బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 28, 2020 , 05:00:09

పురపీఠంపై గులాబీ జెండా..

పురపీఠంపై గులాబీ జెండా..

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 27: పునర్విభజన తర్వాత జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన జనగామ మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా రెపరెపలాడింది. 2014 ఎన్నికల్లో పురపాలక సంఘాన్ని కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. ఈసారి మెజార్టీ కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకొని వరుసగా రెండోసారి చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను అధిష్టించింది. అత్యంత ఉత్కంఠ పరిస్థితుల నడుమ సోమవారం జరిగిన ఎన్నికలో చైర్‌పర్సన్‌గా పోకల జమున(టీఆర్‌ఎస్‌), వైస్‌ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్‌(టీఆర్‌ఎస్‌) ఎన్నికయ్యారు. 30 వార్డులున్న జనగామ పురపాలక సంఘంలో టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, స్వతంత్రులు-3 స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓట్లతోపాటు ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకున్నది. ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 13 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, తమకు మద్దతునిచ్చే ముగ్గురు స్వతంత్రులతో కలిసి ప్రత్యేక వాహనంలో కౌన్సిల్‌ హాల్‌కు వచ్చారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల తేడాలో 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నలుగురు బీజేపీ సభ్యులు కౌన్సిల్‌ సమావేశ మందిరంలో అడుగుపట్టారు. అంతకుముందు కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి టీ వినయ్‌కృష్ణారెడ్డి కౌన్సిల్‌ హాల్‌లో ఎన్నిక ప్రక్రియను పరిశీలించి వెళ్లగా, కౌన్సిల్‌ హాల్‌కు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్‌ అధికారి బదావత్‌ సంతోశ్‌ పర్యవేక్షణలో సరిగ్గా ఉదయం 11 గంటలకు ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీవో మధుమోహన్‌ ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్‌ కౌన్సిల్‌ తొలి ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.


 ఆ తర్వాత తొలుత ఎన్నికైన 30 మంది వార్డు కౌన్సిలర్ల తెలుగు అక్షరమాల ప్రకారం పిలిచి వారితో వేర్వేరుగా ప్రమాణస్వీకారం చేయించారు. ముత్తిరెడ్డికి వేదికపై ప్రత్యేకంగా సీటు కేటాయించగా, వేదిక ముందు వరుసలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, తర్వాత టీఆర్‌ఎస్‌కు, చివరి వరుసలో తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులకు సీట్లు కేటాయించారు. సభ్యులందరితో ప్రిసైడింగ్‌ అధికారి తెలుగులో చదివి దైవసాక్షిగా ప్రమాణం చేయగా, ఒకరిద్దరు మాత్రం అంతరాత్మ, ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు. బీజేపీ సభ్యుడు మహాకాంళి హరిశ్చంద్రగుప్త ప్రమాణస్వీకారం తర్వాత భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు సహా ముగ్గురు స్వతంత్రులు గులాబీ కండువాలు కప్పుకోగా, కాంగ్రెస్‌ సభ్యులు, ప్రేమలతారెడ్డి మినహా మిగిలిన ముగ్గురు బీజేపీ సభ్యులు తమ పార్టీ కండువాలు కప్పుకొని ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో రెండువైపులా బారికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ వాహనాలను నిలిపివేసి ఏసీపీ వినోద్‌కుమార్‌, అర్బన్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో కౌన్సిల్‌కు ఎన్నికైన సభ్యులు, ప్రత్యేకంగా జారీ చేసిన పాసులు ఉన్న మీడియా ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించారు. 

 

...... అను నేను..

వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన అను నేనూ.. దైవసాక్షిగా.. ఆత్మసాక్షిగా.. అంతరాత్మ సాక్షిగా అంటూ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు అక్షరమాల ప్రకారం తొలుత అనిత జక్కుల(కాంగ్రెస్‌), అనిత వాంకుడోత్‌(టీఆర్‌ఎస్‌), అరుణ రామగళ్ల(కాంగ్రెస్‌), కర్రె శ్రీనివాస్‌(టీఆర్‌ఎస్‌), ప్రేమలతారెడ్డి గాడిపెల్లి(బీజేపీ), గుర్రం భూలక్ష్మి(టీఆర్‌ఎస్‌), గంగరబోయిన మల్లేశం(కాంగ్రెస్‌), చందర్‌ ముస్త్యాల (కాంగ్రెస్‌), పోకల జమున(టీఆర్‌ఎస్‌), జూకంటి లక్ష్మి(టీఆర్‌ఎస్‌), తాళ్ల సురేశ్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), ముస్త్యాల దయాకర్‌(స్వతంత్ర), దేవరాయి నాగరాజు(స్వతంత్ర), పగిడిపాటి సుధ(టీఆర్‌ఎస్‌), పాక రమ(టీఆర్‌ఎస్‌), పేర్ని స్వరూప(టీఆర్‌ఎస్‌), బాల్దె కమలమ్మ(కాంగ్రెస్‌), బండ పద్మ(టీఆర్‌ఎస్‌), మల్లవరం అరవింద్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), మల్లిగారి చంద్రకళ(కాంగ్రెస్‌), మహాంకాళి హరిశ్చంద్రగుప్త(బీజేపీ), ఎండీ సమద్‌(టీఆర్‌ఎస్‌), మారబోయిన పాండు(కాంగ్రెస్‌), మేకల రాంప్రసాద్‌(టీఆర్‌ఎస్‌), మంత్రి సుమలత(కాంగ్రెస్‌), గాదెపాక రాంచందర్‌(కాంగ్రెస్‌), వంగాల కల్యాణి(కాంగ్రెస్‌), నీల శ్రీజ(స్వతంత్ర), బొట్ల శ్రీనివాస్‌(బీజేపీ), ఉడుగుల శ్రీలత(బీజేపీ) వరుస క్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.


చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక..

అనంతరం 11.30 గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టిన ప్రిసైడింగ్‌ అధికారి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల విప్‌లు జారీ చేసిన అంశాన్ని, ధిక్కరిస్తే ఎదురయ్యే పరిణామాలను సభ్యులకు వివరించారు. ఆ తర్వాత పార్టీలు ‘బీ’ ఫారాలు ఇచ్చి ఖరారు చేసిన చైర్‌పర్సన్‌ అభ్యర్థుల పేర్లను చదవి వినిపించి చైర్‌ పర్సన్‌ పదవికి పోటీ పడుతున్న పోకల జమున(టీఆర్‌ఎస్‌), మంత్రి సుమలత(కాంగ్రెస్‌) ఇద్దరిలో ఒకరికి అక్షరమాల ప్రకారం ఓటింగ్‌ ప్రక్రియను చేపట్టారు. తొలుత టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్‌ పోకల జమున పేరును 14వ వార్డు టీఆర్‌ఎస్‌ సభ్యురాలు పేర్ని స్వరూప ప్రతిపాదించగా, 28వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఎండీ సమద్‌ బలపర్చాడు. జమునకు మద్దతు ఇస్తున్న వారు కూర్చొని చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్‌ నిర్వహించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, 13 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు సహా మొత్తం 17 మంది సభ్యుల మద్దతు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి లభించింది. 


అనంతరం కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మంత్రి సుమలత పేరును 15వ వార్డు కాంగ్రెస్‌ సభ్యుడు మారబోయిన పాండు ప్రతిపాదించగా, 16వ వార్డు కాంగ్రెస్‌ సభ్యులు గాదేపాక రాంచందర్‌ బలపరిచగా, ఆ పార్టీకి చెందిన 10 మంది కాంగ్రెస్‌ సభ్యులు మద్దతు పలికారు. అనంతరం మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్న టీఆర్‌ఎస్‌కు చెందిన పోకల జమున చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి మధుమోహన్‌ అధికారికంగా ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా, 23వ వార్డు టీఆర్‌ఎస్‌ సభ్యుడు మేకల రాంప్రసాద్‌ పేరును 7వ వార్డు టీఆర్‌ఎస్‌ సభ్యుడు మల్లవరం అరవింద్‌రెడ్డి ప్రతిపాదించగా, 21వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కర్రె శ్రీనివాస్‌ బలపర్చగా, చైర్‌పర్సన్‌ ఎన్నికలో ఓటేసిన 17 మంది చేతులెత్తడంతో టీఆర్‌ఎస్‌ తరఫున మేకల రాంప్రసాద్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌కు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను ప్రిసైడింగ్‌ అధికారి అందించగా, తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లకు చైర్‌పర్సన్‌ ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో మెజార్టీ సభ్యుల బలం లేకున్నా కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నామమాత్రంగా పోటీ చేసి ఓటమిపాలు కాగా,  నలుగురు సభ్యులున్న బీజేపీ మాత్రం తటస్థంగా ఉంది.


చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ..

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చైర్‌పర్సన్‌ పీఠం దక్కడం ఖాయ కాగా.. అభ్యర్థి ఎవరనే దానిపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు చైర్‌పర్సన్‌ పదవి ఆశిస్తున్న బండ పద్మ, పోకల జమున, పగిడిపాటి సుధలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎవరి పేరుపై ‘బీ’ఫారం ఇస్తుందోనని క్షణక్షణం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత హైదరాబాద్‌ క్యాంపు నుంచి టీఆర్‌ఎస్‌, స్వతంత్రులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్వయంగా వెంట తీసుకొని ఉదయం 9 గంటలకు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొన్న అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేసిన తర్వాత వారితో కలిసి ఎమ్మెల్యే కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్నారు. 


సభ్యులంతా కౌన్సిల్‌హాల్‌ కూర్చుని ఉన్న సమయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అంతా తానై తమ సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులకు ఓటింగ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపాదించే, బలపరిచే సభ్యులు ఎవరనే అంశాలపై దఫదఫాలుగా సూచనలు చేస్తూ, వైస్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్న స్వతంత్ర సభ్యుడు దేవరాయి నాగరాజు సహా చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లను ప్రతిపాదించే, బలపరిచే వారితో ఎమ్మెల్యే బయటకు పిలిచి మంతనాలు జరిపారు. కొద్ది నిమిషాల్లో చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందనగా, టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికలో నిమిషాల వ్యవధిలో అత్యంత ఆసక్తిర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్‌పర్సన్‌గా పోకల జమున పేరు ప్రతిపాదించగానే అప్పటి వరకు సీల్డ్‌ కవర్‌లో తన పేరు వస్తుందని పదవిపై ఆశలు పెట్టుకున్న బండ పద్మ ఖంగుతిన్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఓటింగ్‌లో పాల్గొన్న మరుక్షణమే కంటతడి పెడుతూ కౌన్సిల్‌ హాల్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు.


జమున బాధ్యతల స్వీకరణ

చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పోకల జమున కౌన్సిల్‌ హాల్‌లో ధ్రువీకరణ పత్రం అందించిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన ఆమెను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రిసైడింగ్‌ అధికారి, ఆర్డీవో మధుమోహన్‌, జిల్లా అసిస్టెంట్‌ ఎన్నికల అథారిటీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌ యాదవ్‌ సమక్షంలో పలువురు కౌన్సిలర్లు చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛాలు అందించి స్వీటు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ విభాగాల అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేతోపాటు చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలుకుతూ స్వీట్లు పంచారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, అవోపా, ఆర్యవైశ్య సంఘం నాయకులు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకొని పోకల జమున లింగయ్యను సన్మానించారు.


పట్టణ అభివృద్ధికి పెద్దపీట

కౌన్సిలర్‌గా ఎన్నుకున్న వార్డు ప్రజలు, చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్న కౌన్సిలర్ల ఆశలు వమ్ము చేయకుండా తనకు లభించిన అవకాశంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తా. వ్యాపార, రాజకీయ రంగంలో ఎనలేని సేవలు అందించిన ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు, తన భర్త లింగయ చైర్మన్‌ కావాలని చిరకాల వాంఛ ఉండేది. అయితే, రిజర్వేషన్‌ కారణంగా తనకు మాత్రమే లభించిన ఈ గొప్ప అవకాశంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తన భర్త లింగయ్య సహకారంతో జిల్లాకేంద్రానికి నూతన హంగులు తీసుకొచ్చేలా కష్టపడి పనిచేస్తా.

-  పోకల జమున, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌


అదృష్టంగా భావిస్తున్నా..

తనను రెండోసారి కౌన్సిలర్‌గా గెలిపించిన 23వ వార్డును మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా. అదేవిధంగా తనకు వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. చైర్‌పర్సన్‌తో కలిసి జనగామ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తా.

- మేకల రాంప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌


కేటీఆర్‌ సీఎంగా సారథ్యం వహించాలి

రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 112 పురపాలక సంఘాలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లను గెలిపించిన యువనేత కేటీఆర్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి. కేటీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాకేంద్రాన్ని వ్యాపారుల చేతుల్లో పెడితేనే మరింత అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్డు విస్తరణకు సహకరించిన వారి రుణం తీర్చుకునేందుకే పోకల జమున అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. జనగామ మున్సిపల్‌ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడించిన పట్టణ ప్రజలకు ధన్యవాదాలు.

- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే 


logo
>>>>>>