శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Jan 25, 2020 , 02:05:13

విజేతలెవరో?

విజేతలెవరో?

మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. మున్సిపల్‌ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పురపోరులో విజేతలెవరో వెల్లడికానుంది. ఈనెల 22న పట్టణంలోని 30 వార్డులకు పోలింగ్‌ జరగగా, శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం ఏకశిల బీఈడీ కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.          - జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మరికొన్ని గంటల్లో గెలుపెవరిదో తేలనుంది. పలు వార్డుల నుంచి కౌన్సిలర్‌గా బరిలో నిలిచిన వారి భవితవ్యం తేటతెల్లం కానుంది. రాజకీయ నేతల ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. ఈనెల 22న 30 వార్డుల్లో నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం శనివారం అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. 27న జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

కాంగ్రెస్‌లో క్యాంపు రాజకీయం

కాంగ్రెస్‌ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందనే ప్రచారం జనగామలో జోరుగా సాగుతున్నది. 30 వార్డులకు 29 వార్డుల్లోనే కాంగ్రెస్‌ పోటీ చేసింది. కాంగ్రెస్‌లో వర్గ పోరు ఎన్నికల సందర్భంగా బట్టబయలైంది. టికెట్లు జారీ చేసే విషయంలో కాంగ్రెస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నారు. కాంగ్రెస్‌ తీరు నచ్చక కొందరు పార్టీకి రాజీనామా చేశారు. జంగా, పొన్నాల రెండు వర్గాల మధ్య కార్యకర్తలు నలిగిపోయారు. మొదటి నుంచి కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపడంపై ఆ పార్టీ నేతలు పెదవి విరిచారు. ఒక దశలో బరిలో నిలవడానికి అభ్యర్థులు కరువై ఒకే కుటుంబం నుంచి ఇద్దరిద్దరికి పార్టీ టికెట్లు కేటాయించి బరిలో నిలిపింది. అయినప్పటికీ 30 వార్డుల్లో పోటీ చేయలేకపోయింది. క్యాంపు రాజకీయాల పై కాంగ్రెస్‌ అభ్యర్థులతో చర్చలు జరిగాయని తెలిసింది. పొన్నాల వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులను ఇప్పటికే జనగామ జిల్లా కేంద్రం నుంచి మరోచోటకు తరలించారని తెలిసింది. ఇక జంగా వర్గం కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. రాజకీయ చరిత్రలో రెండు వేర్వేరు పార్టీలు క్యాంపు రాజకీయాలు చేయడం చూశాం.. కానీ ఒకే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి క్యాంపు రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే దక్కిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

గెలుపోటములపై పట్టణవాసుల చర్చ

22న ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనగామలో ఎక్కడ చూసినా ఫలితాల విశ్లేషణపైనే చర్చించుకున్నారు. ఉదయం బతుకమ్మ కంటలో, హోటల్లో కబుర్లు చెప్పుకుంటూ తమ తమ వార్డుల స్థితిగతులపై మాట్లాడుకున్నారు. ముగ్గురు, నలుగురు కలిశారంటే చాలు ఎన్నికల విషయమే తప్ప మరో ముచ్చట వినిపించలేదు. మా వార్డులో ఫలాన వ్యక్తి అంటే ఫలానా వ్యక్తి అని సరదాగా వాదులాడుకున్న సంఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. ఫలితాలపై కొన్ని చోట్ల పందెం కూడా కాసారంటే అతిశయోక్తి కాదు. అభ్యర్థులు తాము పడిన కష్టానికి ఫలితం ఉంటుందా ఉండదా అనే విషయాలపై బేరీజు వేసుకున్నారు. ఎన్నికలు ముగిశాక తమదైన శైలిలో పోలింగ్‌ సరళిపై వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వీధుల వారిగా, కులాల వారీగా, పోలింగ్‌ బూత్‌లో నమోదైన ఓట్లతో పోల్చుకున్నారు. పోలైన ఓట్లలో తమకు ఎంత శాతం ఓట్లు వస్తే గెలుస్తామో.. అని లెక్కలు వేసుకున్నారు. స్వతంత్య్ర అభ్యర్థులు పోటీ ఇచ్చిన వార్డులో అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. స్వతంత్య్ర అభ్యర్థులు ఏ పార్టీ ఓట్లు చీల్చారు, దాని వల్ల ఏ పార్టీకి ఉపయోగం తదితర అంశాలను క్షుణ్ణంగా అభ్యర్థులు తమ సన్నిహితుల వద్ద చర్చించుకున్నారు. దీని ఆధారంగా వారు గెలుపోటములపై ఒక స్పష్టతకు వచ్చారు.

గెలుపు తమదేనంటూ అభ్యర్థుల ధీమా..

పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు తాము సేకరించుకున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం తనవైపే మొగ్గు చూపినట్లు తేలిన వారు ఎంతో ధీమాతో కనిపిస్తున్నారు. కాస్త అటు ఇటుగా ఉన్న వారు ఆందోళనకరంగా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఓటమి పాలవుతాముకున్న వారు మా ప్రయత్నం మేము చేశామని, ఫలానా అభ్యర్థి గెలవకుండా ఓట్లు చీల్చామని చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కచ్చితంగా గెలుస్తామనే దృఢంగా నమ్మకం ఉన్న వారు శనివారం సంబురాలు ఏవిధంగా జరుపుకోవాలో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ఏకశిల కళాశాలలో ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచే పార్టీల ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఏజెంట్లకు ఇప్పటికే ప్రత్యేక పాసులను జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేశారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించాక సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. అనుకున్న సమయానికి ఉదయం 8.30కు బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే ఉదయం 11: 30 గంటల వరకు లెక్కింపు  పూర్తికానుంది. లెక్కింపు ఆలస్యమైతే ఫలితాల వెల్లడి కూడా ఆలస్యమయ్యే వీలుంటుంది. మొత్తంగా మధ్యాహ్నంలోగా ఫలితాలు వెల్లడికానున్నాయి.

లెక్కింపు కేంద్రం సందర్శన

లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. లెక్కింపు కేంద్రంలోని ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు. లెక్కింపు జరగనున్న నాలుగు గదులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. టేబుళ్ల ఏర్పాట్లు, పార్టీల ఏజెంట్లకు కేటాయించిన స్థలం, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లపై జిల్లా సహాయ ఎన్నికల అధికారి రవీందర్‌కు వారు పలు సూచనలు చేశారు. లెక్కింపు ప్రక్రియ పూర్తిగా సీసీ కెమెరాల్లో బంధించనున్నారు. వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా ఉన్నతాధికారులు చూసేలా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

27న ప్రమాణ స్వీకారం

లెక్కింపు పూర్తయ్యాక విజేతలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపికపై నోటీసు ఇవ్వనున్నారు. గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణస్వీకారం ఈనెల 27న మున్సిపల్‌ కౌన్సిల్‌హాల్‌లో జరగనుంది. ఆ వెంటనే పరోక్షంగా ఎన్నుకునే చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉండటంతో అదే రోజు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. పరోక్ష ఎన్నిక కోసం జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఓట్ల లెక్కింపునకు గట్టి బందోబస్తు : డీసీపీ శ్రీనివాసరెడ్డి

జనగామ టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వెస్ట్‌జోన్‌ జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, నాయకులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు. శనివారం కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్థులు ఏజెంట్లు, విలేకరులు సంబంధిత ఐడెంటిటీ కార్డులు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఎన్నికల అధికారుల అనుమతి ఉన్న కార్డు హోల్డర్స్‌ను మాత్రమే కౌంటింగ్‌హాల్‌కు అనుమతిస్తారన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన, ఓడిన అభ్యర్థులు సంయమనం పాటించాలన్నారు.  సోషల్‌ మీడియాలో ఇతర మనోభావాలను దెబ్బతీసేలా కామెంట్లు, పోస్టులు పెడితే  కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
logo