఆదివారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో సంగారెడ్డి నుంచి జనగామకు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే కలెక్టర్‌ కే నిఖిల అధికార యంత్రాంగంపై పట్టుబిగించారు. ‘అధికారులు నిబద్ధతతో పని చేయాలె తప్ప తెలియని విషయాన్ని తెలిసినట్లు వ్యవహరించడం మంచిది కాదు. కలెక్టరేట్‌లో సమీక్షలు కాదు.. నేరుగా మీ కార్యాలయాలకు వచ్చి పరిశీలిస్తా. కాగితాల్లో లెక్కలపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తా. అభివృద్ధికి అధికారులంతా సహకరించాలి’ అని సుతిమెత్తగా చురకలు అంటించిన ఆమె.. ప్రజలు ఏదైనా పని ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. 

పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని, సంక్షేమ పథకాల అమలులో జిల్లాను ముందుంచాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పోటీ పడి జనగామను అభివృద్ధి చేసే సంకల్పం, ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. సూర్యాపేట రోడ్డులో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనం పనులను సమీక్షించిన కలెక్టర్‌ ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నాగేందర్‌రావుతో మాట్లాడి రోడ్డు పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మొట్టమొదటి సమస్యగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల రైతుల కందుల కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించిన ఆమె.. రైతులను చాంబర్‌కు పిలిచి పొరుగు జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఎదురయ్యే సాంకేతిక సమస్యను వివరించి రైతులకు నచ్చజెప్పారు.


logo