మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Jan 31, 2020 , 04:51:31

వైభవంగా వసంత పంచమి వేడుకలు

వైభవంగా వసంత పంచమి వేడుకలు

జనగామ టౌన్‌, జనవరి 30 : వసంత పంచమి వేడుకలను పురస్కరించింకుని జిల్లా వ్యాప్తంగా జ్ఞానసరస్వతి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా గురువారం పలు సరస్వతీ దేవి ఆలయాల్లో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఉదయం నుంచే భక్తులు చదువులమ్మను దర్శించుకున్నారు. అక్షరాభ్యాసాలు, అభిషేకాలు, సాముహిక కుంకుమార్ఛనలు, ప్రత్యేక పూజలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమునాలింగయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే బీరప్పగడ్డలోని సరస్వతి శిశుమందిర్‌లో పాఠశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో సాముహిక అక్షరభ్యాసాలు నిర్వహించారు. వేడుకల భాగంగా జిల్లా కేంద్రంలోని పలు పాఠశాల్లో, ఇండ్లలో, శ్రీసరస్వతీ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలతోపాటు హోమ కార్యక్రమాలను నిర్వహించారు. బతుకమ్మకుంట ప్రాంగణంలోని శ్రీవిజయ దుర్గా మల్లేశ్వర సహిత రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పుష్పార్చన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈమేరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజలో బతుకమ్మకుంట దుర్గామాత ఆలయ అర్చకులు బీ వేణుగోపాలశర్మ, కర్రె నర్సింహులు, రమేశ, శ్రీనివాసచారి, రాజశేఖర్‌, బాల్నె నీరజ, శ్రీలత స్థానిక ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.


logo
>>>>>>