బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 29, 2020 , 02:30:13

కష్టజీవులను కాటేసిన కరంట్‌

కష్టజీవులను కాటేసిన కరంట్‌

కురవి, జనవరి 28: కూలీకి వెళ్తే కాని పూటగడవని పరిస్థితి...రోజు మాదిరిగానే భూమిలో కేబుల్‌ వేసే రోజు కూలీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన భార్యభర్తలను కరంట్‌ రూపంలో మృత్యువు కాటువేసింది. కూలీకి వెళ్లివచ్చి బట్టలు పిండి ఆరేసే క్రమంలో విద్యుత్‌ తీగ తగిలి ముందుగా భార్య, కాపాడబోయిన భర్త మృతిచెందారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తు ఏడు నెలల బాలుడిని(పేరు పెట్టలేదు) అనాథగా మార్చింది.  ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని సబ్‌స్టేషన్‌ కాలనీకి చెందిన ఆలకుంట్ల ఉపేందర్‌(25), భవాని(22) భార్యభర్తలు. రోజు కూలీకి వెళ్లే ఉపేందర్‌, భవానీ కాంపల్లిలో భూమిలో వేసే కేబుల్‌ వైర్‌ వర్క్‌లో రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్లి సుమారు రాత్రి 8గంటల సమయంలో ఇంటికి వచ్చారు. బట్టలు పిండేందుకు వెళ్లిన భవాని ఆరేసేందుకు పక్కనే కట్టుకున్న ఇనుపవైరు(జే వైరు)పై బట్టలు వేసేందుకు వెళ్లింది. వైరుకు విద్యుత్‌ ప్రసారం కావడంతో దానిని తాకిన భవాని ఒక్కసారిగా భార్య అరుస్తుండగా, ఇంట్లో ఉన్న భర్త ఉపేందర్‌  ఆమెను రక్షించబోయి మృతిచెందాడు. వీరికి ఏడు నెలల బాలుడు ఉన్నాడు. ఇటీవలే బాబుకు అన్నప్రాసన కార్యక్రమం కూడా చేసినట్లు బంధువులు తెలిపారు. తల్లిదండ్రులు మృత్యువాతకు గురికాగా, ఆ చిన్నారిని బంధువులు ఇంటికి తీసుకువెళ్లి నిద్రపుచ్చారు. ఆ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరు కంటతడిపెట్టారు. మృతుడు ఉపేందర్‌ తల్లి రాములమ్మ గతంలోనే మృతిచెందగా, తండ్రి వెంకన్న ఉన్నప్పటికీ కళ్లు సరిగా కనిపించడంలేదు. దీంతో ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని సీరోలు ఎస్సై చంద్రమోహన్‌కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుదాఘాతంతో దంపతులు మృతిచెందిన విషయాన్ని ట్రాన్స్‌కో ఏడీ ప్రసాద్‌బాబుకు గ్రామస్తులు వివరించగా బాధితులకు తగు న్యాయం చేస్తామన్నారు. 


logo
>>>>>>