సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 31, 2020 , 04:57:47

క్రీడాకారులకు సర్కార్‌ అండ

 క్రీడాకారులకు సర్కార్‌ అండ
  • జనగామలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం హర్షణీయం
  • పాల్గొన్న జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
  • క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిధుల పెంపునకు కృషి

 

జనగామ టౌన్‌, జనవరి 30 : క్రీడాకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జిల్లా జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడి తెలిపారు. 46వ తెలంగాణ జూనియర్‌ అంతర్‌ జిల్లాల బాలబాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను జనగామ జిల్లా కబడ్డీ అసొసియేషన్‌ అధ్యక్షుడు పోగుల సారంగపాణి ఆధ్వర్యంలో జనగామ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీచైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, డీసీపీ శ్రీనివాసరెడ్డి, కబడ్డీ అసొసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్‌, ఆర్టీవో మధుమోహన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా క్రీడా జ్యోతి వెలిగించి జిల్లా, రా్రష్ట్రస్థాయి క్రీడోత్సవాల జెండాలు ఆవిష్కరించారు. క్రీడోత్సవాల ప్రారంభం సందర్భంగా ధర్మకంచ జెడ్పీ స్కూల్‌ చిన్నారులు నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం అతిథులు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఈ క్రీడలు జనగామ జిల్లాలో జరగడం జిల్లాకే గర్వకారణమన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు కలెక్టర్‌, డీసీపీ చేపట్టిన ఏర్పాట్లు అభినందనీయమన్నారు. కబడ్డీ ఆటకు పూర్వవైభవం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడల్లో ప్రతిభ కనబరన్చిన క్రీడాకారులకు మెరిట్‌ను బట్టి స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. 


క్రీడాకారులకు రాష్ట్రప్రభుత్వం అన్నివిధాలుగా ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని, కబడ్డీ అసోసియేషన్‌ కోరిక మేరకు ప్రభుత్వం నుంచి వచ్చే రూ.5 లక్షల నిధులను 15 లక్షల వరకు పెంచేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే జిల్లాలో సీనియర్స్‌ కబడ్డీ మీట్‌ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తుండగా తన వంతుగా సహాయాన్ని అందిస్తానని ఆయన తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. జనగామలో అన్నివిధాల క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం తరుపున మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని, క్రీడాకారులు గెలుపోటములను సాధారణంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున మాట్లాడుతూ జిల్లా కమిటీ కోరిక మేరకు మున్సిపల్‌ నుంచి లైటింగ్‌ ఏర్పాటు చేసి స్టేడియంలోని కబడ్డీ కోర్టులను పర్మినెంట్‌గా ఉండనిస్తామని, అవసరమైతే మున్సిపల్‌ నిధుల నుంచి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. 


అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సీనియర్స్‌ కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహణకు జనగామను ఎంపిక చేస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. రాష్ట్రస్థాయిలో పోటీలకు ఒక్కో జిల్లా నుంచి బాలికలు బాలురు రెండు జట్లుగా మొత్తంగా 66 జట్లుతో 792 మంది క్రీడాకారులు పాల్గొన్నారని సూచించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారుల్లో 12 మంది బాలురు, 12 మంది బాలికలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు. జాతీయ స్థాయి పోటీలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హర్యాన రాష్ట్రంలో జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం కబడ్డీ క్రీడలకు వచ్చిన క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలిరోజు పోటీల్లో జనగామ, సిరిసిల్ల బాలికల కబడ్డీ జట్లు తలపడ్డాయి. కార్యక్రమంలో ఇండియన్‌ రైల్వే కబడ్డీ కోచ్‌ గట్టయ్య, జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌నారాయణగౌడ్‌, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అధ్యక్షుడు వెంకన్న, నర్మెట సీఐ సంతోశ్‌కుమార్‌, డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, కౌన్సిలర్‌ పాండు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు లింగయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, ఉప్పలయ్య, కుమార్‌, సురేశ్‌కుమార్‌, నరేందర్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌, కైలాస్‌, వెంకటేశ్వర్లు ఉన్నారు.

logo