ఆదివారం 24 మే 2020
Jangaon - Jan 26, 2020 , 03:28:58

గులాబీ గుబాళింపు

గులాబీ గుబాళింపు
 • -13 వార్డులు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌
 • -గతంతో పోలిస్తే పెరిగిన ఏడు స్థానాలు
 • -పది వార్డులకే పరిమితమైన కాంగ్రెస్‌
 • -పరువు నిలుపుకున్న బీజేపీ, స్వతంత్రులు
 • -ఉనికి టీడీపీ, వామపక్షాలు
 • -13వ వార్డులో ఒక ఓటుతో కాంగ్రెస్‌ అభ్యర్థి
 • -25వ వార్డులో రెండు ఓట్ల తేడా..
 • -ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు
 • -పర్యవేక్షించిన కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
 • -టీఆర్‌ఎస్‌కు ముగ్గురు స్వతంత్రుల మద్దతు
 • -ఇక చైర్‌పర్సన్‌ ఎన్నిక లాంఛనమే


ఉత్కంఠ తొలగిపోయింది. జనగామ మున్సిపాలిటీలో గులాబీ గుబాళించింది. మొత్తం 30 వార్డుల్లో 13 స్థానాలను కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో కంటే తన బలాన్ని మరో ఏడింటికి పెంచుకుంది. శనివారం ఏకశిల బీఈడీ కళాశాలలో కౌంటింగ్‌ను ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, అనంతరం ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఉదయం 11.30 వరకు ప్రక్రియ మొత్తం పూర్తికాగా ఫలితాలన్నీ వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ మాత్రం పది స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 4, స్వతంత్రులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. కాగా, ఇండిపెండెంట్లు మద్దతివ్వడంతో టీఆర్‌ఎస్‌ సంఖ్య 16కు చేరుకుంది. దీంతో చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. 
- జనగామ జిల్లా ప్రతినిధి / జనగామ, నమస్తే తెలంగాణ

జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళించింది. శనివారం ఏకశిల బీఈడీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. ఉదయం 8 నుంచే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభ మైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, తర్వాత ఒకేసారి 30 వార్డుల్లో ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. 10గంటల నుంచి అభ్యర్థుల బలాబలాలు తేలుతుతుండటంతో ఇటు కౌంటింగ్‌ కేంద్రంలో, అటు బయట అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో టెన్షన్‌తో ఉన్నారు. పట్టణంలో మొత్తం 30వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇండిపెండెంట్లు -3 స్థానాల్లో గెలుపుపొందారు. 2014 మున్సిపోల్స్‌తో పోలిస్తే ఈసారి టీఆర్‌ఎస్‌ అదనంగా 7 వార్డుల్లో గులాబీజెండా ఎగురవేయగా, కాంగ్రెస్‌ 4వార్డులను కోల్పోయింది. బీజేపీ, స్వంతంత్ర అభ్యర్థులు గతంలో గెలుచుకున్న వార్డులను నిలబెట్టుకోగా, సీపీఐ, సీపీఎం ఒక్కస్థానమూ సాధించలేదు. 2014లో 28 వార్డులకు 14స్థానాల్లో కాంగ్రెస్‌, 6 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, 4 వార్డుల్లో బీజేపీ, 3 వార్డుల్లో ఇండిపెండెంట్లు, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థులు గెలిచారు. తాజా గా కాంగ్రెస్‌ బలం 14 నుంచి 10కి పడగా, టీఆర్‌ఎస్‌ 6 వార్డుల నుంచి 13 వార్డుల్లో గెలిచింది. టీడీపీ నామరూపాల్లేకుండా గల్లంతైంది. మొత్తం 40,099 ఓట్లలో 31,832 పోలవ్వగా వాటిలో ఏడు పోస్టల్‌, 298 రిజెక్టు, 167 నోటాకు పోగా మిగిలిన 31,374ఓట్లలో గెలిచిన అభ్యర్థులు 6,472ఓట్లు టీఆర్‌ఎస్‌కు, 5,002 ఓట్లు కాంగ్రెస్‌కు, 1,551బీజేపీ, 1,259ఓట్లు స్వతంత్రులకు పోలయ్యాయి. మిగిలిన ఓట్లు ఆయా వార్డుల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్లు, ఓటమిపాలైన వారికి పడ్డాయి. గతంతో పోలిస్తే పట్టణంలో టీఆర్‌ఎస్‌కు ఓటుబ్యాంకు, కౌన్సిలర్‌ స్థానాలు పెరిగాయి. పట్టణ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక దృష్టి, ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఈసారి ఓటింగ్‌శాతం పెరిగి, మునుపటి కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. 2014లో కేవలం ఆరు స్థానాల్లో గెలిచి బీజేపీ, స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠం సాధించిన టీఆర్‌ఎస్‌ ఈసారి ఏకంగా 13 కౌన్సిలర్‌ స్థానాలు గెలిచి ముగ్గురు స్వతంత్రులు, కౌన్సిల్‌లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదైన మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓట్లతో కలిపి చైర్‌పర్సన్‌ పీఠాన్ని కైవసం చేసుకునే మెజార్టీతో గులాబీజెండా ఎగురనున్నది. గత కౌన్సిల్‌లో కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులే ఈసారీ కూడా చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో కీలకమే.

రెండోసారి కౌన్సిలర్లుగా..

2014 మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహించిన పలువురు ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి వరుసగా రెండోసారి కౌన్సిలర్లుగా గెలుపొందారు. వీరిలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి 18వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థ్ధిగా, 19వ వార్డులో మార్కెట్‌ మాజీ చైర్‌పర్సన్‌ బండ పద్మ 19వ  వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, వంగాల కల్యాణి 6వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థ్ధిగా, 17 వార్డు నుంచి జక్కుల అనిత కాంగ్రెస్‌ అభ్యర్థ్ధిగా, 23 వార్డు నుంచి మేకల రాంప్రసాద్‌ రెండోసారి గెలిచారు.

24 మంది కొత్తగా ఎన్నిక

2020 మున్సిపల్‌ ఎన్నికల్లో 30వార్డులకు 24 మంది సభ్యులు కొత్తగా కౌన్సిల్‌కు ఎన్నికవ్వగా..ఆరుగురు మాత్రం గతంలో కౌన్సిలర్లుగా పనిచేసిన తాజా, మాజీ సభ్యులు ఉ న్నారు.  కొత్తగా ఎన్నికైన వారిలో రామగళ్ల అరుణ(1వ వార్డు), వాంకుడోత్‌ అనిత (3వ వార్డు), పగిడిపాటి సుధా (3వ వార్డు), మంత్రి సుమలత (4వ వార్డు), దేవరాయి నాగరాజు (5వ వార్డు), మల్లవరం అరవింద్‌రెడ్డి (7వ వార్డు), తాళ్ల సురేశ్‌రెడ్డి (9వ వార్డు), ఎం చందర్‌ (9వ వార్డు), ఎన్‌ శ్రీజ (10వ వార్డు), పాక రమ (11వ వార్డు), గుర్రం భూలక్ష్మి (12వ వార్డు), మల్లిగారి చంద్రకళ (13వ వార్డు), పేర్ని స్వరూప (14వ వార్డు), మారబోయిన పాండు(15వ వార్డు), గాదెపాక రాంచందర్‌ (16వ వార్డు), జూకంటి లక్ష్మి (20వ వార్డు), కర్రె శ్రీనివాస్‌ (21వ వార్డు), బాల్దె కమలమ్మ (22వ వార్డు), జీ మల్లేశ్‌ (24వ వార్డు), ఉడుగుల శ్రీలత (15వ వార్డు), పోకల జమున (26వ వార్డు), ఎండీ సమద్‌ (28వ వార్డు), ఎం దయాకర్‌ (29వ వార్డు), బొట్ల శ్రీనివాస్‌ (30వ వార్డు) కొత్తగా కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. వీకల్యాణి (6వ వార్డు), జక్కుల అనిత (17వ వార్డు), గాడిపెల్లి ప్రేమలతారెడ్డి (18వ వార్డు), బండ పద్మ (19వ వార్డు), మేకల రాంప్రసాద్‌ (23వ వార్డు) 2014 కౌన్సిల్‌లో సభ్యులుగా ప్రాతినిధ్యం వ హించగా, హరిశ్చంద్రగుప్త (27వ వార్డు) గతంలో ఒక పర్యాయం కౌన్సిలర్‌కు ఎన్నికై తాజాగా మరోసారి గెలుపొందారు.

గంటన్నరలోనే రిజల్ట్‌

కౌంటింగ్‌ ప్రారంభమైన తొలిగంటన్నర లోపే అంటే ఉదయం 9.30 గంటల నుంచి ఆయా వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్ధుల బలాబలాల ట్రెండ్‌  మొదలై ఉదయం 11.30గంటల వరకు మొత్తం అన్ని వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి.  కౌంటింగ్‌ మొదలైన అరగంటలోపే మొత్తం 30 వార్డుల ఫలితాలు వెలువడగా ఎటువైపు మొగ్గు ఉన్నదో వెనువెంటనే తెలిసిపోయింది. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, కాగితాలు తీసుకుపోవడాన్ని నిషేధించారు. కౌంటింగ్‌కు ముందు ప్రిసైడింగ్‌ అధికారి సంతకంతో ఉన్న 17సీ ఫారం వివరాలు ఏజెంట్లకు తెలిపి మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కించగా మొత్తం 7ఓట్లు వచ్చాయి. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల్లో ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన అధికారులు 17 సీ ఫారంలో పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల వివరాలతో పోలైన ఓట్లు, బాక్సులో నిక్షిప్తమైన ఓట్లను సరిచూసుకున్నారు. వాటిని ఏజెంట్లు నోట్‌ చేసుకున్న అనంతరం బాక్స్‌ల సీల్‌ను తొలచి ఒక్కో వార్డులో రెండు పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలను జంబ్లింగ్‌ చేసి మొత్తం ఓట్లను 25 చొప్పున లెక్కించి కట్టలు కట్టారు. తర్వాత మరోసారి పోలైన ఓట్లతో బ్యాలెట్‌ పత్రాల సంఖ్యను సరిచూసుకొని బ్యాలెట్‌ పత్రాల లెక్కించి అభ్యర్ధుల వారీగా ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసి తర్వాత మరోసారి మొత్తం ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థి ఓట్లు మిగిలిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలను వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించడం సహా వెబ్‌కాస్టింగ్‌ విధానంతో ఎన్నికల సంఘం అధికారులు లైవ్‌లో వీక్షించారు. లెక్కింపు కేంద్రం లోపల, బయట మూడంచల భారీ భద్రతాను ఏర్పాటు చేయగా, కౌంటింగ్‌ తీరును రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు బాదావత్‌ సంతోష్‌, జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, రాష్ట్ర అసిస్టెంట్‌ ఎన్నికల అథారిటీ, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్‌, కమిషనర్‌ నోముల రవీందర్‌ యాదవ్‌ పరిశీలించగా, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విద్యాధికులే..

కొత్తగా కౌన్సిల్‌కు ఎన్నికైన వారిలో ముగ్గురు టీఆర్‌ఎస్‌ సభ్యులు విద్యాధికులు కాగా, వారిలో వాంకుడోత్‌  అనిత ఎంటెక్‌ చదివి మొన్నటి వరకు క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కౌన్సిలర్‌గా పోటీచేసి రాజకీయ అరంగేట్రం చేశారు. తాళ్ల సురేశ్‌రెడ్డి బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి 10ఏళ్లు యూరప్‌లో ఉద్యోగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. పేర్ని స్వరూప బీఏ బీఈడీ పూర్తి చేసి మహిళా సంఘంలో చురుకైన పాత్ర పోషించి రాజకీయాల్లోకి వచ్చారు.

 గెలిచిన.. ఓడిన మాజీ కౌన్సిలర్లు

గతంలో కౌన్సిల్‌కు ఎన్ని కై తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మ హంకాళి హరిశ్చంద్రగుప్త 27వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందగా, గత కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం వహించిన వెన్నం శ్రీలత 5 వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థ్ధిగా పోటీచేసి ఓటమి పాలవ్వగా, ఎండీ అన్వర్‌ 29వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఒక్క  ఓటుతో 13 వార్డులో..రెండు ఓట్లతో 25వ వార్డులో గెలుపు..

పట్టణంలోని 30 వార్డుల ఫలితాలు దాదాపు గంటన్నరలోపు వెల్లడికాగా, మధ్యాహ్నం తర్వాత అధికారికంగా ప్రకటించారు. తొలుత కొన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధులు నువ్వా, నేనా అన్నట్లు తలపడగా, మరికొన్ని వార్డుల్లో టీఆర్‌స్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులకు స్వతంత్రులు చివరి వరకు గట్టిపోటీ ఇచ్చారు. 13వ వార్డులో తొలుత కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లిగారి చంద్రకళ గెలుపొందినట్లు ప్రకటించగా టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి పానుగంటి సువార్త అభ్యంతరం తెలపడంతో రెండుసార్లు అనధికారికంగా, ఒకసారి ఆర్‌వో అనుమతితో అధికారికంగా రీకౌంటింగ్‌ చేపట్టగా ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థ్ధి గెలిచినట్లు ప్రకటించారు. ఇక 25 వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఉల్లెంగుల నవ్యశ్రీ (299)పై బీజేపీ అభ్యర్ధి ఉడుగుల శ్రీలత (301) ఓట్లు సాధించి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, మున్సిపల్‌ పరిధిలోని మొత్తం 30 వార్డుల్లోనే 23వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మేకల రాంప్రసాద్‌ 592 ఓట్ల మెజార్టీ, 15 వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థ్ధి మారబోయిన పాండు (కాంగ్రెస్‌) 588 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థిపై మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఇదే వార్డు నుంచి రెండు ఓట్లతో ఓడిపోయి ఇప్పుడు మంచి మెజార్టీతో గెలుపొందారు. 600పై చిలుకు ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్లో 11, 12, 21, 23, 28వ వార్డులకు చెందిన పాక రమ, గుర్రం భూలక్ష్మి, కర్రె శ్రీనివాస్‌, మేకల రాంప్రసాద్‌, ఎండీ సమద్‌ ఉన్నారు.

ఓడిన తల్లీ కూతుళ్లు, భార్యాభర్తలు

ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో పలు వార్డుల్లో ఒకే ఇంటి నుంచి తల్లీకూతుళ్లు, భార్యభర్తలు హోరాహోరీగా తలపడ్డారు. వీరిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వేమళ్ల సత్యనారాయణరెడ్డి సతీమణి అరుణ 20 వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఆయన కుమార్తె మనీషారెడ్డి 3వ వార్డు నుంచి పోటీ చేసి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. 24వ వార్డు నుంచి భార్యాభర్తలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సానబోయిన ఉమేశ్‌, ఆయన భార్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచి ఓటమిపాలయ్యారు. ఆరో, ఎనిమిదో వ వార్డుల్లో భార్యాభర్తలు వంగాల మల్లారెడ్డి, వంగాల కల్యాణి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేసి, గెలుపొందగా, మల్లారెడ్డి ఓడారు. గత కౌన్సిల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆకుల రజని ఆమె భర్త ఆకుల సతీశ్‌ రెండుస్థానాల్లో పోటీ చేసి ఓడారు. గతంలో ఒకసారి కౌన్సిలర్‌గా పనిచేసిన సుంకరనేని రఘు 28వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.logo