గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Jan 29, 2020 , 02:40:14

మేడారం 2020

మేడారం 2020

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం మహాజాతర. ఇంకో వారం రోజులే గడువు. నట్టనడివి అడవిలో దట్టమైన జనారణ్యంగా రూపాంతరం చెందే అద్భుత సన్నివేశం ఆవిష్కృతం కాబోతున్నది. చూడ కన్నులు చాలని తల్లుల జాతర. ఆదిమ గిరిజన సంస్కృతి నుంచి ఆధునిక సాంకేతికల మేళవింపుదాకా అనేకానేక అజరామర ఘట్టాలను మేడారం తన అమ్ముల పొదిలో దాచుకుంటూ కోటానుకోట్ల భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మహాజాతర. మేడారం టర్న్స్‌ ఫ్రం బుల్లక్‌ కార్ట్‌ టు సైబర్‌ మార్ట్‌. ఎడ్లబడ్ల మీద నుంచి హెలిక్యాప్టర్‌ సేవల్ని తమ గద్దెల వద్దకు రప్పించుకునే అపురూప ఘట్టానికి సరిగ్గా వారం రోజులే ఉన్నది. బుధవారం మండమెలిగె పండుగతో జాతరకు అంకుర్పాణ జరుగుతున్నది. దేశ విదేశాల నుంచి భక్తులు మేడారం సమ్మక్క-సారమ్మలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.  తెలంగాణ ధిక్కార సంస్కృతికి ఆలవాలమైన సమ్మక్క-సారమ్మల ఆత్మగౌరవ ప్రతీకలకు నిలువెత్తు సంతకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఆవిర్భావం దాకా, రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి పథాన రాష్ర్టాన్ని పరుగులు పెట్టించే క్రమంలో ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలను దిగంతాలకు చాటేందుకు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లీబిడ్డలిద్దరూ గద్దెల మీద కొలువుదీరి భక్తులకు దీవెనలిచ్చే రోజు (వచ్చేనెల 7న, శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం రాబోతున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. అదేవిధంగా జాతరకు వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా తల్లులను దర్శించుకొని తిరిగి తమతమ గమ్యస్థానాలకు చేరేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. జాతర జాతరకు మధ్య జరుగుతున్న అనేక మార్పులు. సౌకర్యాల్లో కానీ, ఏర్పాట్లలో కానీ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేడారానికి మెరుగైన వసతులు విశిష్టంగా సాగుతున్నాయి. మేడారం జాతర నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచుతున్నది. ప్రత్యక్షంగా జాతరకు వచ్చే భక్తులకు సంప్రదాయ ఏర్పాట్లతోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం సాంకేతికతను మేళవించి ఈసారి అందుబాటులో ఉంచింది. ఇప్పటికే అనేక ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా జాతర విశిష్టతను తెలియజెప్పడమే కాకుండా జాతర ప్రాంగణంలో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, చేసిన ఏర్పాట్లను అరచేతిలో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. మేడారానికి మొబైల్‌ విప్లవం భక్తులకు వారధి కడుతున్నది. అందులో భాగంగా ఈసారి మేడా రం జాతర భక్తులకు ములుగు జిల్లా యంత్రాం గం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రత్యేక అధికారిక యాప్‌ను రూపొందించింది.  మారిన సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ ఫోన్‌ రివల్యూషన్‌ మనిషి మనిషిని ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో ములు గు జిల్లా యంత్రాంగం మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎవరి సహాయం లేకుండానే ఎవరికి వారు స్వీయ మార్గదర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారిక యాప్‌ను రూపొందించింది. 

 మేడారం జాతర 2020 

మేడారం జాతర 2020 పేరుతో ములుగు జిల్లా యంత్రాంగం అఫీషియల్‌ యాప్‌ను రూపొందించింది. ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ అధికారిక ప్రత్యేక యాప్‌ రూపుదిద్దుకున్నది. స్మార్ట్‌ ఫోన్‌ ఆపరేట్‌ తెలిసి ఉంటే చాలు ఎవరి ప్రమేయం లేకుండా మేడారం వెళ్లి  తల్లుల్ని దర్శించుకొని సురక్షితంగా తిరిగి రావడమే కాదు మేడారం మహాజాతర ప్రాంగణంలో ప్రభుత్వం చేసిన సౌకర్యాలు, రూట్‌ మ్యాప్‌ వంటి అనేక విషయాలు ఆ యాప్‌లో ఇమిడి ఉన్నాయి. మడికొండ ఐటీ పార్కులోని కాకతీయ ఐటీ సొల్యూషన్స్‌ ఆ యాప్‌ను రూపొందించింది. రాష్ట్ర నలుమూలల నుంచి జాతరకు వివిధ మార్గాల ద్వారా వచ్చేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, జాతర నిర్వహణ వంటి అన్ని అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయి.  అంతేకాదు జాతర నిర్వహణలో తలమునకలైన వివిధ విభాగాలు, సెక్టోరియల్‌ అధికారులు ఇలా ఒక్కటేమిటీ అన్ని అరచేతిలో ఉన్నట్టే. మెడికల్‌ క్యాంపులు, ఆర్టీసీ బస్‌ పాయింట్లు,  జంపన్నవాగు స్నాన ఘట్టాలు, పోలీసు యంత్రాంగం సూచనలు ఇలా ఒకటేమిటీ అన్ని ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. 


logo
>>>>>>