శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Jan 29, 2020 , 02:43:24

జనగామ పట్టణాభివృద్ధికి సహకరించండి

జనగామ పట్టణాభివృద్ధికి సహకరించండి

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 28 : జనగామ పట్టణాన్ని అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేసేందుకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారం, భాగస్వామ్యం కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున కోరారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తన చాంబర్‌లో సభ్యులు, విభాగ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని 30 వార్డుల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతానన్నారు. ప్రధానంగా పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆమె అధికారులను  ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆకాంక్ష అయిన స్వచ్ఛ జనగామ పట్టణంగా అన్ని వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలను కొనసాగించాలని అన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం నిబంధనల మేరకు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకు లభించిన అవకాశంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో జనగామ పురపాలక సంఘానికి జిల్లా కేంద్రానికి కొత్త హంగులు తీసుకువచ్చేలా పనిచేస్తానని చెప్పారు. రాజకీయాలను కేవలం ఎన్నికల వరకే చూస్తానని, చైర్మన్‌ సీటులో కూర్చున్న తర్వాత ఓట్లు వేసిన వారు, వేయనివారు సహా అన్ని రాజకీయ పార్టీలను సమానంగా భావిస్తానన్నారు. కౌన్సిల్‌ సభ్యులు, అధికారుల సహకారంతో పట్టణంలోని 30 వార్డుల్లో మౌళిక వసతుల కల్పన, సుందరీకరణ, క్లీన్‌అండ్‌ గ్రీన్‌ సిటీగా జనగామను మార్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

చైర్‌పర్సన్‌కు పలువురి శుభాకాంక్షలు..

జనగామ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తర్వాత రెండోసారి ఛాంబర్‌కు వచ్చిన పోకల జమునను పలువురు వ్యాపారులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, స్వర్ణకారులు, వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఆవోపా రాష్ట్ర సలహాదారు పోకల చందర్‌, జిల్లా అదనపు క్యాబినెట్‌ కార్యదర్శి కన్న పరశురాములు, జిల్లా చైర్మన్‌ నాగబండి రవీందర్‌, జనగామ పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు పానుగంటి రామ్మూర్తి, మాలోజు చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, రాఘవాచారి, మురళి, రత్నం, రాంచంద్రం, సత్యనారాయణ, బాలనర్సయ్య, కిరణ్‌, రాజు, అరుణ్‌కుమార్‌ తదితరులు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులను సన్మానించారు. అదేవిధంగా నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం ప్రధాన కార్యదర్శి గజ్జి శంకర్‌ తదితరులు కూడా చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పోకల జమునను కలిసి అభినందించిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు సురుగు సుధాకర్‌గౌడ్‌, అష్రఫ్‌ఖాన్‌, ఆసీఫ్‌, టిల్లు, రాకేశ్‌, అజయ్‌, అఖిల్‌, అజీం, మహేశ్‌, శ్రీకాంత్‌తోపాటు తదితరులు ఉన్నారు. 


logo