శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Feb 03, 2020 , 02:59:31

‘సహకార’ సమయం

‘సహకార’ సమయం
  • నేడు విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్‌
  • 15న పోలింగ్‌.. అదే రోజు ఫలితాల వెల్లడి
  • ఓటరు జాబితా రూపకల్పనపై అధికారుల ముమ్మర కసరత్తు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 10 పాత మండలాల్లో ఉన్న 14 సంఘాలకు ఎన్నికలు ఈ నెల 15న పోలింగ్‌ జరుగనుండగా అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌, రిజర్వేషన్‌, ఓటర్ల జాబితా అంశాలపై అధికారులు ఆదివారం అర్ధరాత్రి వరకు కసరత్తు చేశారు. సోమవారం తుది జాబితాను ప్రటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, 14 సంఘాల్లో కలిపి 50 వేలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.  


మొదలైన ఎన్నికల కోలాహలం

ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండగా, వారిలో ఒక ఎస్సీ, ఒక ఎస్సీ(మహిళ), ఒక ఎస్టీ, రెండు బీసీ, ఒక ఓసీ (మహిళ), ఏడు జనరల్‌కు కేటాయిస్తారు. ఒక్కో సంఘం ఎన్నికలకు ఒక్కో ఎన్నికల అధికారిని నియమించారు. ఆ అధికారి పర్యవేక్షణలో ఎన్నికలు జరగుతాయి. గ్రామీణ వ్యవస్థలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే పీఏసీఎస్‌ల ఎన్నికల కోలాహలం మొదలైంది. ఓవైపు మేడారం జాతర, మరో వైపు ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుండడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. జాతర 5, 6, 7వ తేదీల్లో జరగనుండగా, 6,7,8వ తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. సరిగ్గా జాతర సమయంలోనే నామినేషన్ల స్వీకరణ ఉంటుండడంతో బరిలో నిలవాలనుకునే వారు సమీకరణాల తీరుతెన్నులపై పునరాలోచన చేస్తున్నారు. రాజకీయ పరమైన విషయాలపై స్థానిక నేతలు ముందస్తుగానే చ ర్చించుకుంటున్నారు. పోటీలో నిలబడే వారు ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని  ప్రకటించుకుంటున్నారు.


జిల్లాలో రెండు కొత్త మండలాలు

జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత తరిగొప్పుల, చిలుపూర్‌ మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాల్లో పీఏసీఎస్‌లు లేవు. దీంతో ఎన్నికల వేడి ఈ రెండు మండలాల్లో కనిపించదు. లింగాలఘపురం, జనగామ, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల్లో రెండేసి సంఘాలు ఉన్నాయి. బచ్చన్నపేట, నర్మెట, దేవరుప్పుల, జఫర్‌ఘడ్‌, కొడకండ్ల, స్టేషన్‌ఘనపూర్‌లో ఒక్కో సంఘం ఉంది. పైన పేర్కొన్న మండలాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. మండలస్థాయిలో ఈ ఎన్నికలను స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కొంతకాలంగా పర్సన్‌ ఇన్‌చార్జిల పాలన సాగుతున్నది. పర్సన్‌ ఇన్‌చార్జి పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చారు. తాజాగా ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనుండడంతో మండలస్థాయి నేతలు పదవిపై ఆశలు పెంచుకున్నారు.


logo