గురువారం 09 ఏప్రిల్ 2020
Jangaon - Jan 25, 2020 , 02:01:58

గుడ్డు.. వెరీ బ్యాడ్‌

గుడ్డు.. వెరీ బ్యాడ్‌
  • - అంగన్‌వాడీ కోడిగుడ్లపై జెడ్పీలో రగడ
  • - కాంట్రాక్టర్ల కక్కుర్తిపై సభ్యుల ఆగ్రహం
  • -రోజురోజుకూ ‘చిన్న’బోతున్నదంటూ ఆందోళన
  • - పట్టించుకోని అధికారులపై మండిపాటు
  • - విచారణకు ఏకగ్రీవ తీర్మానం
  • - చైర్మన్‌ పాగాల అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం
  • -హాజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ మధు
  • - పలు శాఖల అధికారుల పనితీరుపై గరంగరం


జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 24 : అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అధికారులు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని, కాంట్రాక్టర్ల కక్కుర్తితో కోడిగుడ్డు సైజు చిన్నబోతున్నదని సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఓజే మధు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జెడ్పీ సీఈవో రమాదేవి పాల్గొనగా అధ్వానంగా మారిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, నాణ్యత లేని నాసిరకం కోడిగుడ్డు పంపిణీపై గంటన్నరపాటు వాడీవేడిగా చర్చ జరిగింది. కోడిగుడ్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణకు జెడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టగా సమావేశ చైర్మన్‌ ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ వ్యవహారంపై ప్రత్యేక అధికారితో పూర్తి విచారణకు జేసీ ఆదేశించారు. తొలుత వ్యవసాయశాఖ, వైద్య, ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో అధికారుల తీరుపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐసీడీఎస్‌పై జరిగిన చర్చలో సీడీపీవో పావని తమ శాఖ లక్ష్యాలను వివరిస్తుండగా..

జోక్యం చేసుకున్న జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి గుడ్డు సంగతి ఏంటీ మేడం అని ప్రశ్నించి ‘గుడ్డు వెరీబ్యాడ్‌' అనడంతో మిగిలిన సభ్యులంతా ఒక్కసారిగా తమ ప్రాంతాల్లోనూ ఇదే తీరుగా ఉందని, తాము జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిందని భగ్గుమన్నారు. చిన్నసైజు గుడ్డును సరఫరా చేస్తుంటే పోషకాహారం ఎలా అందుతుందని జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మి ఐసీడీఎస్‌ అధికారులను నిలదీశారు. ఆమె వ్యాఖ్యాలకు సభ్యులు పుస్కూరి శ్రీనివాసరావు, నాగిరిరెడ్డి, బొల్లం అజయ్‌ గుడ్డుపై సంపూర్ణ చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. కోడి నుంచి మొదటగా వచ్చే తోలుగుడ్డును పడేయకుండా వాటిని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చిన్నసైజు కోడుగుడ్లను అందిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు బొల్లం అజయ్‌ ఆరోపించారు. కొన్ని కేంద్రాల్లో పాల ప్యాకెట్‌ కూడా అందించడంలేదని ఎంపీపీ నాగిరెడ్డి ప్రస్తావించారు. ప్రతిష్టాత్మకమైన మాతాశిశు సంరక్షణ పథకాన్ని నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడ్డు సరఫరాలో అసలు దొంగలెవరో తేల్చే వరకు ప్రత్యేక విచారణ కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు.
 

మిడ్డే మీల్స్‌లో నీళ్ల చారు..

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో పప్పు వడ్డించకుండా నీళ్ల చారుతో సరిపెడుతున్నారని జెడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి అధికారులపై మండిపడ్డారు. దేవరుప్పుల కేజీవీబీలో అందిస్తున్న ఆహారంలో నాణ్యత లేదని, విద్యార్ధులు గగ్గోలుపెడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని జెడ్పీటీసీ భార్గవి ఆరోపించారు. 200 మంది విద్యార్థులకు అరకిలో టమాటాలు వడ్డిస్తే సరిపోతుందా? అంటూ జఫర్‌ఘడ్‌ జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 5వ తరగతి విద్యార్థి తెలుగు పుస్తకంలో యాదాద్రి పాఠ్యాంశం చదవలేకపోవడంపై పాలకుర్తి జెడ్పీటీసీ, జెడ్పీ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివాసరావు అసహనం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కాలనీలో ప్రైమరీస్కూల్‌ ఉపాధ్యాయులను మండలంలోని విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూల్‌కు మార్చాలని ఎంపీపీ జయశ్రీ కోరారు. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు పెరుగుతున్నాయని రఘునాథపల్లి జెడ్పీటీసీ బొల్లం అజయ్‌ అన్నారు.

ఫోన్‌ చేస్తేనే స్పందిస్తారా..?

ప్రసూతి కోసం చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌కు వెళ్తే వైద్యులు పట్టించుకోవడంలేదని కొడకండ్ల ఎంపీపీ ధరావత్‌ జ్యోతి ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ చేసిన తర్వాత వైద్యులు పట్టించుకోవడంలేదని, కుట్లు పగిలిపోయాయని చెబితే ఫొటో తీసి పంపించాలని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై ఆమె మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటైన తరిగొప్పుల పీహెచ్‌సీలో వైద్యుడు, 108 వాహనం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు ముద్దసాని పద్మజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో బాగా పనిచేస్తున్న ఎంపీడీవోను కావాలనే డిప్యూటేషన్‌పై పంపించారని ఆమె ఆరోపించగా, దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ సంబంధిత మంత్రి ఆదేశంతోనే బదిలీ జరిగిందని సమాధానం ఇచ్చారు. రఘునాథపల్లి పీహెచ్‌సీలో ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు ఉండేలా చూడాలని ఎంపీపీ వరలక్ష్మి కోరారు. లింగాలఘనపురం మండలంలో 4 సబ్‌సెంటర్లు, 3 గ్రామాలకు ఆశాలు, హెడ్‌ క్వార్టర్‌లో యూడీసీ, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి కోరారు. ఎంసీహెచ్‌లో ఫోన్‌చేసే వరకు వైద్యులు స్పందించడంలేదని జనగామ ఎంపీపీ మేకల కళింగరాజు ఆరోపించారు. జిల్లాకు మిషన్‌ భగీరథ ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి నిరంతర తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.674 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వాటర్‌గ్రిడ్‌ ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. డీటీపీసీ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ప్లాట్ల విక్రయాలు, గ్రామపంచాయతీల్లో ఎంబీ రికార్డుల్లో నమోదు కాకుండా డబ్బులు డ్రా చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని జనగామ జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా ప్రభుత్వశాఖల అధికారులు, డాక్టర్‌ రఘు, లత, మల్లికార్జున్‌, సాగర్‌, నూరోద్దీన్‌, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రావు, రామాచారి, నాగేశ్వరశర్మ, శంకర్‌రావు ఉన్నారు.logo