శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Feb 02, 2020 , 02:21:44

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి

ప్రతి వాహనదారుడు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 01: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించేలా యువత వారిలో మార్పు తీసుకురావాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలను బయటకు తీసే ముందు తమ కుటుంబ సభ్యుల భవిష్యత్‌ను ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. జిల్లాలో చాలా మంది వాహనదారులు హైస్పీడ్‌తో వెళ్లడం, ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోడంతో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. 2020 సంవత్సరాన్ని జిల్లాలో ప్రమాదరహితంగా మారుద్దామని పిలుపునిచ్చారు. అలాగే, ఆపదలో ఉన్న వారి కోసం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా తొలిసారి జనగామ ఆర్టీఏ అధికారి ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో రవాణా శాఖ ఆరు నెలలకోమారు కొనసాగించాలని సూచించారు. డీటీవో రమేశ్‌రాథోడ్‌ మాట్లాడుతూ వాహనదారులు తప్పక నిబంధనలు పాటించాలన్నారు. ఈ శిబిరంలో 97 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు బ్లడ్‌ బ్యాంక్‌ డాక్టర్‌ రాంనర్సయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ సాయిచరణ్‌, రాములు, ఆర్టీఏ కార్యాలయం ఏవో సతీశ్‌, సిబ్బంది సృజన్‌, వెంకటేశ్‌, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.


logo