మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Feb 02, 2020 , 02:23:56

ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
  • బాలురలో వనపర్తి, బాలికల్లో రంగారెడ్డి జట్ల విజయం
  • జాతీయస్థాయిలో రాష్ట్రం పేరు నిలబెట్టాలని పిలుపు
  • బహుమతులు అందజేసిన కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 01: మూడు రోజులుగా జనగామలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న 46వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలబాలికల కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, కబడ్డీ జాతీయస్థాయి బంగారు పతకం గ్రహీత ధర్మరాజ్‌ సెల్లదాన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, ఏసీపీ వినోద్‌కుమార్‌, అసోసియేషన్‌ రా్రష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయస్థాయిలో రాష్ట్రం పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. క్రీడా పోటీలను విజయవంతం చేసినందుకు జిల్లా కమిటీ సభ్యులను కలెక్టర్‌, డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. కమిటీ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గెలుపొందిన జట్లను ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా అతిథులు, దాతలను సత్కరించారు.


logo
>>>>>>