సోమవారం 30 మార్చి 2020
Jangaon - Feb 04, 2020 , 02:32:58

భక్తులకు సకల సౌకర్యాలు

భక్తులకు సకల సౌకర్యాలు

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మేడారం జాతర మెరిసేలా ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహాజాతర ఏర్పాట్లు, తీసుకుంటున్న సౌకర్యాలు తదితర అంశాలపై సోమవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేడారం జాతరకు ఈ సారి తెలంగాణ ప్రభుత్వం రూ. 75 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఆ నిధులతో జాతరలో రోడ్లు, టాయ్‌లెట్స్‌, మంచినీటి వసతి తదితర సౌకర్యాలు కల్పించామని చెప్పారు.  ఈ సారి కోటిన్నరకుపైగా భక్తులు హాజరవుతారని అంచనా వేశామని, జాతర ముగిసే వరకూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా 21 శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా పది వేల మంది సిబ్బంది శానిటేషన్‌ విధులు నిర్వర్తించనున్నారన్నారు. గతంలో జాతర సమయంలో మాత్రమే శానిటేషన్‌ సిబ్బంది ఉండేవారని, ప్రస్తుతం జాతరకు వారం రోజుల ముందునుంచే శానిటేషన్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.  ఈ సారి ప్లాస్టిక్‌ రహిత జాతరకు కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తులు కొబ్బరికాయలు, బంగారం తదితర వస్తువులు పట్టుకెళ్లేందుకు ఉచితంగా క్లాత్‌ బ్యాగ్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. దాతల నుంచి వేలాది బ్యాగులు సేకరించి చెక్‌ పోస్టుల వద్ద పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మేడారం జాతరలో తాను భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందన్నారు. మంత్రి ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి..

 నమస్తే తెలంగాణ: గత జాతరలకు ఈసారికి తేడా ఏమిటి ?

మంత్రి సత్యవతి రాథోడ్‌ : గత జాతరలకు ఈ ఏడాదికి చాలా తేడా ఉంది. ఈ సంవత్సరం భక్తులు ఇబ్బందులు  పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. గతంలో బోర్లు, బావి నీళ్లపై భక్తులు ఎక్కువగా ఆధారపడేవారు. ఈ సారి ఇబ్బందులు పడకుండా జాతరకు పరిసర ప్రాంతాల్లో ఐదు కిలో మీటర్ల మేర స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ నీటిని అందివ్వనున్నాం. నార్లాపూర్‌, కొత్తూరు, ఊరట్టం ప్రాంతాల వద్ద కూడా మిషన్‌ భగీరథ నీరు భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేశాం.  అదే విధంగా రూ. 2.70 కోట్లతో మూడు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌లను నిర్మించి నిరంతరం తాగునీరు అందించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. 

నమస్తే తెలంగాణ:  మేడారం భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు.?  

మంత్రి : మేడారంలో ముఖ్యంగా తాగునీరు, వసతి సౌకర్యంతో పాటు శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. శానిటేషన్‌ సమస్య రాకుండా జాతర  పరిసర ప్రాంతాల్లో పది వేల మంది సిబ్బంది ఏర్పాటు చేశాం. ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా 2,500 పర్మనెంట్‌ టాయిలెట్స్‌తో పాటు కొత్తగా 8,200 టాయిలెట్స్‌ను నిర్మించాం. రూ. 7 కోట్లతో 7 షెడ్‌లను నిర్మించాం. వీటిలో 5 వేల మంది భక్తులకు అదనపు వసతి కల్పిస్తున్నాం.


logo