సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Jan 27, 2020 ,

‘ప్రగతి’పథంలో పల్లెలు

‘ప్రగతి’పథంలో పల్లెలు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెలన్నీ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జనగామ పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఆదివారం జరిగిన 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్నారు. కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధులను ఆయన సత్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజోపకరంగా ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంది మహానుభావుల కృషి, పోరాటాలు, త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్‌ నాయకత్వాన రూపొందిన రాజ్యాంగం 1950, జనవరి 26న  అమలులోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

అభివృద్ధి పథంలో జనగామ..

ప్రత్యేక రాష్ట్రంలో జనగామ జిల్లా కేంద్రంగా ఎదిగి ప్రగతి బాటలో పయనిస్తున్నది చెప్పారు. ఇటీవల రెండు దఫాలుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం నూరు శాతం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. జిల్లాలోని 281 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, నర్సీలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి మండలానికి వారంలో ఒక రోజు ప్రత్యేంగా గ్రీవెన్స్‌ కేటాయించి భూసమస్యల్ని పరిష్కరించామన్నారు. 1,54,565 మందికి పట్టాపాసుపుస్తకాలు అందించామన్నారు. ఈ ఏడాది 8,427 క్వింటాల్ల విత్తనాలు రాయితీపై పంపిణీ చేశామన్నారు. రాయితీపై సేంద్రియ ఎరువులను, పురుగు మందులను ఖరీఫ్‌ పంట కాలంలో పంపిణీ చేశామన్నారు. రైతుబంధు కింద రూ.138కోట్లు, 79,037 మంది రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామన్నారు.  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా 2004 కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. 4,465 రెండు పడక గదుల నిర్మాణాలు ప్రారంభించామని, ఇందులో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ కోసం 12,311 ఎకరాల భూమిని సేకరించామని, 287 చెరువులను నీటితో నింపామన్నారు. ఉపాధి కూలీలకు రూ.35.15 వేతనాల రూపంలో చెల్లించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 74.43 లక్షల మొక్కల్ని నాటినట్లు పేర్కొన్నారు. ‘వన్‌ జీపీ వన్‌ నర్సరీ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి గ్రామ పంచాయతీలో శాశ్వత ప్రాతిపదికన నర్సరీలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 72,625 మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొల్ల కురుమలకు 12,642 గొర్రెల యూనిట్‌లను సరఫరా చేసామని, ఇందుకోసం రూ.158.03 కోట్లు వ్యయం చేసినట్లు వివరించారు. 221 లక్షల చేప పిల్లలను 453 రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు పంపిణీ చేశామన్నారు. 10,321 టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యం కాగా 9,010 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పురుడు పోసుకున్న మహిళలకు ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు ఆర్థిక సహాయం నాలుగు విడుతల్లో అందిస్తున్నామన్నారు. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కోసం జిల్లాకు రూ.1.27 కోట్లు  కేటాయించినట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ కింద నీటి సరఫరా కోసం 1284.03 కి.మీ. పైపులైన్‌ వేశామన్నారు. జిల్లాలో 28  చెక్‌ డ్యాంల  కోసం ప్రతిపాదనలు పంపించామని, సాంకేతిక అనుమతులు రావాల్సి ఉందన్నారు. పౌరసరఫరాల శాఖలో ఈ-పాస్‌ విధానాన్ని అమలుచేయడం వల్ల వృథాను అడ్డుకోగలిగామన్నారు. 522 పాఠశాలల విద్యార్థుల మధ్యాహ్నం భోజనం కోసం 1,148 టన్నుల బియ్యాన్ని సరఫరా చేశామన్నారు. 75 కేంద్రాల్లో 17,171 మంది రైతుల నుంచి  60,296 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రూ.108.03 కోట్లతో కొనుగోలు చేశామన్నారు. పల్లెప్రగతిలో 21 కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరు చేయగా 17 పూర్తయ్యాయని తెలిపారు. రూ.100కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. స్పీడ్‌ లేజర్‌ గన్ల ఏర్పాటుతో జరిమానాల రూపంలో రూ.5.5 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, జేసీ ఓజే మధు, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మధుమోహన్‌, ఏసీపీ వినోద్‌, జెడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్‌డీవో రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన సంబురాలు

ధర్మకంచ మినీ స్టేడియంలో గణతంత్ర సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పేరిణి నృత్య బృందంతో ప్రారంభమైన కార్యక్రమాలు ఆద్యంతం మమైరిపించాయి. జఫర్‌ఘడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామ రెసిడెన్షియల్‌ విద్యార్థులు పోటా పోటీగా ప్రదర్శనలు ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతల విశిష్టతను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ స్టాళ్లను ఏర్పాటుచేసింది. గృహనిర్మాణ శాఖ రెండు పడక గదుల పై, వ్యవసాయ శాఖ విత్తనాలకు సంబంధించి, అటవీశాఖ మొక్కల పెంపకం ప్రాధాన్యత, వైద్య ఆరోగ్యశాఖ, మిషన్‌ భగీరథ, ఐసీడీఎస్‌ తదితర శాఖలు తాము చేస్తున్న పనులపై స్టాళ్లను ప్రదర్శించారు.


logo