బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Feb 01, 2020 , 03:02:57

టిన్నర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ దగ్ధం

టిన్నర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ దగ్ధం
  • షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
  • భయం గుప్పిట్లో ఖిలాషాపురం
  • సంఘటన స్థలానికి 180మీటర్ల దూరంలోకస్తూర్బా పాఠశాల
  • అస్వస్థతకు గురైన 28 మంది విద్యార్థినులు

రఘునాథపల్లి జనవరి 31 : షార్ట్‌ సర్క్యూట్‌ చోటుచేసుకొని టిన్నర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ దగ్ధమైన సంఘటన శుక్రవారం రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జరిగింది. ఖిలాషాపురంతో పా టు చుట్టు పక్కల గ్రామాలైన మండెలగూడెం, మేకలగట్టు గ్రామాల్లో నల్లటి దట్టమైన పొగ వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెం దారు. కెమికల్‌ ఫ్యాక్టరీకి అతి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల ఉండడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా విద్యార్థినులను వెంటనే ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సులో మేకలగట్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తరలించారు. అక్కడ కూడా పొగ వ్యాపించడంతో అస్వస్థతకు గురైన సుమారు 28మంది విద్యార్థినులను 108 వాహనంలో జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే కెమికల్‌ ఫ్యాక్టరీ కావడంతో విషవాయువు వెలువడే ప్రమాదముందని సిబ్బంది మంటలు ఆర్పే చర్యలు తీసుకోలేదు. కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, జనగామ ఆర్డీవో మధుమోహన్‌, ఇండస్ట్రీయల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జానకీనాథ్‌ ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు.


ప్రమాదం జరిగిన తీరు..

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో తార ఇండస్రీస్‌ పేరుతో మూడేళ్లుగా టిన్నర్‌ తయారీ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా కస్తూర్బా పాఠశాలకు 180 మీటర్ల దూరంలో రసాయన పరిశ్రమ ఏర్పాటు చేసి టిన్నర్‌ ఉత్పత్తి చేస్తున్నారు.  ఈ క్రమంలో ఉదయం 7గంటల సమయంలో కెమికల్‌ ఫ్యాక్టరీ సిబ్బంది కత్తి సునీల్‌, కంబాల సాంబరాజు యంత్రాలు ఆన్‌చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌తో మిషన్లకు ఉండే రబ్బరు బెల్ట్‌కు నిప్పంటుకుంది. సెకన్ల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ అంతా వ్యాపించాయి. టిన్నర్‌కు మండేగుణం ఉండటంతో చూస్తుండగానే అక్కడ అగ్ని విస్పోటనం సంభవించింది. సిబ్బంది ప్రాణాలతో బయట పడడంతో అందరు ఊపిరిపీల్చుకున్నా రు. పరిశ్రమలో ఉన్న 4500 డ్రమ్ములు పెద్ద పెద్ద శబ్ధాలతో పేలాయి. దట్టమైన పొగలు పక్కనున్న గ్రామాలకు సైతం వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో 240 టన్నుల సామర్థ్యం గల ఐదు ట్యాంక్‌ల్లోని ముడిసరుకు కాలిపోయింది. మంటలను ఆర్పేందుకు జనగామ, ఆలేరు , హన్మకొండ నుంచి మూడు అగ్నిమాపక వాహనాలు చేరుకొని ఒంటి గంట వరకు మంటల ధాటికి ఏమీ చేయలేకపోయారు. మంట ఉధృతి కొంతమేర తగ్గిన తర్వాత పూర్తిగా చల్లార్చారు. ఘటనా స్థలిని జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణరెడ్డి పరిశీలించారు. ఆర్డీవో మధుమోహన్‌, తహసీల్దార్‌ బన్సీలాల్‌, ఎంపీపీ మేకల వరలక్ష్మి, ఇండస్ట్రీయల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరి జానాకినాథ్‌ ప్రమాదం జరిగిన విధానాన్ని పరిశీలించారు. సుమారు రూ.5కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు ఆధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.


logo
>>>>>>