గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Feb 02, 2020 , 02:22:15

చివరి ఆయకట్టు వరకూ సాగునీరు

చివరి ఆయకట్టు వరకూ సాగునీరు

రఘునాథపల్లి, ఫిబ్రవరి 01: పోరాడి సాధించుకున్న తెలంగాణలో చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కంచనపల్లిలో శనివారం ఆయన అధికారులు, సర్పంచ్‌లు, నాయకులతో కలిసి దేవాదుల ద్వారా నిర్మించిన కెనాల్‌ను పరిశీలించారు. అనంతరం చెరువులను నింపేదుకు సర్పంచ్‌ గవ్వాన్ని విజయ-నాగేశ్వర్‌రావు ఇంట్లో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఏటా రూ. 25 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేస్తుండడం వల్ల మునుపెన్నడూ లేనివిధంగా యాసంగిలో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వ చ్చిందన్నారు. ప్రకృతి అనుకూలించడంతోపాటు చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఫలితాలు ఇవ్వడం వల్ల తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా వచ్చి చేరడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నట్లు వివరించారు.

6 లక్షల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపకల్పన జరిగిందని కడియం శ్రీహరి అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా దేవాదుల పనులను తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పనులన్నీ పూర్తి చేసి రైతులకు అండగా నిలిచిందని కొనియాడారు. కంచనపల్లి పక్క నుంచి వెళ్లే ఆర్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ కూడా నిండుగా ప్రవహిస్తుందంటే.. ఈ ప్రభుత్వం వేసిన ప్రణాళికే ముఖ్య కారణమని తెలియజేశారు. ఆర్‌ఎస్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ మెయిన్‌ కెనాల్‌ సిక్స్‌ఎల్‌ కాల్వ కింద గబ్బెట, కన్నాయపల్లి, కోడూరు, కంచనపల్లికి చెందిన 4500 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, సిక్స్‌ఎల్‌ ప్రారంభంలో భూమి వివాదం వల్ల పరిహారం అందకపోవడంతో కాల్వ పనులు పూర్తి కాలేదని, దీంతో ఈ మూడు గ్రామాల రైతులకు సాగునీరు అందించలేకపోతున్నామని తెలిపారు. కంచనపల్లికి చెందిన భూస్వామి మేకల శౌరెడ్డితో చర్చించడంతోపాటు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడానని, గబ్బెట, కన్నాయపల్లి, కోడూరు సర్పంచ్‌లతో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

అదేవిధంగా మెయిన్‌ కెనాల్‌పై కంచనపల్లికి సంబంధించిన రెండు కుంటలు, గబ్బెట, కోడూరులోని రెండు చెరువులను నింపేందుకు అవకాశం కల్పించడంతోపాటు కంచనపల్లిలోని కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి, దేవాదుల ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ సంగేశ్వరి, ఏఈ సుకన్య, భాస్కర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, సర్పంచ్‌లు పార్నంది కుమార్‌, వెంకట్‌నాయక్‌, రామగిరి సోమయ్య, గడ్డమీది కిరణ్‌, మినుకూరి ప్రకాశ్‌రెడ్డి, జిట్టెబోయిన రాజు, మాజీ ఎంపీపీ అనిత, మాజీ వైస్‌ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు లోనే శ్రవణ్‌కుమార్‌, కావటి రాజయ్య, మేకల నరేందర్‌, అన్నపురెడ్డి, బంధ కుమార్‌, మేకల మురళి, నానాజీ పాల్గొన్నారు.


logo
>>>>>>