సోమవారం 30 మార్చి 2020
Jangaon - Jan 27, 2020 ,

‘ఆమె’ ఎన్నికకు ఏర్పాట్లు

‘ఆమె’ ఎన్నికకు ఏర్పాట్లు

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారాణాకి వేదిక సిద్ధమైంది. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం తెర వెనుక వ్యూహాలకు నాయకులు పదునుపెట్టారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌గా ఎవరికి చేతులెత్తి జై కొడతారో వేచి చూడాల్సిందే. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలుండగా టీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 10, బీజేపీ 4, స్వతంత్రులు మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌కే స్వతంత్రులు మద్దతు పలకడానికి సిద్ధమయ్యారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 16కు చేరనుంది. లెక్కింపు పూర్తయ్యాక విజేత కౌన్సిలర్లు విహారయాత్రకు వెళ్లారు. వారంతా సోమవారం కౌన్సిల్‌ హాల్‌లో కనిపించనున్నారు. ముందుగా ఆర్డీవో మధుమోహన్‌ నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. పరోక్ష ఎన్నిక నిర్వహణకు ఒక గెజిటెడ్‌ అధికారికి ఆథరైజేషన్‌ ఇచ్చే అధికారం జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డికి ఉంది. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఈ అధికారంతో ఆయన ఆర్డీవోకు బాధ్యత అప్పగించారు.

ఎన్నిక విధానం ఇలా..

చైర్‌పర్సన్‌ కోసం బరిలో నిలిచే అభ్యర్థులు అప్పటికప్పుడే ఫారాన్ని నింపి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. చైర్‌పర్సన్‌కు పోటీ పడే వ్యక్తిని ఓ కౌన్సిలర్‌ ప్రతిపాదించాలి. మరో కౌన్సిలర్‌ బలపర్చాల్సి ఉంటుంది. ఒకే ఫారం అందితే చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. ఎక్కువ మంది పోటీ పడితే కౌన్సిలర్లు ఎక్కువ మంది ఎవరికి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తుతారో వారే చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఒక్కో సమయంలో ఇద్దరికీ సమానంగా బలం ఉంటే అప్పుడు ఎక్స్‌అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఆ సమయంలో ఎక్స్‌అఫీషియో ఓటు ఎవరికి పడితే వారే పీఠాన్ని చేజిక్కించుకుంటారు. ఏవైనా కారణాల వల్ల చైర్‌పర్సన్‌ ఎన్నిక వాయిదా పడాల్సి వస్తే మరుసటి రోజుకే వాయిదా వేస్తారు. అప్పటికీ చైర్‌పర్సన్‌ ఎంపిక పూర్తికాకుంటే జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం ఇస్తారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే జనగామలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిది మందికి ఎక్స్‌అఫీషియోలుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మున్సిపల్‌ అధికారులు ఇప్పటికే ఆ తొమ్మిది మందికి సమాచారం ఇచ్చారు. శనివారం వరకు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు మొదట జనగామలో నమోదు చేయించుకోవాలనుకుప్పటికీ పరిస్థితుల కారణంగా చివరి నిమిషంలో చేర్యాల మున్సిపాలిటీలో నమోదు చేసుకున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు పరోక్ష ఎన్నిక సమయంలో పార్టీ నిర్ణయానికి కాకుండా సొంత నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీలు విప్‌ జారీ చేస్తాయి. విప్‌ జారీ అయ్యాక ఆ పార్టీ నుంచి గెలిచిన వారు పార్టీ నిర్ణయాన్నే ఏకీభవిస్తారు. అందుకే ముందస్తుగా పార్టీలు విప్‌ జారీ చేస్తాయి.

అందరి చూపు కో-ఆప్షన్‌ వైపు..

మున్సిపల్‌ నూతన పాలకవర్గం కొలువుదీరుతున్న నేపథ్యంలో ఆశావహుల దృష్టి కో-ఆప్షన్‌ పదవిపై పడింది. మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్‌ సభ్యులు ఉంటారు. ఇందులో రెండు మైనార్టీలుండగా అందులో ఒక మహిళ తప్పనిసరి. మరో రెండు స్పెషల్‌ నాలెడ్జ్‌ కేటగిరీ కింద కేటాయించారు. అందులో ఒక మహిళ సభ్యురాల్ని తప్పనిసరిగా ఎంపిక చేస్తారు. మున్సిపల్‌ కమిషనర్‌ కోఆప్షన్‌ సభ్యుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి అర్హుల జాబితా రూపొందిస్తారు.


logo