శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 28, 2020 , 04:44:18

తొర్రూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

తొర్రూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
  • అభివృద్ధికి సహకరించాలి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జనవరి 27: తొర్రూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మరియు ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. పార్టీలు అభివృద్ధికి సహకరించాలని, ప్రజల భాగస్వామ్యంతో తొర్రూరు రూపురేఖలు మారుస్తానని అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారోత్సవానికి ఎక్స్‌ అఫీషియో హోదాలో మంత్రి హాజరయ్యారు. చైర్మన్‌గా ఎన్నికైన మంగళపల్లి రామచంద్రు, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన జినుగ సురేందర్‌రెడ్డిని ఈ సందర్భంగా అభినందించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో తొర్రూరును డివిజన్‌ కేంద్రంగా, మున్సిపాలిటీగా మార్చానని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన పూర్తిస్థాయిలో పాలకవర్గం ఉన్నందున అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి వార్డుకూ అవసరమైన నిధులు కేటాయిస్తానని చెప్పారు. పార్టీ ఆదేశాలకు మేరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక చేసినట్లు తెలిపారు. మాడ్గుల నట్వర్‌కు చైర్మన్‌ రావాల్సి ఉండే కానీ, పార్టీ ఆదేశాల మేరకు రామచంద్రుకు ఇచ్చినట్లు తెలిపారు. నట్వర్‌కు మంచి స్థానాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు.


 పార్టీ కోసం పని చేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ముగిశాయని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు అభివృద్ధిపై దృష్టి సారించి వార్డుల్లో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.  కలిసి కట్టుగా తొర్రూరును అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. ఎన్నికల ముందు మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. ఎన్నికల తర్వాత అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తొర్రూరు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేయించానని, ఇక పనులు వేగవంతం చేయడమే లక్ష్యమన్నారు. పని చేస్తూ ప్రజలకు సేవలు అందించే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. 


logo