శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 03, 2020 , 02:56:22

తల్లుల సేవలో ఆర్టీసీ

తల్లుల సేవలో ఆర్టీసీ
  • 51 పాయింట్లు.. 4వేల బస్సులు
  • సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ
  • విధుల్లో 12,500 మంది సిబ్బంది
  • ఈసారి టార్గెట్‌ 25 లక్షలమంది ప్రయాణం

రాష్ట్రవ్యాప్తంగా జాతరకు నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, అదిలాబాద్‌ రీజియన్ల పరిధిలోని 51పాయింట్ల నుంచి రాకపోకలు కొనసాగుతాయి. హన్మకొండ, వరంగల్‌, జనగామ, నర్సంపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్‌, భూపాలపల్లి, కాళేశ్వరం, మహబూబాబాద్‌, ములుగు, గోదావరిఖని, కరీంనగర్‌, , పెద్దపల్లి, అదిలాబాద్‌, అసిఫాబాద్‌, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడ, భద్రాచలం, హైదారాబాద్‌ తదితర ప్రాంతాలనుంచి బస్సులు నడుస్తాయి. కాగా, జాతరకోసం టీఎస్‌ ఆర్టీసీ 12,500 మంది సిబ్బందిని నియమించింది. వీరిలో 8,400మంది డ్రైవర్లు, 3వేల మంది కండక్టర్లు, మిగతావారు మెకానిక్‌లు, సెక్యూరిటీ గార్డులు,సూపర్‌వైజర్లు,  డిపో మేనేజర్‌నుంచి రాష్ట్రస్థాయి ఈడీల వరకు విధులు నిర్వహిస్తారు. సిబ్బంది భోజనం, విశ్రాంతికి మేడారం బస్‌స్టేషన్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 


పోలీసు శాఖతో సమన్వయం..

జాతర సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు ఆర్టీసీ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గతంలో కొన్నిసార్లు సమన్వయం కొరవడటంతో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ రవీందర్‌ ట్రాఫిక్‌ ఇన్‌చార్జీగా కొనసాగుతుండగా.. ములుగు ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 16మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లు పర్యవేక్షించనున్నారు. వీరు ఆర్టీసీ బస్సుల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కోటిమందికి పైగా భక్తులు వచ్చే మేడారం జాతరకు వచ్చే, పోయే భక్తులతో బస్సులు కిటకిటలాడుతాయి. ఒకే సమయంలో వందల సంఖ్యలో వచ్చే బస్సులు వెళ్లే బస్సులు ఎదురుపడుతాయి. దీంతోపాటు ప్రైవేటు వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఈసమయంలో మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతాయి. గత జాతర ట్రాఫిక్‌ అనుభవాల దృష్ట్యా ఈసారి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ సమస్యలపై ఆర్టీసీ, పోలీసు శాఖల అధికారులు వరంగల్‌, హైదారాబాద్‌లో పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. మేడారం వచ్చిన డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించారు. 


ఎమర్జెన్సీ మొబైల్‌ బృందాలు

ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ స్తంభించకుండా అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహనాల తాకిడి ఉండే పస్రా,తాడ్వాయి మధ్య ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా నాలుగు బైక్‌ మొబైల్‌ పార్టీలు, మేడారం నుంచి వరంగల్‌, ములుగు, ములుగుఘన్‌పూర్‌, ఏటూరునాగారం, నర్సంపేట రూట్లలో 15 మొబైల్‌ టీంలు ఏర్పాటుచేశారు. రోడ్డుపై బస్సులు ఆగిపోతే వెంటనే పక్కకు నెట్టడానికి ఎనిమిది రిలీఫ్‌ వ్యాన్లు అందుబాటులో ఉంచుతున్నారు. రెండు క్రేన్లు, ఒక ట్రాక్టర్‌ను కూడా సిద్ధం చేశారు. వరంగల్‌- పస్రా, మహబూబాబాద్‌-మల్లంపల్లి, కాళేశ్వరం, భూపాలపల్లి, ములుగు, ఘన్‌పూర్‌-జంగాలపల్లి, కొత్తగూడెం, ఏటూరునాగారం రూట్లలో జీపులతో మొబైల్‌పార్టీలు గస్తీ తిరుగుతాయి. ఈ వాహనాల్లో డీఎం, సూపర్‌వైజర్‌, మెకానిక్‌, సిబ్బంది ఉంటారు. ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమైతే తాడ్వాయి మార్గంలో కామారం, ఏటూరునాగరం రూట్‌లో చిన్నబోయినపల్లి వద్ద పార్కింగ్‌ స్థలం, అంతేకాకుండా మేడారం,పస్రా, గట్టమ్మ వద్ద నాలుగు బస్సుల మెయింటనెన్స్‌ క్యాంపులు.. ఆర్టీసీ బస్సుల మరమ్మతుల కోసం మేడారంలో ప్రత్యేకంగా గ్యారేజీని కూడా ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ సమస్యలపై ఆర్టీసీ అధికారులు వైర్‌లెస్‌ వాకీటాకీల ద్వారా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు. 


యూనిక్‌ కోడ్‌తో భక్తుల లెక్కింపు

జాతరకు వచ్చి, పోయే భక్తుల సంఖ్యను కచ్చితంగా లెక్కించడానికి ఆర్టీసీ సెంట్రలైజ్‌డ్‌ ఇన్ఫర్మేషన్‌ విధానాన్ని వినియోగించనున్నది. కండక్టర్‌, లేదా టికెట్‌ కౌంటర్‌లో భక్తులకు ఇచ్చే టికెట్లను టిమ్‌మిషన్స్‌తో ఇస్తారు. ప్రతి మిషన్‌కు సింబాలిక్‌ యూనిక్‌ కోడ్‌ ఉంటుంది. ఇదే నంబర్‌ బస్సుకు కుడా కేటాయిస్తారు. బస్సులో సరిపడా సీట్లలో భక్తులు ఎక్కిన తర్వాత యూనిక్‌ కోడ్‌ ద్వారా భక్తుల సంఖ్య తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఆ బస్సు నడిపే డ్రైవర్‌, కండక్టర్‌ వివరాలు.. బస్సు లోకేషన్‌ కుడా తెలుస్తుంది. ఈప్రక్రియ ద్వారా గంట, గంటకు ఎంతమంది భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారనేది యూనిక్‌కోడ్‌ కౌటింగ్‌ కేంద్రంనుంచి తెలుసుకోవచ్చు. 


40 ఎకరాల విస్తీర్ణంలో బస్‌స్టేషన్‌ 

మేడారం జాతరలో 40 ఎకరాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. 20 ఎకరాల్లో టికెట్‌ కౌంటర్లు, మరో 20ఎకరాల్లో బస్సుల పార్కింగ్‌. ఇక్కడ ఆర్టీసీ అధికారులకు, ఉద్యోగులకు వసతులు ఏర్పాటుచేశారు. అంతేకాకుండా భక్తుల టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి, లైటింగ్‌ తదితర సౌకర్యాలు కల్పించారు. బస్‌స్టేషన్‌ ఆవరణలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఉంటుంది. ఇక్కడినుంచి ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తారు. తిరుగుప్రయాణంలో భక్తులు సాఫీగా టికెట్‌ తీసుకుని బస్సు ఎక్కడానికి పాయింట్ల వారీగా టికెట్‌ కౌంటర్లు ఏర్పాటుచేశారు. 


జాతర స్పెషల్స్‌

40 సీసీ కెమెరాలు.. 3 ఎల్‌ఈడీ స్క్రీన్లు: జాతర బస్‌స్టేషన్‌ ఆర్టీసీ అలైటింగ్‌, బోర్డింగ్‌ పాయింట్‌ వద్ద 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అక్కడ కంట్రోల్‌ రూం ద్వారా పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సుల రాకపోకలను సీసీ కెమెరాలతో కమాండ్‌ కంట్రోల్‌నుంచి పర్యవేక్షిస్తారు. జాతర ఆర్టీసీ ప్రాంగణంలో మూడు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర దృశ్యాలతోపాటు వినోదం కోసం సినిమాలు ప్రదర్శిస్తారు.ఆర్టీసీ కళా బృందం చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.


మొదటిసారి మహారాష్ట్ర బస్సులు: మేడారం జాతరకు మొదటిసారిగా మహారాష్ట ప్రభుత్వం 25 ప్రత్యేక సర్వీస్‌లను నడుపుతున్నది. మహారాష్ట్రలోని సిరొంచ తదితర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులను సిరొంచ గోదావరి బ్రిడ్జి మీదుగా మేడారానికి చేరవేస్తున్నది.  

ఉచిత ప్రయాణం: ప్రైవేట్‌ వాహనాల్లో వచ్చే భక్తులకోసం పస్రానుంచి నార్లాపూర్‌ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. చింతల్‌ నుంచి జంపన్నవాగు ఒడ్డు కొంగలమడుగు వరకు రోజూ 10 షటిల్‌ బస్సులు రాత్రీపగలు తిరుగుతాయి. ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. వీటికోసం తాత్కాలిక బస్‌పాయింట్లను ఏర్పాటు చేశారు. 30 మినీ పల్లెవెలుగు బస్సులు నిరంతరం భక్తులను చేరవేస్తాయి.

జాతర నిధులు.. రూ.2.48 కోట్లు: జాతరకు వచ్చే భక్తులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడు లేని విధంగా రూ. 2.48 కోట్ల నిధులు మంజూరు చేసింది. logo