బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Jan 26, 2020 , 03:22:58

చైర్మన్ల ఎంపిక బాధ్యత అధిష్టానానిదే

చైర్మన్ల ఎంపిక బాధ్యత అధిష్టానానిదే(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ): మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌లో శనివారం సాయంత్రం అందుబాటులో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, బానోతు శంకర్‌నాయక్‌, నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌ పాల్గొన్నారు. జనగామ, భూపాలపల్లి, డోర్నకల్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రెడ్యానాయక్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై చర్చించారు. ఈ రెండు పదవుల ఖరారు విషయంలో పార్టీదే తుది నిర్ణయమని, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా పేర్లు ఖరారు అవుతాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఎన్నికల కోసం ఆదివారం నుంచి సోమవారం ఎన్నిక ప్రక్రియ వరకు క్యాంపులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం పార్టీ తరఫున విప్‌ జారీ చేయాల్సి ఉంటుందని, ఈ బాధ్యతలను ఒకరికి అప్పగించాలని అభిప్రాయం వ్యక్తమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఆధిక్యత ఇచ్చిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలకు, పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంపై ఎమ్మెల్యేలను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.


logo
>>>>>>